Nitish Kumar Reddy: నితీష్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు.. గర్వపడేలా చేశావంటూ..
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:03 PM
Boxing Day Test: తెలుగోడి దమ్మేంటో మరోమారు చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. మనతో పెట్టుకుంటే దబిడిదిబిడేనని ప్రూవ్ చేశాడు. మ్యాచ్ తమదే అని ధీమాతో ఉన్న కంగారూలకు ఒక రేంజ్‌లో పోయించాడు.
IND vs AUS: ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన సెంచరీతో చెలరేగిన తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మీద అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురస్తోంది. కష్టకాలంలో క్రీజులోకి అడుగుపెట్టి అతడు చేసిన పోరాటం, కంగారూ బౌలర్లకు ఎదుర్కొడ్డి జట్టును ఓటమి నుంచి బయటపడేసిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. 21 ఏళ్ల కుర్రాడు.. ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా చేయలేని పనిని చేసి చూపించడం, ఆసీస్ బౌలర్లను ఆటాడుకోవడాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. నితీష్ సంచలన ఇన్నింగ్స్ మీద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. గర్వపడేలా చేశావ్ అంటూ తెలుగోడ్ని మెచ్చుకున్నారు.
ఇలాగే చెలరేగాలి
సూపర్బ్ సెంచరీ సాధించిన నితీష్ రెడ్డికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. టెస్టుల్లో అత్యంత పిన్న వయసులో శతకం బాదిన భారత మూడో క్రికెటర్‌గా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించారు. రంజీలో ఆంధ్ర జట్టు తరఫున ఎన్నో విజయాలు సాధించిన నితీష్.. అండర్-16లో కూడా అదరగొట్టాడని గుర్తుచేశారు చంద్రబాబు. అతడు తన కెరీర్‌లో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. టీమిండియా తరఫున ఇలాగే చెలరేగుతూ దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ట్విట్టర్‌లో పెట్టిన పోస్ట్‌లో ముఖ్యమంత్రి తెలిపారు.
ఆరంభం మాత్రమే..
మంత్రులు నారా లోకేశ్, రాంప్రసాద్ రెడ్డి కూడా నితీష్‌ను మెచ్చుకున్నారు. తెలుగు వారి ప్రతిష్టను ప్రపంచ యవనికపై మారుమోగిస్తున్నందుకు అతడికి థ్యాంక్స్ చెప్పారు లోకేశ్. స్వర్ణాంధ్ర ఇలాగే సాధ్యమవుతుందని, అన్ని అడ్డంకులను దాటుకొని దూసుకెళ్తే ఏదైనా సాధ్యమేనని ట్వీట్ చేశారు. ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న భారత్‍ను అద్భుత శతకంతో ఆదుకున్నాడని రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. నితీశ్ మున్ముందు టీమిండియాకు మరిన్ని విజయాలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. తెలుగోడి సూపర్బ్ బ్యాటింగ్‌పై దిగ్గజ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా స్పందించాడు. టీమ్ కష్టాల్లో ఉన్న టైమ్‌లో నితీష్ ఆడిన తీరు అద్భుతమని.. ఇది అతడికి ఆరంభం మాత్రమేనని ప్రశంసించాడు. నితీష్ బ్యాటింగ్‌లో ఉన్న పాజిటివిటీ, ఫియర్‌లెస్‌నెస్‌ను తాను ఆస్వాదించానని వీవీఎస్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.