Food Poisoning: కలుషిత ఆహారంతో 49 మంది విద్యార్థులకు అస్వస్థత
ABN, Publish Date - Aug 08 , 2024 | 04:22 AM
కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
అల్పాహారం తిన్న తర్వాత వాంతులు, కడుపునొప్పి
జడ్చర్ల మైనారిటీ గురుకుల పాఠశాలలో ఘటన
9 మంది విద్యార్థులకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స
జడ్చర్ల, ఆగస్టు 7: కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ప్రస్తుతం 250 మంది విద్యార్థులు ఉండగా.. మెనూ ప్రకారం ఉదయం అల్పాహారంగా కిచిడీ, కట్టా (పచ్చిపులుసు) వండి పెట్టారు. తిన్న తర్వాత విద్యార్థులు తరగతి గదులకు వెళ్లారు. సుమారు గంట తర్వాత మొదట 6వ తరగతి విద్యార్థి ఒకరు వాంతులు చేసుకున్నాడు. అనంతరం మరికొంత మంది విద్యార్థులు కడుపులో నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకున్నారు.
మొత్తం 49 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉపాధ్యాయుల సమాచారంతో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీధర్‌రెడ్డి, జడ్చర్ల పట్టణ ఆరోగ్య కేంద్రం డాక్టర్ మనుప్రియ, ఆర్‌బీఎ్‌సకే వైద్యులు డాక్టర్ సునీల్, డాక్టర్ హరీశ్ తమ సిబ్బందితో పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు చికిత్స చేశారు. 9 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 అంబులెన్స్‌లో జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలను పరిశీలించారు. ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వండిన అన్నం, కూరలను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలోని మిగతా విద్యార్థులకు భరోసా కల్పించేందుకు అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వారితో కలిసి భోజనం చేశారు. పాఠశాలను డీఎంహెచ్‌వో డాక్టర్ పద్మజ, జడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు.
Updated Date - Aug 08 , 2024 | 04:22 AM