Share News

Agricultural Loan Waiver: రుణం తీరిన తరుణం..

ABN , Publish Date - Jul 19 , 2024 | 02:42 AM

బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతీ రైతుకూ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రుణ మాఫీకి పట్టాదారు పాసుపుస్తకమే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు.

Agricultural Loan Waiver: రుణం తీరిన తరుణం..

2.jpg

  • 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము

రుణం మాఫీ.. రైతు ఖుషీ..! పల్లెపల్లెనా సంబరాలు

ట్రింగ్‌.. ట్రింగ్‌..! సాయంత్రం 4 గంటలు దాటిన తర్వాత రాష్ట్రంలోని రైతుల ఫోన్‌కు మెసేజ్‌! మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం పడిందంటూ సమాచారం! అంతే.. దాదాపు 11 లక్షల మంది రైతుల ముఖాల్లో ఆనందం! ఏళ్లుగా పెండింగులో ఉన్న బాకీ తీరిపోయిందనే సంతోషం! వానాకాలం పంట ముందు మరోసారి రుణం తీసుకోవచ్చనే ఆశ! రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల సంబురం!! కాంగ్రెస్‌ సర్కారు చెప్పినట్లే చేసింది! సీఎం రేవంత్‌ మాట నిలబెట్టుకున్నారు! పంద్రాగస్టులోపే రుణ మాఫీకి శ్రీకారం చుట్టారు! తొలి విడతగా గురువారం లక్షలోపు రుణాలు మాఫీ అయ్యాయి! ఇటు రైతుకూ రుణ భారం తీరింది! అటు ప్రభుత్వమూ ఓటు వేసి గెలిపించిన రైతన్న రుణం తీర్చేసుకున్నట్లు అయింది!!

  • నా జీవితంలో మరపురాని రోజు

  • నెలాఖర్లో రాహుల్‌గాంధీకి కృతజ్ఞత సభ

  • దొంగల మాటలు నమ్మొద్దు

  • సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు

  • వాళ్ల రాజీనామా కోసం పట్టుబట్టం

  • కేసీఆర్‌ 7 లక్షల కోట్ల అప్పుచేసి వెళ్లారు

  • ఆ సంక్షోభాన్ని భట్టి చక్కబెడుతున్నారు

  • రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌

  • లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

హైదరాబాద్‌, జులై 18 (ఆంధ్రజ్యోతి): బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతీ రైతుకూ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రుణ మాఫీకి పట్టాదారు పాసుపుస్తకమే ప్రాతిపదిక అని స్పష్టం చేశారు. రైతు కుటుంబాన్ని గుర్తించటానికి మాత్రమే రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకుంటున్నామని, రేషన్‌కార్డు లేని వారికి కూడా రుణమాఫీ జరుగుతుందని తేల్చిచెప్పారు. రేషన్‌కార్డు తప్పనిసరని ప్రచారం చేస్తున్న కొంతమంది దొంగలు చెప్పే దొంగ మాటలను రైతులు నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేశారు. రుణమాఫీపై సవాళ్లు విసిరిన వారి (హరీశ్‌రావు) రాజీనామాల కోసం పట్టుబట్టబోమని చెప్పారు. వాళ్లు ఎట్లాగూ పారిపోతారని తెలుసని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు మాటిస్తే అది శిలాశాసనమేనని చెప్పారు. గాంధీ కుటుంబం రాజకీయ ప్రయోజనాల కోసం మీలాంటి మాటలు మాట్లాడదంటూ పరోక్షంగా కేసీఆర్‌ కుటుంబాన్ని విమర్శించారు.


రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో రెండు లక్షల రైతు రుణమాఫీ పథకానికి శ్రీకారం చుట్టారు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన చెక్కులను పలువురు రైతులకు స్వయంగా పంపిణీ చేశారు. పంపిణీకి ముందు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లోని రైతు వేదికల వద్ద సమావేశమైన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి, అసలు, వడ్డీ చెల్లిస్తామని హామీ ఇచ్చి నాలుగైదు విడతల్లో చేసిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. 2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయినా హామీని నెరవేర్చలేకపోయారన్నారు. మొదటి ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు మాత్రమే చెల్లించిందని చెప్పారు. రెండో దఫా అధికారంలోకి వచ్చాక రూ.16 వేల కోట్లకు గాను రూ.9 వేల కోట్లు కూడా సరిగా చెల్లించలేదని అన్నారు. పదేళ్ల పాలనలో 21 వేల కోట్ల రూపాయల మాఫీ కూడా సక్రమంగా చేయలేక పోయారని చెప్పారు.


కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక పోయారని, ముఖ్యమంత్రి చెప్పారంటే జరిగి తీరుతుందనే విశ్వాసాన్ని కోల్పోయేలా చేశారని విమర్శించారు. 2022లో వరంగల్‌లో రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్‌ ప్రకటించారని, 2023లో తుక్కుగూడలో సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ప్రకటించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ధైర్యంగా, దర్పంగా లక్ష రూపాయల వరకు అప్పులున్న రైతులకు రూ.6,099 కోట్లు చెల్లించిందన్నారు. జిల్లా పరిషత్‌, శాసన మండలి, శాసనసభ, లోక్‌సభల్లో 16 ఏళ్ల తన సుదీర్ఘ రాజకీయ రాజకీయ జీవితంలో రుణమాఫీ చేసిన ఈ రోజు మరుపురాని రోజని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 40 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసే అద్భుతమైన అవకాశం తనకు దక్కిందన్నారు.


ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రెండో విడత రుణమాఫీ చేస్తానని కేసీఆర్‌ ప్రకటించిన రోజు 2018 డిసెంబరు 12 నుంచి సరిగ్గా ఐదేళ్లకు సోనియాగాంధీ పుట్టిన రోజు, తెలంగాణ ప్రకటన చేసిన రోజు అయిన 2023 డిసెంబరు 9వరకు ఉన్న అన్ని పంట రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించామన్నారు. రెండోవిడతలో రూ.1.50లక్షల వరకు రుణాలు, మూడో విడతలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. ఆగస్టు పూర్తి కాకముందే రైతుల ఖాతాల్లో రూ.31వేల కోట్లు జమ చేస్తామని చెప్పారు. ఏడు లక్షల కోట్లు అప్పుచేసి కేసీఆర్‌ దిగిపోతే, ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వరిస్తున్న భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుతున్నారని కొనియాడారు. ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్‌ రాష్ట్రాన్ని తీసుకెళ్లారని చెప్పారు.


ఇప్పుడు నెలనెలా 1వ తేదీన రూ.5వేల కోట్లు జీతాలు, పెన్షన్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుటి వరకు ఐదు గ్యారెంటీల అమలుకు రూ.29వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో రైతులకు రుణమాఫీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచామని చెప్పారు. 2004లో కరీంనగర్‌లో సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక రాష్ట్ర హామీని ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే ఆందోళనలున్నా నెరవేర్చారని రేవంత్‌ గుర్తు చేశారు. కార్యకర్తలు రుణమాఫీ గురించి రైతులకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. రైతుల వైపు నుంచి సమస్యలు వస్తే అవగాహన కల్పించి రుణమాఫీ చేయాలని బ్యాంకు అధికారులకు విజ్ఞప్తి చేశారు.


రూపాయి రూపాయి కూడబెట్టి: భట్టి

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణ మాఫీ చేసిన ఘనత భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో లేదన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను టీఆర్‌ఎస్‌ చేతిలో పెడితే లక్ష రూపాయల రుణమాఫీని కూడా నాలుగైదు వాయిదాల్లో ఐదేళ్లలో చేశారన్నారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరితే అంతా ఆశ్చర్యపోయారని, సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు పడతారేమోననే భావాన్ని కూడా కొందరు వ్యక్తపరిచారని ప్రస్తావించారు. ధైర్యంతో రూపాయి రూపాయి కూడబెట్టి ఒకే రోజు లక్ష వరకు మాఫీ చేశామని, ఆగస్టు దాటకుండానే రూ.2 లక్షలు మాఫీకి నాంది పలికామని చెప్పారు. ఒకేసారి రూ.31వేల కోట్ల మాఫీ కార్పొరేట్‌ రంగంలో కూడా ఎక్కడా జరగలేదని తెలిపారు.


సాధ్యం కాదనుకున్నారు: తుమ్మల

ఖర్గే, సోనియా, రాహుల్‌ల సమక్షంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చినపుడు విపక్ష నేతలు ఇది సాధ్యం కాదని నిర్ధారణకు వచ్చి, ఏకంగా తమ పదవులు కోల్పోయే విధంగా సవాళ్లు విసిరారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. గత ప్రభుత్వ అస్తవ్యస్త పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేస్తున్న ఘనత రేవంత్‌కే దక్కిందని చెప్పారు. రైతుల పండుగ కంటే బ్యాంకర్ల పండుగే ఎక్కువగా ఉన్నదని, ఒకేసారి రూ.31 వేల కోట్లు బ్యాంకులకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పైసా తిరిగి రుణాల రూపంలో రైతుల చేతుల్లోకి వెళ్లాలని బ్యాంకులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌ బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, కె.కేశవరావు, హర్కార వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2024 | 02:42 AM