Sachin Tendulkar: 14 ఏళ్ల క్రితం సచిన్ చేసిన ఈ అద్భుతం గుర్తుందా.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మొనగాడు
ABN , Publish Date - Feb 24 , 2024 | 03:48 PM
సచిన్ టెండూల్కర్. ఈ పేరుతో క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన పేజీలున్నాయి. తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలో అయితే సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నతో గౌరవించింది.
సచిన్ టెండూల్కర్. ఈ పేరుతో క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన పేజీలున్నాయి. తన ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. మన దేశంలో అయితే సచిన్‌ను క్రికెట్ దేవుడిగా కొలుస్తారు. క్రికెట్‌కు సచిన్ చేసిన సేవలకుగాను భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నతో గౌరవించింది. తన బ్యాటుతో సచిన్ టెండూల్కర్ అసాధ్యం అనుకున్న ఎన్నో రికార్డులను సాధించాడు. ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. ఆ అద్భుతాల్లో ఒకటే వన్డే డబుల్ సెంచరీ. అసాధ్యం అనుకున్న వన్డే డబుల్ సెంచరీని రికార్డు సచిన్ సుసాధ్యం చేసి నేటికి సరిగ్గా 14 ఏళ్లయింది. సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున అనగా 24 ఫిబ్రవరి 2010న సచిన్ టెండూల్కర్ అద్భుతం చేశాడు. ఈ మేరకు బీసీసీఐ సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీకి సంబంధించిన వీడియోను తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ వన్డే డబుల్ సెంచరీని సాధించి మొనగాడిగా నిలిచాడు. సచిన్ వన్డే డబుల్ సెంచరీ సాధించినప్పుడు ఆయన వయసు 36 సంవత్సరాలు. సాధారణంగా ఈ వయసులో అంతర్జాతీయ క్రికెట్ నుంచి చాలా మంది రిటైర్ అవుతారు. కానీ సచిన్ మాత్రం ఆ వయసులో డబుల్ సెంచరీ కొట్టి అబ్బురపరిచాడు. నాటి మ్యాచ్ తీపి గుర్తులను ఒకసారి నెమరువేసుకుందాం.
గ్వాలియర్‌లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన సెహ్వాగ్ ఔటయ్యాడు. ఇలాంటి సమయంలో దినేష్ కార్తీక్‌తో జత కట్టిన సచిన్ దుమ్ములేపాడు. సచిన్, కార్తీక్ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 194 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన సచిన్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 90 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 79 పరుగులు చేసిన దినేష్ కార్తీక్ ఔట్ అయినప్పటికీ యూసుఫ్ పఠాన్‌తో కలిసి సచిన్ భారత్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. చూస్తుండగానే సచిన్ 150 పరుగులు దాటేశాడు. ఆ తర్వాత 36 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్ కూడా ఔటయ్యాడు. ఇలాంటి సమయంలో సచిన్, ధోని కలిసి రెచ్చిపోయారు. వీరిద్దరు కలిసి చివరి 53 బంతుల్లోనే 101 పరుగులు జోడించారు. చివరి ఓవర్ మూడో బంతికి సింగిల్ తీసి సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 25 ఫోర్లు, 3 సిక్సులతో 147 బంతుల్లోనే సచిన్ 200 పరుగులు పూర్తి చేసుకున్నాడు. డేల్ స్టెయిన్, వేన్ పార్నెల్, జాక్వెస్ కలిస్ వంటి స్టార్ బౌలర్లను ఎదుర్కొని సచిన్ డబుల్ సెంచరీ చేయడం గమనార్హం.
దీంతో అంతర్జాతీయ పురుషుల వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా చూస్తే రెండో బ్యాటర్‌గా నిలిచాడు. మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ బెలిండ్ క్లార్క్ 1997లోనే ఈ రికార్డు సాధించింది. ఆ ఏడాది భారత్ వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్‌లో డెన్మార్క్‌పై క్లార్క్ డబుల్ సెంచరీ సాధించింది. ఇక సచిన్ డబుల్ సెంచరీతో నిర్ణీత 50 ఓవర్లలో భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. సచిన్‌తోపాటు 68 పరుగులు చేసిన ధోని కూడా నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 248 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 153 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. సచిన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అనంతరం పురుషుల వన్డే క్రికెట్‌లో మరో ఎనిమిది మంది బ్యాటర్లు కూడా డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ, మార్టిన్ గప్టిల్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఫఖర్ జమాన్, పాతుమ్ నిస్సాంక, ఇషాన్ కిషన్, శుభ్‌మాన్ గిల్ కూడా డబుల్ సెంచరీలు సాధించారు. రోహిత్ శర్మ అయితే ఏకంగా మూడు సార్లు డబుల్ సెంచరీ మార్కు అందుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.