Share News

Wayanad: వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:36 AM

వయనాడ్‌లో భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 24 మందికి చేరింది. మొత్తంగా 70 మందికి గాయాలైనట్టు సమాచారం.

Wayanad: వయనాడ్ విలయం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

కేరళ: వయనాడ్‌లో భారీ వర్షాలు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 24 మందికి చేరింది. మొత్తంగా 70 మందికి గాయాలైనట్టు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, కేఎస్‌డీఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలను రక్షించేందుకు యత్నిస్తున్నామని కేరళ మంత్రి వీణా జార్జ్ అన్నారు. కేరళలో వర్షాలు విధ్వంసం జరుగుతోంది. ముఖ్యంగా వయనాడ్‌ను అయితే వరదలు చుట్టుముట్టాయి. దీంతో అక్కడి పరిస్థితి దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగి పడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ 24 మంది మరణించినట్టు గుర్తించారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల పరిహారాన్ని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది.


వయనాడ్ ఘటనపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. వయనాడ్‌లోని మెప్పాడి సమీపంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతో తాను తీవ్ర వేదనకు గురయ్యానని తెలిపారు. తమ వాళ్ళను కోల్పోయిన కుటుంబాలకు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తీసుకువస్తారని ఆశిస్తున్నానని రాహుల్ అన్నారు. అలాగే కేరళ ముఖ్యమంత్రితో పాటు వయనాడ్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. కావల్సిన సాయం అందజేస్తామని తనకు హామీ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. అన్ని ఏజెన్సీలతో సమన్వయం ఉండేలా చూసుకోవాలని, కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేయాలని సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయాలని కోరానని తెలిపారు. తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయనాడ్‌కు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని కోరతానన్నారు. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో అడ్మినిస్ట్రేషన్‌‌కు సహాయం చేయాలని తాను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ కోరుతున్నానని రాహుల్ పేర్కొన్నారు.


వయనాడ్‌లోని ముండకై, మెప్పాడి, చురల్‌మల ప్రాంతాల్లో భారీగా వరదలు వచ్చాయి. ఈ క్రమంలోనే రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఉదయం 4:10 గంటలకు ముండకై ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. భారీగా వరదలు, కొండచరియలు విరిగి పడడంతో అనేక ఇళ్లు కొట్టుకు పోయాయి. ధన నష్టంతో పాటు ప్రాణ నష్టం సైతం సంభవించింది. భారీ వరదలతో రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకు పోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కొండ చరియలు విరిగి పడడం, ఇళ్లు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. ఇప్పటి వరకూ 19 మంది మృతి, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇళ్లు కొట్టుకుపోవడంతో అనేక మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలను అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ప్రారంభించాయి.

Updated Date - Jul 30 , 2024 | 12:14 PM