ACB Case: కేటీఆర్ ఏ1
ABN, Publish Date - Dec 20 , 2024 | 03:20 AM
ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది.
ఏ2 అర్వింద్‌కుమార్.. ఏ3 చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు
ఏసీబీకి ఫిర్యాదు చేసిన పురపాలక కార్యదర్శి దానకిశోర్
విచారణలో మరికొందరు అధికారులను చేర్చే అవకాశం
నిందితులకు తొలుత నోటీసులు.. తర్వాత అరెస్టులు!
‘ఫార్ములా ఈ’ నిర్వహణకు మూడు పార్టీల ఒప్పందం
ఇందులో హెచ్‌ఎండీఏ లేకున్నా
దాని ఖాతా నుంచి రూ.54.88 కోట్ల చెల్లింపు
ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు
డాలర్లలో చెల్లించి ఆర్బీఐ అనుమతి తీసుకోని వైనం
ఎన్నికల కోడ్ ఉండగా అనుమతి తీసుకోకుండా ఒప్పందం
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను ఏ1గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఏ2గా, నాటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ3గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1),(ఏ) రెడ్ విత్ 13(2) సెక్షన్ 409, 120 బి ప్రకారం కేసు నమోదు చేశారు. మరి కొంతమంది అధికారులను సైతం ఎఫ్‌ఐఆర్‌లో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం కేటీఆర్‌కు నోటీసు ఇచ్చి.. ఆ తర్వాత లేదా అదే రోజు అరెస్టు చేసే దిశగా ఏసీబీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉండబోతున్నారని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కొద్ది కాలం కిందట రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కోరిన విషయం తెలిసిందే. ఆయన నుంచి అనుమతి వచ్చిన తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కేసును ఏసీబీకి పంపాలని క్యాబినెట్‌లో నిర్ణయించారు. సంబంధిత పత్రాలను సీఎస్ శాంతికుమారి ఏసీబీకి పంపించారు. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన సవివరమైన ఫిర్యాదును పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి పంపారు. బుధవారం సాయంత్రం ఐదున్నరకు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలించిన తర్వాత ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం నాలుగు గంటలకు కేటీఆర్ తదితరులపై ఏసీబీ సీఐయూ యూనిట్ డీఎస్పీ మజీద్ ఖాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సదరు కాపీలను ఏసీబీ కోర్టుకు పంపారు.
అసలు ఏమిటీ కేసు!?
మీకు ఎకరం భూమి ఉంది! అందులో ఎగ్జిబిషన్ పెట్టుకుంటామంటూ ‘ఎ’ వచ్చారు! దానికి విస్తృత ప్రచారం కల్పిస్తానంటూ ‘బి’ వచ్చారు! కొన్ని రోజుల తర్వాత నష్టం వస్తోందని ‘బి’ వెళ్లిపోయారు! నిజానికి, ఇక్కడ ఎగ్జిబిషన్‌కు భూమి ఇవ్వడం వరకే మీ బాధ్యత. కానీ, ఎగ్జిబిషన్ ఏర్పాటుకు, ప్రచారానికి కూడా మీరే ఎదురు డబ్బులు ఇస్తారా!? అది కూడా.. మీ డబ్బులు కాకుండా ఈ వ్యవహారంతో అస్సలు ఏమాత్రం ఏ సంబంధం లేని పక్క వాళ్ల డబ్బులు ఇస్తారా!? ఈ క్రమంలో అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతారా!? ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దాని ప్రకారం ఫార్ములా ఈ కేసు ఇదే! హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించడానికి 2022 అక్టోబరులో మూడు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. వాటిలో ఒకటి.. బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ (ఎఫ్‌ఈవో). రెండోది, తెలంగాణ ప్రభుత్వం. మూడోది, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ (స్పాన్సర్). ఫార్ములా 1 తరహాలోనే ఫార్ములా ఈ రేసులూ జరుగుతుంటాయి. వీటి 9, 10, 11, 12 సీజన్లను హైదరాబాద్‌లో నిర్వహించడమే ఈ ఒప్పందం.
దీని ప్రకారం ట్రాక్ నిర్మాణంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే ప్రభుత్వ బాధ్యత. ఇందులో భాగంగా మొదటి రేస్ 11.2.23వ తేదీన పూర్తయింది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.12 కోట్లు ఖర్చు చేసింది. సంబంధిత ఫీజు, ఇతర చెల్లింపులను స్పాన్సర్ సంస్థ చేసింది. మొదటి సీజన్ తర్వాత ఎఫ్‌ఈవోకు, స్పాన్సరర్‌కు మధ్య విభేదాలు వచ్చాయి. ఒప్పందం నుంచి ఏస్ నెక్ట్స్ జెన్ తప్పుకుంది. ఇంకా కొంత ఫీజు మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో, పురపాలక శాఖ అధికారులు, ఎఫ్‌ఈవో మధ్య చర్చలు జరిగాయి. స్పాన్సర్ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, ఫీజు కూడా ప్రభుత్వమే చెల్లించాలని భావించారు. రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సరర్‌గా ఉంటుందని మంత్రి కేటీఆర్ మౌఖికంగా చెప్పడంతో అప్పట్లో హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు చూస్తున్న పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ ఫైల్ పంపారు. గత స్పాన్సరర్ స్థానంలో పురపాలక శాఖ ఉంటుందని, మొత్తం రూ.160 కోట్లు ఖర్చవుతుందని అందులో పేర్కొన్నారు. దానిపై అదే రోజు కేటీఆర్ సంతకం చేశారు.
ఒప్పందం జరగక ముందే చెల్లింపులు
సదరు ఫైల్‌ను 27.9.23న మంత్రి కేటీఆర్‌కు పంపారు. కానీ, అంతకు రెండు రోజుల ముందు అంటే 25వ తేదీనే ఎఫ్‌ఈఓ ప్రమోటర్ ఫీజు కింద రూ.22,69,63,125 చెల్లించాలంటూ ఇన్‌వాయి్‌సను హెచ్‌ఏండీఏకి పంపింది. మరో నాలుగు రోజుల్లో రూ.23,01,97,500 రూపాయలకు సంబంధించి మరో ఇన్వాయిస్ పంపింది. నిజానికి, అప్పటికి ఇంకా ప్రభుత్వానికి ఎఫ్‌ఈఐకి మధ్య రాతపూర్వక ఒప్పందం జరగలేదు. కానీ, ఈ రెండు ఇన్‌వాయి్‌సలకు సంబంధించి డాలర్లలో హిమాయత్ నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా 2023 అక్టోబర్ 3న, 11న చెల్లింపులు చేసేశారు. ఈ మేరకు హెచ్‌ఎండీఏ చీఫ్ మేనేజర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు.
అనుమతుల్లేకుండానే చెల్లింపులు
నిజానికి.. ఇక్కడ హెచ్‌ఎండీఏకు, ఎఫ్‌ఈవోకు ఏ సంబంధం లేదు. కానీ, హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి చెల్లింపులు జరిపేశారు. అంతేనా.. అంత భారీ మొత్తాలను బదిలీ చేసినా.. అందుకు ఎవరి నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. డాలర్లలో విదేశాలకు డబ్బులు చెల్లిస్తే ఆర్బీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. దానిని తీసుకోలేదు. ఇక, ఆర్థిక శాఖ నుంచి కానీ న్యాయ శాఖ నుంచి కానీ అనుమతి తీసుకోలేదు. పైగా విదేశీ చెల్లింపులు చేసినందుకు హెచ్‌ఎండీఏకు ఆదాయ పన్ను కింద రూ.8.06 కోట్లు అదనపు భారం కూడా పడింది. వెరసి, హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి రూ.54,88,87,043 చెల్లించారు. నిజానికి, హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం.. పది కోట్లకు మించి ఖర్చు చేస్తే ఆర్థిక శాఖ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ, ఎటువంటి అనుమతి తీసుకోలేదు. అలాగే, భవిష్యత్తులో మరిన్ని చెల్లింపులు చేయాల్సి ఉంటే మంత్రిమండలి ఆమోదం కూడా తీసుకోవాలి. కానీ, దానిని కూడా తీసుకోలేదు. భవిష్యత్తులో ఎప్పుడో చేసుకోబోయే ఒప్పందాన్ని ఉద్దేశించి ముందే చెల్లింపులు జరిపేశారు. ఈ కేసులో ఇది తీవ్ర ఉల్లంఘనగా ఎఫ్‌ఐఆర్‌లో ఏసీబీ పేర్కొంది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కూడా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 9.10.23న కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ, చెల్లింపులు చేసిన తర్వాత 30.10.23న ఎఫ్‌ఈవోతో పురపాలక శాఖ మరో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం, స్పాన్సర్ ఫీజు రూ.90 కోట్లతోపాటు ఇతర మౌలిక సదుపాయాలనూ రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందని అందులో పేర్కొన్నారు. అయితే, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోకుండా ఈ ఒప్పందం చేసుకోవడాన్ని ఉల్లంఘనగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆర్థిక శాఖతోపాటు అధీకృత అథారిటీ ఆమోదం లేకుండా రూ.54.88 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించడం నిబంధనలకు పూర్తి విరుద్ధంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఒప్పందంలో హెచ్‌ఎండీఏ భాగస్వామి కాకపోయినా.. ఒప్పందానికి ముందే హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి చెల్లింపులు జరపడం ఏమిటని విస్మయం వ్యక్తం చేసింది. ఈ అంశాలపైనే ప్రధానంగా ఏసీబీ విచారణ చేయనుంది. అలాగే, డాలర్లలో చెల్లింపులు చేయడం ఫారిన్ ఎక్స్ఛేంజి నిబంధనలకు విరుద్ధం. దీనిపైనా ఏసీబీ దృష్టి సారించనుంది. ఒప్పందం ప్రకారం, రాబోయే మూడేళ్లలో అదనపు ఖర్చులతోపాటు రూ.600 కోట్ల వరకూ చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. దీనిపైనా ఏసీబీ దృష్టి సారించనుంది.
హెచ్‌ఎండీఏ ఫిర్యాదుతో వెలుగులోకి
ఎఫ్‌ఈవోకు భారీ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. ఒప్పందం అమలుకు మంత్రిమండలి ఆమోదం అవసరమని, దానికి ముందు ఆర్థిక, న్యాయ శాఖలు అనుమతి ఇచ్చి ఉండాలని, కానీ, ఇవేవీ జరగలేదని, ఇది తీవ్ర ఉల్లంఘనగా పేర్కొన్నారు. రెండోసారి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, ఈసీ అనుమతి తీసుకోకుండానే దీనిపై సంతకాలు చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. అధికారులు కానీ వ్యక్తులు కానీ పూర్తి అవగాహన ఉండి కూడా ఉల్లంఘనలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. హెచ్‌ఎండీఏ నిధులను దుర్వినియోగం చేసిన కోణంలో మరికొంతమంది అధికారులను ఏసీబీ విచారించే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనలన్నీ తెలిసి కూడా నాటి పురపాలక శాఖ కార్యదర్శి అర్విందకుమార్ తప్పు చేశారని, నాటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే ఈ చెల్లింపులు చేశారని ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. డబ్బు చెల్లింపులు, ఒప్పందాలు, లొసుగులకు సంబంధించి పక్కాగా ఆధారాలు సేకరించి.. తొలుత కేటీఆర్, అర్విందకుమార్, బీఎల్‌ఎన్ రెడ్డికి నోటీసులు జారీ చేసి ఆ తర్వాతే చట్టపరమైన చర్యల్లో భాగంగా అరెస్టుకు వెళ్లవచ్చని తెలుస్తోంది.
సెక్షన్లు.. శిక్షలు
అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఎ) ప్రకారం.. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉద్దేశపూర్వకంగా నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశపూర్వకంగా ఇతరులకు అప్పగించడం.. దీనికి నాలుగేళ్ల నుంచి పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం.
పీసీ యాక్ట్ సెక్షన్ 13(2).. నేరపూరితంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించడం. దీనికి ఏడాది నుంచి ఏడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం.
ఐపీసీ సెక్షన్ 409 రెడ్ విత్ 120 బి... నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించి జీవిత ఖైదుకు అవకాశం.
Updated Date - Dec 20 , 2024 | 03:20 AM