T20 World Cup: భారత్ విజయంపై ఆస్ట్రేలియా అక్కసు.. ఏమన్నదంటే?
ABN , Publish Date - Jul 01 , 2024 | 01:12 PM
టీ20 వరల్డ్‌కప్ టైటిల్‌ని సొంతం చేసుకున్న భారత జట్టుపై ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ విజయాన్ని కొనియాడితే.. ఆస్ట్రేలియా మాత్రం...
టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) టైటిల్‌ని సొంతం చేసుకున్న భారత జట్టుపై ఆస్ట్రేలియా మీడియా అక్కసు వెళ్లగక్కింది. ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు భారత్ విజయాన్ని కొనియాడితే.. ఆస్ట్రేలియా మాత్రం తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నించింది. దక్షిణాఫ్రికా తడబాటుతో పాటు అంపైర్ల నిర్ణయాల వల్ల భారత జట్టు ఈ కప్ గెలుపొందిందని విషం చిమ్మింది. ‘‘సౌతాఫ్రికా తడబాటే టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టుని టాప్‌లో నిలబెట్టింది’’ అనే శీర్షికతో ఓ కథనాన్ని ప్రచురించింది. ‘‘ఈ వరల్డ్‌కప్‌లో భారత జట్టుకి అన్ని అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడంతో పాటు అంపైర్ల నిర్ణయాల వల్ల భారత జట్టు గెలుపొందింది’’ అని ఆ కథనంలో రాసుకొచ్చింది. అంతే తప్ప భారత సమిష్టి కృషి గురించి అందులో ప్రస్తావించలేదు. దీన్ని బట్టి.. భారత్ గెలుపు పట్ల ఆస్ట్రేలియా ఎంత అసంతృప్తిగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతర్జాతీయ మీడియా
అయితే.. పాకిస్తాన్‌తో పాటు ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు మాత్రం భారత్ గెలుపుపై ప్రశంసలు కురిపించాయి. తీవ్ర ఒత్తిడి ఉన్న సమయంలోనూ.. భారత జట్టు సమిష్టిగా రాణించి, అద్భుత నైపుణ్యంతో కప్పుని సొంతం చేసుకుందని కొనియాడాయి. పాకిస్తాన్‌కు చెందిన డాన్ పత్రిక అయితే.. భారత విజయోత్సవాలకు సంబంధించిన ఫోటోని ఫ్రంట్ పేజీలో వేసింది. భారత్ అద్భుత విజయం సాధించిందని పేర్కొంటూ.. ఈ విజయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ప్రధాన పాత్ర పోషించాడని ప్రశంసలతో ముంచెత్తింది. అంతేకాదు.. ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు సైతం భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. లండన్‌లోని సండే టైమ్స్.. ‘‘గేరు మార్చి భారత్‌కు కప్పు అందించిన కోహ్లీ’’ అంటూ ఓ కథనంలో పేర్కొంది. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసే పరంపరని సౌతాఫ్రికా మరోసారి కొనసాగించిందని తెలిపింది. ఫాక్స్ క్రికెట్ కూడా కోహ్లీని ఆకాశానికెత్తేసింది. కీలక మ్యాచ్‌లో ఆదుకున్నాడని చెప్పుకొచ్చింది.
ఆస్ట్రేలియాపై భారత్ విజయం
కాగా.. సూపర్-8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. రోహిత్ శెట్టి ఆడిన కెప్టెన్ ఇన్నింగ్స్ (92) పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. లక్ష్య ఛేధనలో భాగంగా.. ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులకే పరిమితం అయ్యింది. తమ జట్టుని గెలిపించుకోవడం కోసం ట్రావిస్ హెడ్ (76), మిచెల్ మార్ష్ (37) గట్టిగానే ప్రయత్నించారు కానీ.. భారత బౌలర్ల ధాటికి వారి ప్రయత్నం నీరుగారింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేకే.. ఆస్ట్రేలియా మీడియా ఇలా టీమిండియాపై అక్కసు వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.
Read Latest Sports News and Telugu News