Paris Olympics: వినేష్ ఫోగట్‌కు పతకం వస్తుందా..!
ABN , Publish Date - Aug 08 , 2024 | 06:24 PM
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్స్ చేరి చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్‌పై.. తుదిపోరుకు కొద్ది గంటల ముందు అనర్హత వేటు పడటంతో ఆమె ఎలాంటి పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. బరువు పరీక్ష సమయానికి ఉండాల్సి బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉండటంతో వినేష్‌పై అనర్హత వేటు పడింది. అనూహ్యంగా కొన్ని గంటల వ్యవధిలో రెండు కేజీలకు పైగా బరువు పెరగడంతో ఆమె వెయిట్ లాస్ కోసం రాత్రంతా తీవ్ర ప్రయత్నాలు చేసింది. నిద్రలేకుండా బరువు తగ్గేందుకు ప్రయత్నించినా బరువు పరీక్ష సమయానికి వంద గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఆమె ఫైనల్స్ ఆడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. దీంతో ఫైనల్స్‌కు చేరిన ప్రత్యర్థి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక ఫైనల్స్‌కు చేరిన వినేష్‌పై అనర్హత పడటంతో రజత పతకం ఎవరికి ఇవ్వకుండా.. ఒలింపిక్స్ కమిటీ వద్దనే ఉంచనున్నారు. ఈక్రమంలో పతకం కోసం పోటీదారు లేకపోవడంతో తనను ఓడిపోయినట్లు పరిగణించినా రజత పతకం ఇవ్వాలని ఆమె పారిస్‌లో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో వినేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. కొద్ది గంటల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది.
వినేష్ తరపున..
భారత రెజ్లింగ్ క్రీడాకారిణి వినేష్ ఫోగట్ తరపున కోర్టు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌లో సీనియర్ న్యాయవాదులు జోయెల్ మోన్లూయిస్, ఎస్టేల్ ఇవనోవా, హబ్బైన్ ఎస్టేల్ కిమ్ , చార్లెస్ అమ్సన్ వ్యవహరించనున్నారు. మరోవైపు ఒలింపిక్స్ కమిటీ సైతం తమ నిబంధనలను కోర్టుకు వివరించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. న్యాయస్థానం వినేష్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే పతకం వచ్చే అవకాశం ఉంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.
పతకం అవకాశాలు..
రెజ్లింగ్ మహిళల 50 కేజీల విభాగంలో వినేష్ ఫోగట్ ఫైనల్‌కు చేరిన తర్వాత అనర్హత వేటు పడటంతో ఆమెతో తలపడే ప్రత్యర్థికి స్వర్ణపతకం అందజేశారు. రజత పతకాన్ని ఎవరికి ఇవ్వలేదు. వినేష్ సెమీఫైనల్ మ్యాచ్‌లో తలపడటానికి ముందు నిర్వహించిన బరువు పరీక్షల్లో అర్హత సాధించడంతో సెమీఫైనల్ మ్యాచ్‌పై ఎలాంటి వివాదం లేదు. ఒకవేళ సెమీఫైనల్ మ్యాచ్‌పై వివాదం ఉంటే.. అందులో ఓడిపోయిన ప్రత్యర్థి ఫైనల్స్ చేరుకుని స్వర్ణపతక పోరులో తలపడాల్సి ఉండేది. కానీ ఫైనల్స్‌పై వివాదం మొదలుకావడంతో.. వినేష్ ఫోగట్‌ను ఓడిపోయినట్లు పరిగణించినా రజత పతకం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీచేసే అవకాశం ఉండొచ్చు. అదే సమయంలో ఒలింపిక్స్ నిబంధనలను పరిగణలోకి తీసుకుని న్యాయస్థానం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
Vinesh Phogat : వినేశ్ విలాపం
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Sports News and Latest Telugu News