AP Politics: ఢిల్లీకి చంద్రబాబు.. కేంద్రంపై స్వరం మార్చేసిన వైఎస్ జగన్.. సడన్‌గా ఎందుకిలా..?
ABN, First Publish Date - 2024-02-06T18:32:48+05:30
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో.. ఏ నేత సొంత పార్టీని విడిచి పక్క పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. సీట్ల పంపకాలు కూడా ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి రానున్నాయి..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్. ఎప్పుడు ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుందో.. ఏ నేత సొంత పార్టీని విడిచి పక్క పార్టీలో చేరతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. సీట్ల పంపకాలు కూడా ఒకట్రెండు రోజుల్లో కొలిక్కి రానున్నాయి. ఏపీ ప్రజల కోసం.. రాష్ట్రాభివృద్ధి కోసం ఏ పార్టీ ముందుకొచ్చినా పొత్తులు పెట్టుకోవడానికి టీడీపీ-జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu, Pawan Kalyan) సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బీజేపీ కూడా కూటమిలో ఉంటే బాగుంటుందని భావిస్తోంది. ఢిల్లీ వచ్చి పొత్తులపై చర్చించాలని చంద్రబాబుకు పిలుపు వచ్చింది. బుధవారం నాడు బాబు ఢిల్లీ వెళ్తున్నారు. అలా బాబుకు పిలుపు వచ్చిందో లేదో.. కేంద్రంపై సడన్‌గా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) స్వరం మార్చేశారు. ఇన్నిరోజులు బీజేపీతో అంటగాకిన జగన్ ఉన్నట్టుండి ఇలా మాట తిప్పేశారేంటి..? తెరవెనుక ఏం జరిగింది..? ఏదో తేడా కొడుతోందంటూ ఏపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు..? ఏపీ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై జగన్ ఏం మాట్లాడారనే విషయాలు ఇప్పుడు చూద్దాం..!
ఢిల్లీలో ఏం జరగనుంది..?
రేపు (ఫిబ్రవరి-07న) మధ్యాహ్నం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి బాబు ఢిల్లీ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. అవసరమైతే బాబు తర్వాత పవన్ కల్యాణ్ కూడా వెళ్లనున్నారు. ఇరువురితో మంగళవారం ఉదయం పొత్తు విషయంపై కేంద్ర పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీతో టీడీపీ పొత్తుపై రేపు ప్రాధమికంగా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుగా బీజేపీ సిద్ధంగా ఉన్నప్పటికీ.. టీడీపీ, జనసేన క్యాడర్, లీడర్లు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా ఏం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటన వస్తుందో అని టీడీపీ, జనసేన శ్రేణులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నెల 13, 14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే.. 2014 ఎన్నికల సీన్.. పదేళ్ల తర్వాత 2024లో రిపీట్అవుతోందన్న మాట.
జగన్ స్వరం మార్చేశారుగా..!
టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు పొడుస్తుండటం.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటూ ఉండటం.. నియోజకవర్గ ఇంచార్జుల మార్పుతో సిట్టింగులు గుడ్ బై చేప్పేస్తుండటం.. మరోవైపు ఎంపీ అభ్యర్థులు దొరక్క తర్జన భర్జన పడుతుండటంతో వైఎస్ జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీకి చంద్రబాబు వెళ్తున్నారన్న వార్తలతో కేంద్రంపై మునుపెన్నడూ లేని విధంగా ఒక్కసారిగా జగన్ స్వరం మార్చేశారు. పరోక్షంగా కేంద్రాన్ని దెప్పిపొడుస్తూ అసెంబ్లీ వేదికగా ఒకింత సంచలన వ్యాఖ్యలే చేశారు. ‘కొన్నేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తగ్గిపోయాయి. 2015-2020 మధ్య కేంద్ర పన్నుల్లో వాటాగా ఏపీకి 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఫైనాన్స్ కమిషన్ సూచించగా.. కేంద్రం కేవలం 35 శాతం మాత్రమే ఇచ్చింది. 2020-25 మధ్య 41 శాతం నిధులు ఇవ్వాలని సూచించగా.. కేంద్రం మాత్రం 31.15 శాతం నిధులే ఇచ్చింది. దీంతో ఆదాయం భారీగా తగ్గిపోయింది. అయినప్పటికీ మంచి పాలన అందించాం’ అని అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ లెక్కలు తీసి మరీ చెప్పుకొచ్చారు.
ఇదేందయ్యా జగన్..?
కేంద్రంలో బీజేపీ రెండు దఫాలుగా అధికారంలో ఉంది. ఇంతవరకూ ఎందుకు కేంద్రాన్ని జగన్ అడగలేదు..? ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగానే ఉంది. ఎప్పుడైతే ఏపీలో బీజేపీ ఒంటరిగా కాకుండా టీడీపీతో పొత్తు ప్రస్తావన వచ్చిందో నాటి నుంచి పూర్తిగా వైసీపీ స్వరం మార్చేసిందని ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లు పదుల సంఖ్యలో ఢిల్లీ వెళ్లిన జగన్ ఈ మధ్య అటువైపుగా కూడా వెళ్లలేదు. త్వరలో ఢిల్లీ పర్యటన ఉంటుందని జనవరి 20 నుంచి వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకూ నో ఛాన్స్. చూశారుగా.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఏ రేంజ్‌లో జగన్ భయపడిపోతున్నారో..!. ఇవాళ మాట మారింది.. రేపొద్దున్న పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని వైసీపీ శ్రేణులు ఒకింత ఆందోళన చెందుతున్నాయట. అసలే నెత్తిపై బోలెడన్ని కేసులు ఉన్నాయ్.. ఇలాంటి సమయంలో కేంద్రంతో వివాదాలు అవసరమా..? అని జగన్‌కు కొందరు వైసీపీ ముఖ్యులు చెప్పినప్పటికీ సీఎం వినలేదనే టాక్ కూడా నడుస్తోంది. అయితే.. ఇదంతా నిజంగానే జరుగుతోందా..? లేకుంటే డ్రామానా..? అని కూడా టీడీపీ శ్రేణులు నిశితంగా గమనిస్తున్నాయి. ఫైనల్‌గా ఢిల్లీలో ఏం జరుగుతుంది..? కేంద్రంపై మున్ముందు జగన్ ఏం మాట్లాడుతారు..? అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే మరి.
Revanth Vs Jagan: రేవంత్ సర్కార్‌పై వైసీపీ కుట్ర చేస్తోందా.. విజయసాయి మాటలకు అర్థమేంటి..!?
AP Elections 2024: ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే.. ఇది చూశాక వైఎస్ జగన్ ముఖచిత్రమేంటో..?
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2024-02-06T18:35:42+05:30 IST