Srinagar : కశ్మీరంలో అనూహ్యం
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:49 AM
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
జమ్మూకశ్మీర్‌లో ఎన్సీ-కాంగ్రెస్ కూటమికి పట్టం
ఎన్సీ-42, కాంగ్రెస్-6, బీజేపీకి 29 సీట్లు
హంగ్ అంచనాలన్నీ తలకిందులు.. ఎన్సీ - కాంగ్రెస్ కూటమికి పట్టం.. 42 సీట్లు నెగ్గిన నేషనల్ కాన్ఫరెన్స్
శ్రీనగర్, అక్టోబరు 8: హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..! కానీ, వీటికి తావు లేకుండా జమ్మూకశ్మీర్ ఓటర్లు తీర్పు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)-కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు. 90 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్సీ 51, కాంగ్రెస్ 32, సీపీఎం, జేకేఎన్‌పీపీ ఒక్కోచోట పోటీ చేశాయి.
ఐదుచోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీకి ఐదుగురు ఎమ్మెల్యేలను గవర్నర్ నామినేటెడ్ చేయడంతో సంఖ్య 95కు పెరిగింది. కనీస మెజార్టీ 48గా మారింది. దీనినీ ఎన్సీ కూటమి అధిగమించింది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమికి తొలి విజయం కశ్మీర్ నుంచే అందినట్లైంది. హరియాణాలో దారుణంగా విఫలమైన ఆప్.. కశ్మీర్‌లోని దోడా స్థానాన్ని కైవసం చేసుకుని బోణీ కొట్టింది. మొత్తం ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలయ్యారు. సకీనా మసూద్, షమీమా ఫిర్దౌస్ (ఎన్సీ)తో పాటు బీజేపీ నుంచి షగున్ పరిహార్ గెలిచారు.
ఎన్సీ సూపర్.. పీడీపీ బేజార్
కశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీ హవా సాగింది. సొంతంగా కనీస మెజార్టీకి 6 సీట్లు దూరంలో నిలిచింది. మొత్తం 23.43 శాతం ఓట్లు సాధించింది. గత ఎన్నికల కంటే (20.33) ఇది మూడు శాతం అధికం. ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా బుద్గామ్, గందేర్‌బల్‌లో రెండుచోట్లా గెలుపొందారు. కశ్మీర్ అనగానే గుర్తొచ్చే మరో ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫంట్ (పీడీపీ) దారుణ ప్రదర్శన కనబర్చింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని ఈ పార్టీ గత ఎన్నికల్లో 28 సీట్లు నెగ్గగా ఇప్పుడు 25 కోల్పోయింది. ఓట్ల శాతం 22.67 నుంచి 8..87కు పడిపోయింది.
జమ్మూలో కమలం జోష్
జమ్మూలో హిందూ జనాభా ఎక్కువ. అదే సమయంలో కశ్మీర్‌లో ముస్లిం ప్రాబల్యం అధికం. ఉమ్మడి రాష్ట్రంలో 87 సీట్లుండేవి. ఆర్టికల్ 370 రద్దు చేశాక అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్ మిగిలింది. నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి ఎన్నికలు నిర్వహించారు. దీంతో జమ్మూలో సీట్ల సంఖ్య 37 నుంచి 43కి చేరింది. కశ్మీర్ లోయలో సీట్లు మాత్రం ఒక్కటే పెరిగి 47 అయ్యాయి.
ఇక జమ్మూలోని 43 సీట్లకు గాను.. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ 29 స్థానాలను ఖాతాలో వేసుకుంది. ఉమ్మడి కశ్మీర్‌లో 2014లో 23 శాతం ఓట్లతో బీజేపీ 25 సీట్లు నెగ్గింది. ఇప్పుడు ఓట్లు 25.64 శాతానికి పెరిగాయి. ఓట్ల శాతం ఎన్సీ కంటే బీజేపీకే ఎక్కువ కావడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర రైనా పరాజయం పాలయ్యారు. కాగా, కశ్మీర్ పీసీసీ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మాత్రం విజయం సాధించారు. సీపీఎం అభ్యర్థి మొహమ్మద్ యూసుఫ్ తరిగామి కుల్గాంలో వరుసగా ఐదోసారి జయకేతనం ఎగురవేశారు.
హస్తం ప్రభావం శూన్యం
ఎన్సీతో జట్టు కట్టినా కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రదర్శన పేలవంగా ఉంది. పదేళ్ల కిందట 18 శాతం ఓట్లతో 12 సీట్లలో గెలవగా.. ప్రస్తుతం 12 శాతం ఓట్లే సాధించింది. ఇతరులు సాధించిన 30.09 శాతం ఓట్ల కంటే ఇది తక్కువ. జమ్మూలో 29చోట్ల బరిలో దిగి ఒకచోటనే హస్తం నెగ్గింది. లోయనే కాస్త ఆదుకుంది.
Updated Date - Oct 09 , 2024 | 03:58 AM