SRH vs MI: ఉప్పల్‌లో రికార్డుల ఊచకోత.. సన్‌రైజర్స్ vs ముంబై మ్యాచ్‌లో బద్దలైన రికార్డులివే!
ABN , Publish Date - Mar 28 , 2024 | 07:25 AM
ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. బౌలర్లు నామ మాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.
హైదరాబాద్: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ (Sunrisers Hyderabad vs Mumbai Indians) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. బ్యాటింగ్ పిచ్‌పై రెండు జట్ల బ్యాటర్లు రెచ్చిపోయి ఆడారు. బౌలర్లు నామ మాత్రంగా మారిన ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో పరుగుల సునామీ పారడంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 277/3 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టు బ్యాటర్లలో ట్రావిస్ హెడ్(62), అభిషేక్ శర్మ(63), క్లాసెన్(80) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం లక్ష్య చేధనలో ముంబై జట్టు మొదటి 10 ఓవర్లలో చేసిన బ్యాటింగ్ చేస్తే ఒకానొక దశలో వారే గెలుస్తారేమో అనిపించింది. కానీ డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 246/5 వద్ద పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ(64), టిమ్ డేవిడ్(42), ఇషాన్ కిషన్(34) చెలరేగారు. అయితే పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్‌లో పరుగులతోపాటు రికార్డుల వరదపారింది.
1. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే కాకుండా మొత్తంగా సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
2. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
3. ముంబై ఇండియన్స్‌పై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ(16 బంతులు) నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పాట్ కమిన్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
4. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ 81/1 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డులకెక్కింది. దీంతో 2017లో కేకేఆర్‌పై చేసిన 79 పరుగుల రికార్డు బద్దలైంది.
5. ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే ట్రావిస్ హెడ్ 20 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. దీంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ తరఫున వేగంగా అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంతో 23 బంతుల్లో 59 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు.
6. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన నాలుగో జట్టుగా నిలిచింది. సన్‌రైజర్స్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన మ్యాచ్ ఇదే.
7. ఈ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ ఏకంగా 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది.
8. ఐపీఎల్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు(277/3) అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఈ క్రమంలో గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 263/5 రికార్డును బద్దలుకొట్టింది. మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక స్కోర్‌గా రికార్డులకెక్కింది.
9. ఈ మ్యాచ్‌లో తమ ఇన్నింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లంతా కలిసి 18 సిక్సులు కొట్టారు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన నాలుగో జట్టుగా పంజాబ్, రాజస్థాన్, చెన్నైతో కలిసి నాలుగో స్థానంలో నిలిచింది.
10. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో నాలుగో వికెట్‌కు క్లాసెన్, మాక్రమ్ కలిసి అజేయంగా 116 పరుగులు జోడించారు. హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో 4 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం.
11. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు ఫోర్లు, సిక్సులు కలిపి 69 బాదాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో 2010లో అత్యధిక ఫోర్లు, సిక్సులు నమోదైన చెన్నై vs రాజస్థాన్ మ్యాచ్ రికార్డు సమం అయింది.
12. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తమ ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 సిక్సులు బాదింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో తమ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు బాదిన రెండో జట్టుగా ఆర్సీబీ, ఢిల్లీతో కలిసి ముంబై రెండో స్థానంలో నిలిచింది.
13. పురుషుల టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు నమోదైన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి ఏకంగా 38 సిక్సులు బాదాయి.
14. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక రన్స్ నమోదైన మ్యాచ్‌గా ఇది చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి ఏకంగా 523 పరుగులు బాదాయి. అలాగే ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో 500+ రన్స్ నమోదు కావడం ఇదే మొదటిసారి.
15. ఐపీఎల్ చరిత్రలో రెండో ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ముంబై 246 పరుగులు చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.