Union Cabinet : పింఛనుకు కొత్త పథకం
ABN, Publish Date - Aug 25 , 2024 | 04:49 AM
ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏకీకృత పింఛను
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి
చివరి 12 నెలల మూలవేతనం సగటులో పింఛన్‌గా 50ు పొందే వెసులుబాటు
25 ఏళ్ల సర్వీసుకు అంతమొత్తం.. 10 ఏళ్ల సర్వీసుకు కనీస పింఛను 10 వేలు
ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం.. 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ధి
రాష్ట్రాలు అమలు చేయాలని సూచన.. అమలైతే 90 లక్షలకు లబ్ధిదారుల సంఖ్య
బయో ఈ-3 విధానానికి క్యాబినెట్ పచ్చజెండా.. విజ్ఞాన్ ధార పథకానికి ఆమోదం
త్వరలో బయో విప్లవంకేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఏకీకృత (యూనిఫైడ్) పింఛన్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని వల్ల పదవీ విరమణ పొందే ఉద్యోగులకు ఇప్పుడు లభిస్తున్న ప్రయోజనాల కంటే.. ఏకీకృత పింఛన్ పథకం(యూపీఎస్)లో మరింత లబ్ధి చేకూరనుంది.
రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం కోరింది. శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు.. బయోఈ-3 విధానానికి క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో మూడు వేర్వేరు పథకాలను కలిపి.. విజ్ఞాన్ ధార పథకంగా అమలు చేయాలని నిర్ణయించింది.
క్యాబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీవైష్ణవ్ వివరాలను వెల్లడించారు. యూపీఎస్ ద్వారా సుమారు 23 లక్షల మంది ఉద్యోగలకు లబ్ధి చేకూరుతుందని ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అమలు చేస్తే.. లబ్ధిదారుల సంఖ్య 90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ‘‘ప్రస్తుతం పింఛన్ విధానాల బకాయిలు రూ.800 కోట్లుగా ఉన్నాయి. కొత్త పింఛన్ అమలుతో తొలి ఏడాది రూ.6,250 కోట్ల వరకు అదనంగా అవసరం ఉంటుంది.
ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న జాతీయ పింఛన్ పథకం(ఎన్‌పీఎస్) నుంచి కొత్త పెన్షన్ స్కీమ్(యూపీఎ్‌స)కు మారేలా అవకాశం కల్పిస్తాం’’ అని ఆయన వివరించారు. ఇంతకు ముందే ఈ విధానం అమలుకు కసరత్తును ప్రారంభించామని, ఉద్యోగులు పలు అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తే.. ఆ మేరకు మార్పులు చేసి, అమల్లోకి తీసుకువస్తున్నామని చెప్పారు.
ఈ అంశంపై అన్ని రాష్ట్రాల్లో 100కి పైగా సమావేశాలు నిర్వహించి, అన్నివర్గాలతో చర్చలు జరిపామన్నారు. ప్రభుత్వోద్యోగుల శ్రేయస్సు, సురక్షితమైన భవిష్యత్ కోసమే ఈ విధానాన్నితీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కొత్త పింఛన్ విధానం ఉద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రతను కల్పిస్తాయన్నారు.
యూపీఎ్‌సలో ముఖ్యాంశాలు..
కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన ఏకీకృత పింఛన్ పథకం ఉద్యోగులకు పింఛన్ హామీని పెంచుతూ.. గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలకు భరోసా ఇస్తోంది. ఆ వివరాలు..
పింఛన్‌కు భరోసా: కనీసం 25 సంవత్సరాలు సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్ అయ్యేవారికి పదవీ విరమణకు ముందు 12 నెలలు తీసుకున్న బేసిక్ పే సగటులో 50ు పింఛన్‌గా వస్తుంది.
కనీసం 10 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని, రిటైర్ అయ్యేవారికి అనులోమానుపాతంలో పింఛన్ వస్తుంది. ఇది 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారితో పోలిస్తే.. తక్కువగా ఉంటుంది. అంటే.. పింఛన్ హామీ కనీసం రూ.10 వేలుగా ఉంటుంది.
ఉద్యోగి మరణిస్తే.. పింఛన్‌లో 60% ఆయన/ఆమె కుటుంబ సభ్యులకు అందుతుంది.
అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ(ఏఐసీపీఐ-డబ్ల్యూ) ప్రకారం పింఛన్/కుటుంబ పింఛన్‌దారులకు కరువు ఉపశమనం లభిస్తుంది.
రిటైర్ అయ్యాక.. గ్రాట్యుటీతోపాటు సత్వరం అదనపు లబ్ధి ఉంటుంది. దీన్ని సర్వీసులో ప్రతి ఆర్నెల్ల ప్రాతిపదికన లెక్కగడతారు. అంటే.. సర్వీసులో ఉండగా.. ప్రతి ఆర్నెల్లకు ఒక నెల జీతం+కరువు భత్యంలో పదో వంతు చొప్పున లెక్క కట్టి.. రిటైర్ అయిన వెంటనే ఆ మొత్తం ఇస్తారు. ఇది గ్రాట్యుటీకి అదనం.
బయోఈ-3 విధానంతో ప్రగతి
బయో ఉత్పాదక రంగాన్ని ప్రోత్సహించేలా బయోఈ-3 (బయోటెక్నాలజీ ఫర్ ఎకానమి, ఎన్విరాన్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్) విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బయో రంగంలో పరిశోధనలు, అభివృద్ధి, వ్యవస్థాపతకు ఈ విధానం దోహదపడుతుందని అశ్వినీవైష్ణవ్ వివరించారు.
పారిశ్రామిక, ఐటీ విప్లవాల మాదిరిగా త్వరలో బయో విప్లవం రాబోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనివల్ల బయోటెక్నాలజీ, బయోసైన్స్ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలున్నాయన్నారు. బయో కృత్రిమ మేధ(ఏఐ) హబ్‌లు, బయో ఉత్పాదక కేంద్రాలు, బయోఫౌండ్రీల ఏర్పాటుకు ఈ విధానం దోహదపడుతూ.. బయో రంగం వాణిజ్యీకరణకు వేగంగా అడుగులు పడతాయన్నారు.
గ్రీన్ గ్రోత్ ద్వారా బయో ఎకానమి నమూనాలకు ప్రాధాన్యత లభిస్తుందని, ఈ విధానంతో భారతదేశ నైపుణ్య శ్రామికశక్తి విస్తరణను సులభతరం చేయడమే కాకుండా.. ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుందని వివరించారు.
‘‘నెట్ జీరో కార్బన్ ఎకానమి, లైఫ్‌స్ట్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను ఈ విధానం మరింత బలోపేతం చేస్తుంది. బయోఈ-3 విధానం ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటూ.. మరింత స్థిరమైన, వినూత్నమైన భవిష్యత్తుకు మార్గాన్ని సుగమం చేస్తుంది.
వికసిత్ భారత్ కోసం బయో-విజన్‌ను నిర్దేశిస్తుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఆహార భద్రత, మానవ ఆరోగ్యానికి సంబంధించిన క్లిష్టమైన సామాజిక సమస్యలకు పరిష్కారంగా ఈ విధానం ఉంటుంది. పారిశ్రామికీకరణలో పెట్టుబడులకు ఉపకరిస్తుంది’’ అని అశ్వినీవైష్ణవ్ వ్యాఖ్యానించారు.
విజ్ఞాన్ ధార పథకం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణలు, సాంకేతికాభివృద్ధి వంటి పథకాలను(మూడు గొడుగుల పథకాలు) ‘విజ్ఞాన్ ధార’ పేరుతో ఏకీకృత పథకంగా అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
సంబంధిత విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడం వల్ల.. సమర్థంగా నిధుల వినియోగం, ఉప పథకాలు/కార్యక్రమాల మధ్య సమన్వయం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మూడు పథకాలకు 15 ఆర్థిక సంఘం(2021-22 నుంచి 2025-26 వరకు) రూ.10,579 కోట్లను ఖర్చు చేయాలని నిర్దేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
Updated Date - Aug 25 , 2024 | 04:51 AM