Politics: అయోధ్యలో బీజేపీ ఓటమిపై శరద్ పవార్, రాహుల్ విసుర్లు..
ABN, Publish Date - Jun 12 , 2024 | 05:29 PM
లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.
పుణె, మలప్పురం: లోక్ సభ ఎన్నికల్లో అయోధ్య(Ayodhya)ఉన్న ఫైజాబాద్‌లో బీజేపీ ఓటమిపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. రాముడి పేరుతో రాజకీయాలు చేయాలని చూసిన వారికి ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎన్సీపీ నేత శరద్ పవార్(Sharad Pawar) విమర్శించారు.
బారామతిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఫైజాబాద్‌లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా అయోధ్య ప్రజలు మతపరమైన రాజకీయాలను ప్రోత్సహించబోమని చెప్పకనే చెప్పారన్నారు. రాజకీయాలను, మత విశ్వాసాలను ప్రజలు కలిపి చూడరని తాను ముందే ఊహించినట్లు తెలిపారు.
‘‘బీజేపీ(BJP) రామమందిరాన్ని ఎన్నికల అజెండాగా ఉపయోగించుకోవాలని అనుకుంది. కానీ దేశ ప్రజలు తెలివైనవారు. ఆలయం పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని గ్రహించి.. బీజేపీకి 60 సీట్లు తగ్గించారు. యూపీ ప్రజలు ఎన్నికల్లో విభిన్నమైన తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుతో ఒక రకంగా బీజేపీ ఓడిపోయిందనే అనుకోవచ్చు. దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంది. రాజకీయాలతో దాన్ని అంతం చేయడం ఎవరి తరం కాదు.
10ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టానుసారంగా పాలన చేసింది. అందుకే ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. మోదీకి ప్రస్తుతం మెజారిటీ లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిహార్ సీఎం నితీష్ కుమార్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి మునపటిలా ఒంటెద్దు పోకడలకు వెళ్లకుండా.. వారి అభిప్రాయాలకు కూడా విలువనివ్వాలి’’ అని పవార్ పేర్కొన్నారు.
హింసకు చోటులేదని ఇచ్చిన తీర్పు: రాహుల్
యూపీలో బీజేపీని ఓడించి అక్కడి ప్రజలు హింసకు వ్యతిరేకంగా తీర్పిచ్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) అన్నారు. కేరళలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వారణాసిలో ప్రధాని మోదీ(PM Modi) తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నారని ఎద్దేవా చేశారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు లేదని అయోధ్య ప్రజలు సందేశాన్ని ఇచ్చారని రాహుల్ అన్నారు.
రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు ముందు బీజేపీ నేతలు ప్రకటనలు చేశారని, ఎన్నికల తర్వాత రాజ్యాంగ ప్రతిని మోదీ నుదుటికి అద్దుకున్నట్లు గుర్తు చేశారు. బీజేపీ నియంతృత్వ పోకడలు చెల్లవని కేరళ, యూపీ రాష్ట్రాల ప్రజలు నిరూపించినట్లు రాహుల్ అన్నారు. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ సిట్టింగ్ బీజేపీ ఎంపీ లల్లూ సింగ్ 54వేలపై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Updated Date - Jun 12 , 2024 | 05:34 PM