Share News

IPL : సూపర్‌ బోణీ

ABN , Publish Date - Mar 23 , 2024 | 04:24 AM

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ..

IPL : సూపర్‌ బోణీ

బెంగళూరుపై చెన్నై విజయం

ముస్తాఫిజుర్‌కు నాలుగు వికెట్లు

రాణించిన రచిన్‌

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టింది. కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో రాణిస్తూ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. అటు చెపాక్‌ మైదానంలో ఆర్సీబీకిది వరుసగా ఎనిమిదో ఓటమి కావడం గమనార్హం. సీఎస్‌కే తరఫున తొలి మ్యాచ్‌ ఆడిన పేసర్‌ ముస్తాఫిజుర్‌ నాలుగు వికెట్లతో ఆర్సీబీ వెన్నువిరిచాడు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. అనూజ్‌ రావత్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48), దినేశ్‌ కార్తీక్‌ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 నాటౌట్‌) డుప్లెసి (23 బంతుల్లో 8 ఫోర్లతో 35) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసి గెలిచింది. రచిన్‌ రవీంద్ర (15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37), శివమ్‌ దూబే (28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్‌) కీలకంగా నిలిచారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ముస్తాఫిజుర్‌ నిలిచాడు.

కలిసికట్టుగా..: సీఎ్‌సకే ఛేదన జోరుగా ఆరంభం కాగా.. క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాటర్‌ ఉన్న కాసేపు బ్యాట్లు ఝుళిపించారు. ఇన్నింగ్స్‌ తొలి బంతినే ఫోర్‌గా మలిచిన కెప్టెన్‌ రుతురాజ్‌ (15) మొదటి వికెట్‌కు 38 పరుగులు జోడించి నాలుగో ఓవర్‌లో వెనుదిరిగాడు. అయితే కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ ఆడిన రచిన్‌ ఆకట్టుకున్నాడు. మూడో ఓవర్‌లో 4,6 బాదిన అతను ఐదో ఓవర్‌లోనూ సిక్సర్‌ సాధించాడు. అటు రహానె (27) కూడా ఉన్న కాసేపు వేగం కనబరిచాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 62/1 స్కోరుతో పటిష్టంగా కనిపించింది. కర్ణ్‌ శర్మ ఓవర్‌లో సిక్సర్‌ బాదాక మరో భారీ షాట్‌కు యత్నించిన రచిన్‌ క్యాచ్‌ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 33 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక తొమ్మిదో ఓవర్‌లో డారిల్‌ మిచెల్‌ (22) రెండు వరుస సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. మరోవైపు రహానె ఓ భారీ సిక్సర్‌ బాదిన వెంటనే మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇవ్వగా, కాసేపటికే మిచెల్‌ వెనుదిరగడంతో 110కి 4 వికెట్లు కోల్పోయిన చెన్నై ఒత్తిడిలో పడింది. దూబే, జడేజా ఓపిగ్గా ఆడుతూ అడపాదడపా ఫోర్లతో ఆదుకునే ప్రయత్నం చేశారు. 17వ ఓవర్‌లో 16 రన్స్‌ రావడంతో కోలుకుంది. ఇక దూబేను షార్ట్‌ బాల్స్‌తో విసిగించే ప్రయత్నం చేసినా.. 18వ ఓవర్‌లో 2 ఫోర్లు, 19వ ఓవర్‌లో 6,4తో మరో 9 బంతులుండగానే జట్టును గెలిపించాడు.

చివర్లో ధనాధన్‌: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయినా.. డెత్‌ ఓవర్లలో అదరగొట్టింది. 140 కూడా కష్టమే అనుకున్న వేళ అనూజ్‌ రావత్‌, దినేశ్‌ కార్తీక్‌ జోడీ ఆరో వికెట్‌కు 50 బాల్స్‌లో 95 పరుగులు జత చేయడంతో జట్టు సవాల్‌ విసిరే స్కోరు సాధించగలిగింది. అయితే మధ్య ఓవర్లలో పేసర్‌ ముస్తాఫిజుర్‌ ధాటికి టపటపా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసింది. తొలి మూడు ఓవర్లలోనే ఓపెనర్‌ డుప్లెసి 30 పరుగులు సాధించగా, అటు మరో ఓపెనర్‌ విరాట్‌ కోహ్లీ (21) ఈ సమయంలో ఒక్క బంతినే ఆడడం గమనార్హం. అయితే చక్కటి రన్‌రేట్‌తో సాగుతున్న ఆర్సీబీకి పేసర్‌ ముస్తాఫిజుర్‌ బ్రేకులు వేశాడు. ఐదో ఓవర్‌లో తను డుప్లెసి, రజత్‌ (0)ల వికెట్లు తీసి షాక్‌ ఇచ్చాడు. వెంటనే మ్యాక్స్‌వెల్‌ను చాహర్‌ డకౌట్‌ చేయడంతో ఆర్సీబీ పవర్‌ప్లేలో 42/3తో నిలిచింది. ఈ దశలో విరాట్‌, గ్రీన్‌ (18) నాలుగో వికెట్‌కు 35 రన్స్‌ జోడించారు. 12వ ఓవర్‌లో ఈ ఇద్దరినీ ముస్తాఫిజుర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికి స్కోరు 78/5. ఈ స్థితిలో దినేశ్‌ కార్తీక్‌, రావత్‌ నిదానంగా ఆడడంతో 28 బంతులపాటు ఒక్క ఫోర్‌ కూడా రాలేదు. కానీ 15వ ఓవర్‌లో రావత్‌ రెండు ఫోర్లు, తర్వాత ఓవర్‌లో డీకే 4,6తో స్కోరులో కాస్త కదలిక వచ్చింది. తుషార్‌ వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లోనైతే రావత్‌ 6,6,4 డీకే 6తో 25 రన్స్‌ వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్‌లో అతడు 9 రన్స్‌తో కాస్త కట్టడి చేయగలిగాడు.

టీ20ల్లో 12 వేలకు పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా విరాట్‌. అలాగే తక్కువ ఇన్నింగ్స్‌ (360)లో ఈ ఫీట్‌ సాధించిన రెండో బ్యాటర్‌. గేల్‌ (345) ముందున్నాడు.

స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 21, డుప్లెసి (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 35, పటీదార్‌ (సి) ధోనీ (బి) ముస్తాఫిజుర్‌ 0, మ్యాక్స్‌వెల్‌ (సి) ధోనీ (బి) చాహర్‌ 0, గ్రీన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 18, రావత్‌ (రనౌట్‌) 48, దినేశ్‌ (నాటౌట్‌) 38, ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 173/6; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-42, 4-77, 5-78, 6-173; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-37-1, దేశ్‌పాండే 4-0-47-0, తీక్షణ 4-0-36-0, ముస్తాఫిజుర్‌ 4-0-29-4, జడేజా 4-0-21-0.

చెన్నై: రుతురాజ్‌ (సి) గ్రీన్‌ (బి) యశ్‌ 15, రచిన్‌ (సి) పటీదార్‌ (బి) కర్ణ్‌ 37, రహానె (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) గ్రీన్‌ 27, డారిల్‌ మిచెల్‌ (సి) పటీదార్‌ (బి) గ్రీన్‌ 22, శివమ్‌ దూబే (నాటౌట్‌) 34, జడేజా (నాటౌట్‌) 25, ఎక్స్‌ట్రాలు: 16, మొత్తం: 18.4 ఓవర్లలో 176/4; వికెట్ల పతనం: 1-38, 2-71, 3-99, 4-110; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-38-0, యశ్‌ దయాల్‌ 3-0-28-1, జోసెఫ్‌ 3.4-0-38-0, కర్ణ్‌ శర్మ 2-0-24-1, దాగర్‌ 2-0-6-0, గ్రీన్‌ 3-0-27-2, మ్యాక్స్‌వెల్‌ 1-0-7-0.

Updated Date - Mar 23 , 2024 | 04:24 AM