Poli Padyami: వైభవంగా పోలి పాడ్యమి.. భక్తిశ్రద్ధలతో దీపారాధనలు
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:06 PM
కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలి పాడ్యమి నేపథ్యంలో శివలయాలు వెలుగుల కాంతులతో కళకళలాడుతున్నాయి. కార్తీక మాసం ముగింపు నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భక్తులు పోలిని స్వర్గానికి పంపారు. నదీ స్నానమాచరించి ఆవు నేతిలో ముంచిన వత్తులను అరటిదొప్పలలో పెట్టి వెలిగించి విడిచిపెట్టారు.
మార్గశిర శుక్లపక్ష పాడ్యమి నాడు మహాసాద్వి, భక్తురాలైన పోలి సశరీరంగా స్వర్గాన్ని చేరుకున్న ఘట్టాన్ని మననం చేసుకుంటూ పలువురు మహిళలు అరటి డొప్పల్లో 31 వత్తులతో దీపారాధనలు చేసి నీటిలో వదిలారు.
తమ మాంగళ్యం పది కాలాల పాటు నిలవాలని వేడుకున్నారు. తమ కుటుంబ సభ్యులందరి పేరున కూడా దీపాలను వదిలారు. ఈ సందర్భంగా ముత్తైదువులకు పండ్లు, పసుపు కుంకుమ, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. బ్రాహ్మణులకు, పేదలకు తమ శక్తిమేరకు దానాలు చేశారు
కార్తిక మాసం శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. సోమవారంతో ఈ మాసం వెళ్లిపోతుంది. రేపటి (మంగళవారం) నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి. ఈ రోజు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు.
ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు స్నానమాచరించి.. నదులు, చెరువులలో దీపాలు వదులుతారు. దీప దానం కూడా చేస్తారు. పోలి పాడ్యమి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామునుంచే అధిక సంఖ్యలో భక్తులు శైవలయాలకు వచ్చి పుష్కరణిలో స్నానమాచరించి అరటి దవ్వలో దీపాలు వెలిగించి విడిచిపెడుతున్నారు.
భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
కార్తీక దామోదరుడు, విష్ణుమూర్తిలను మన సారా ఆరాధించి దీనాలు వెలిగించారు. సాలి గ్రామ, దీపదానాలతో పాటు అర్చకులకు స్వయంపాకాన్ని భక్తులు అందజేశారు.
Updated Date - Dec 02 , 2024 | 03:11 PM