YSRCP: బొత్స నామినేషన్ కార్యక్రమానికి వైవీ సుబ్బారెడ్డి డుమ్మా.. ఏదో తేడా కొడుతోందే..!?
ABN, Publish Date - Aug 12 , 2024 | 03:26 PM
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం..
సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) తరఫున బరిలోకి దిగారు. సోమవారం నాడు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక్కడి వరకూ అంతా ఓకేగానీ.. ఎక్కడో తేడా కొట్టినట్లు మాత్రం స్పష్టంగా కనిపిస్తోందనే అనుమానాలు వైసీపీ క్యాడర్‌లో గట్టిగానే వస్తున్నాయ్. ఇందుకు కారణం.. ఉత్తరాంధ్ర జిల్లా ఇంచార్జ్, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడమే..! విశాఖలో ఉన్నప్పటికీ నామినేషన్ కార్యక్రమానికి హాజరుకాకపోవడంపై పార్టీ శ్రేణులు విస్మయానికి గురవుతున్నాయి. దీనికి తోడు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెయిన్ గేటు వరకూ వచ్చినట్లే వచ్చి వైవీ సుబ్బారెడ్డి వెనుదిరిగిపోయారు. దీంతో ఎక్కడలేని అనుమానాలు జిల్లా నేతలతో పాటు పార్టీ నేతలందరికీ వచ్చేస్తున్నాయ్..! వైవీ ఎందుకిలా ప్రవర్తించారు..? ఆయనకు ఏమైంది..? బొత్స పోటీ చేయడం ఇష్టం లేదా..? లేకుంటే బొత్స- సుబ్బారెడ్డికి పడట్లేదా..? అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల్లో వస్తున్నాయ్. ఇప్పుడీ వ్యవహారంపైనే అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
డుమ్మా వెనుక..!?
ఒక్క వైవీ సుబ్బారెడ్డి మాత్రమే కాదు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన చాలా మంది నేతలు, మాజీ మంత్రులు హాజరుకాకపోవడం గమనార్హం. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇద్దరూ డుమ్మా కొట్టారు. ఈ ఇద్దరూ కూడా సుబ్బారెడ్డికి సన్నిహితంగా ఉండేవారే..! ఆయనతో పాటు ఈ ఇద్దరూ కూడా హాజరు కాకపోవడంతో మరిన్ని అనుమానాలు వస్తున్నాయి. కాగా.. మంగళవారం (ఆగస్టు-13) తో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనున్నది. దీంతో సోమవారం నాడే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఈ కార్యక్రమానికి.. బొత్స సతీమణి బొత్స ఝాన్సీ, గొలగాని హరివెంకట కుమారి, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు.. అరుకు ఎంపీ తనుజా రాణి మాత్రమే హాజరయ్యారు. అటు వైవీ.. ఇటు ఇద్దరు జిల్లా కీలక నేతలు హాజరుకాకపోవడం వెనుక ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా.. చాలా రోజులుగా అవంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా అంటీముట్టన్నట్లుగానే ఉంటున్న సంగతి తెలిసిందే.
అధినేత ఆదేశాలతో...
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో తాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కూటమికి (టీడీపీ, జనసేన, బీజేపీ).. వైసీపీకి 300 మంది (ఓట్లు) తేడా ఉంటే ఎలా మారిపోతారు..? అని ఈ సందర్భంగా ప్రత్యర్థులను ప్రశ్నించారాయన. నాలుగైదు రోజులుగా ఏపీలో క్యాంప్ రాజకీయాలపై పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై కూడా స్పందించిన బొత్స.. దుష్టులకు దూరంగా ఉంచాలనే క్యాంప్ శిబిరం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. కూటమి గెలుస్తుందని చెప్పేవారు 14 ఆగస్టు తర్వాత మాట్లాడాలని ఒకింత సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయని.. ఇప్పటికీ వైసీపీకి 530 పైగా ఓట్లు ఉన్నాయని ధీమాగా చెప్పారు బొత్స. ఓ పారిశ్రామిక వేత్తను కూటమి ప్రభుత్వం అభ్యర్థిగా పెడుతున్నట్లు తనకు సమాచారం తెలిసిందన్నారు. వ్యాపారం కోసం అభ్యర్థిగా పెడుతున్నారా..? ఏంటో అర్థం కావట్లేదన్నారు. ఒకవేళ వ్యాపారవేత్తనే అభ్యర్థిని పెడితే మాత్రం దుశ్చర్యే అవుతుందని బొత్స ఎద్దేవా చేశారు. అసలు అలాంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు..? అని కూటమి సర్కార్‌ను బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మాజీ మంత్రి మాటలకు కూటమి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి మరి.
ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి భారీ షాక్
Read Latest AP News And Telugu News
Updated Date - Aug 12 , 2024 | 03:47 PM