ఆ వినాశనం మీకే తెలుసు ఖర్గే!
ABN , Publish Date - Nov 13 , 2024 | 06:00 AM
జాకార్లు తన గ్రామాన్ని కాల్చివేసి, తల్లిని, సోదరిని హత్యచేసిన విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎలా విస్మరిస్తారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ఖర్గే తన బాల్యంలో జరిగిన ఈ విషాదాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లోని ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఖర్గేపై యోగి
మీ గ్రామాన్ని రజాకార్లు కాల్చేశారు
మీ తల్లిని, సోదరిని చంపేశారు
అయినా,ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో మీరెక్కడా ప్రస్తావించరు
కాంగ్రెస్ అధ్యక్షుడిపై యోగి విమర్శలు
ముంబై, నవంబరు 12 : రజాకార్లు తన గ్రామాన్ని కాల్చివేసి, తల్లిని, సోదరిని హత్యచేసిన విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎలా విస్మరిస్తారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. బుజ్జగింపు రాజకీయాల కోసం ఖర్గే తన బాల్యంలో జరిగిన ఈ విషాదాన్ని మరిచిపోతున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని అచల్‌పూర్‌లోని ఎన్నికల ప్రచారంలో మంగళవారం ఖర్గేపై యోగి పెద్దఎత్తున విమర్శల దాడి చేశారు. భారత యూనియన్‌లో చేరడానికి నిరాకరించి హైదరాబాద్ సంస్థానం తిరుగుబాటు చేయగా, సంస్థానం, నిజాం తరఫున రజాకార్లు పోరాడారు. అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. 1948లో జరిగిన ఈ ఘర్షణల్లో బీదర్ ప్రాంతంలోని ఖర్గే గ్రామం రజాకార్ల దాడికి గురైంది. ఇటీవల ఎన్నికల సభలో ఖర్గే మాట్లాడుతూ.. కొందరు ఒకవైపు కాషాయ దుస్తులు ధరిస్తూనే, మరోవైపు ‘విడిపోతే మన దేహాలు ముక్కలవుతాయి’ అంటూ విద్వేష వ్యాఖ్యలు చేస్తుంటారంటూ యోగిపై ధ్వజమెత్తారు. ‘‘కొందరు కాషాయ దుస్తులు ధరిస్తారు. జుట్టు లేని నున్నటి తలతో ఉంటారు. సాధువుల వేషంలో ఉంటారు. కానీ, వాళ్లు రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు కూడా అవుతారు. నిజమైన యోగి రాజకీయాలకు దూరంగా ఉంటాడు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన యోగి.. నిజాం కాలం నాటి విషయాలను తన ఎన్నికల ప్రసంగంలో గుర్తుచేస్తూ.. ఖర్గేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. విడిపోవడం ఎంత భయానకమో..వాళ్లు (రజాకార్లు ) ఎన్ని అకృత్యాలకు వొడిగడతారనేందుకు ఖర్గే బాల్యంలో చోటుచేసుకున్న విషాదమే నిదర్శనమని యోగి అన్నారు. కానీ, ముస్లిముల ఓట్లు పోతాయనే భయంతో అప్పటి విషయాలూ, దేశం కోసం తన కుటుంబం చేసిన త్యాగం గురించి ఖర్గే ఎక్కడా ప్రస్తావించరని దుయ్యబట్టారు. తనపై కాకుండా.. ఖర్గే తన గ్రామాన్ని, కుటుంబాన్ని, హిందువులను తగలబెట్టిన రజాకార్లపై ఆగ్రహించాలన్నారు. కాగా, మహా వికాస్ అఘాడి అధికారంలో ఉండగా.. లవ్ జిహార్, ల్యాండ్ జిహాద్‌కు అడ్డాగా మహారాష్ట్రగా మారిందని యోగి అన్నారు. .
హిందువులు ఏకం కావాలి
శాఖాపరంగా ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ హిందువులంతా ఏకం కావాల్సిందేనని జగద్గురు రామభద్రాచార్య అన్నారు. ‘విడిపోతే మన దేహాలు ముక్కలవుతాయి’ అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానన్నారు. ‘యోగి చెప్పింది వాస్తవమే. మనమెన్నటికీ విడిపోరాదు. మనం ఒక్కటిగా ఉంటే ఎవరూ మనకు హాని తలపెట్టలేరు’ అని వ్యాఖ్యానించారు.
నేడే వయనాడ్ ఉప ఎన్నిక
వయనాడ్: కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నిక బుధవారం జరుగనుంది. ఇక్కడ మొత్తం 16 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ ప్రియాంకా గాంధీ, లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎ్‌ఫ)కు చెందిన సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరీ, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ మధ్యే నెలకొంది. ఎన్నికల్లో ప్రియాంకకు అనుభవం లేకపోవడం తమకు కలిసి వస్తుందని ఈ ఇద్దరూ భావిస్తున్నారు. సత్యన్ 2014లో ఇక్కడి నుంచి పోటీచేసి కాంగ్రెస్ మెజారిటీని 20 వేలకు తగ్గించారు. 2019లో 4.3 లక్షలకుపైగా మెజారిటీతో గెలిచిన రాహుల్‌కు.. 2024 ఎన్నికల్లో 3.6 లక్షల ఓట్ల ఆధిక్యం మాత్రమే వచ్చింది. 2019లో ఇక్కడ మొదటిసారి గెలిచిన రాహుల్.. నియోజకవర్గానికి అడపాదడపా మాత్రమే వస్తుండేవారు. ఆయన ప్రధాని అవుతారన్న ఉద్దేశంతోనే నియోజకవర్గ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో గెలిపించారని.. కానీ ఆయన ఈ సీటుకు రాజీనామా చేశారని.. రాజకీయానుభవం లేని ప్రియాంక కూడా గెలిస్తే కనిపించరని సీపీఐ, బీజేపీ అభ్యర్థులు ప్రచారం చేశారు. అయితే తాను 1989 నుంచి రాజకీయంగా క్రియాశీలంగా ఉన్నానని.. అప్పట్లో తన తండ్రి తరఫున ప్రచారం కూడా చేశానని ప్రియాంక చెప్పుకొన్నారు.