ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Welfare Funds: ప్రభుత్వ పెన్షన్‌దారులకూ ‘ఆసరా’ ఇచ్చేశారు!

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:19 AM

ఆపన్నులకు ఇవ్వాల్సిన ‘ఆసరా’.. అనర్హులకూ అందించేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్‌ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్‌, పైలేరియా, ఎయిడ్స్‌ రోగులకు ఆసరా పథకం కింద గత ప్రభుత్వం పింఛన్లు అందజేసింది.

  • లబ్ధిదారుల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు.. సెర్ప్‌ తనిఖీల్లో వెలుగులోకి అక్రమాలు

  • 5,650 మందికి డబుల్‌ పింఛన్లు!.. వీరిలో 3,824 మంది మృతి

హైదరాబాద్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఆపన్నులకు ఇవ్వాల్సిన ‘ఆసరా’.. అనర్హులకూ అందించేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, స్టోన్‌ కట్టర్లు, చేనేత కార్మికులు, వికలాంగులు, డయాలసిస్‌, పైలేరియా, ఎయిడ్స్‌ రోగులకు ఆసరా పథకం కింద గత ప్రభుత్వం పింఛన్లు అందజేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్లరేషన్‌ కార్డు కలిగిన వారు ఈ పథకానికి అర్హులు. కానీ, బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఈ పథకం పక్కదారి పట్టింది. పింఛన్లు అందుకున్న విశ్రాంత ప్రభుత్వోద్యోగులు కూడా ఆసరా పింఛన్లు తీసుకున్నారు! ఇలా ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా 5650 మంది తీసేసుకున్నారు! అర్హులకు అందించాల్సిన పింఛన్లు అనర్హుల జేబుల్లోకి వెళ్లిపోయాయి. ఆసరా పథకం అమల్లో అవకతవకలపై కాంగ్రెస్‌ ప్రభుత్వం జరిపిన విచారణలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ప్రభుత్వ ఉద్యోగులుగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభుత్వ పింఛనుతోపాటు ఆసరాపింఛను కూడా తీసుకున్న వారు రాష్ట్రవ్యాప్తంగా 5650 మంది ఉన్నారని ఇటీవల సెర్ప్‌ అధికారులు చేసిన సర్వేలో తేలింది. వీరిలో 3824 మంది ఇప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మిగిలిన 1826 మంది ఇప్పటికీ రెండు పింఛన్లు అందుకుంటున్నారని గుర్తించారు. ఆసరా అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందడంతో జూన్‌ నుంచి ఇలాంటి వారి పింఛన్లు నిలిపివేసింది. ఉద్యోగులుగా పదవీ విరమణ చేసిన వారు.. వారి కుటుంబ సభ్యులు సైతం ఆసరా కింద పింఛను పొందారు. దీని వల్ల భారీగా నిధుల దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే 427మంది అక్రమంగా రెండు పింఛన్లు తీసుకున్నట్లు విచారణలో వెలుగు చూసింది. రూ.2.50 కోట్లు అనర్హులకు అందినట్లు అధికారులు పేర్కొన్నారు.


మల్లమ్మకూ డబుల్‌ పింఛన్‌!

భద్రాది కొత్తగూడెం జిల్లాలో 80 ఏళ్ల మల్లమ్మకు అందించిన పింఛను నగదు వెనక్కు ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇవ్వడం అమానవీయమైన చర్య అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కానీ, ఈమె కూడా డబుల్‌ పింఛను జాబితాలోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. దాసరి మల్లమ్మ కుమార్తె దాసరి రాజేశ్వరి ఏఎన్‌ఎంగా పని చేస్తూ 2010లో మరణించారు. ఆమెకు పెళ్లికాకపోవడంతో తల్లి దాసరి మల్లమ్మకు ఫ్యామిలీ పింఛను కింద ప్రభుత్వం ప్రతి నెలా రూ.24,073 చెల్లిస్తోంది. దీంతోపాటు ఆసరా పింఛను సైతం మల్లమ్మకు అందుతున్నట్లు గత నెలలో నిర్వహించిన సర్వేలో అధికారులు గుర్తించారు. దీంతో ఆమెకు వెంటనే చేయూత పింఛన్‌ను నిలిపివేశారు.


పింఛను సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ నోటీసులా?

  • వృద్ధురాలి పట్ల రేవంత్‌ సర్కారు అమానవీయ వైఖరి: కేటీఆర్‌

కొత్తగూడెం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్‌.. ఇప్పుడు పింఛనుదారులకు నోటీసులు ఇస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ‘‘కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ఉంది. అనేక పథకాలు ఇస్తామని, ఉన్న పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి, గద్దెనెక్కిన రేవంత్‌ సర్కార్‌ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారుల నుంచి సొమ్మును వెనక్కి రాబట్టే వింత చేష్టలు మొదలు పెట్టింది’’ అని విమర్శించారు. ‘‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలికి ఆసరా పింఛన్‌ కింద వచ్చిన రూ.1,72,928 ప్రభుత్వానికి చెల్లించాలంటూ నోటీసు ఇచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్న వృద్ధురాలికి కేసీఆర్‌ సర్కారు ఇచ్చిన పింఛన్‌ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్‌ సర్కార్‌ అమానవీయ వైఖరికి నిదర్శనం. ఇలాంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి. లేకుంటే ప్రజలే సర్కారు మీద తిరగబడతారు’’అని కేటీఆర్‌ శనివారం ట్వీట్‌ చేశారు.


నిబంధనలకు విరుద్ధమైనందునే తొలగించాం: మంత్రి సీతక్క

ములుగు, జూలై 13: రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతోందని, అర్హులైన లబ్ధిదారులకే పథకాలు అందిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. పింఛన్లు రద్దు చేస్తున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేయడం.. రాజకీయంగా చర్చనీయాంశం కావడంతో శనివారం మంత్రి స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే వృద్ధురాలు డబుల్‌ పింఛను తీసుకుంటున్నట్లు అధికారులు జరిపిన విచారణలో తేలిందన్నారు. ట్రెజరీ అధికారులు వివరణ కోరుతూ నోటీసు జారీ చేసినట్లు చెప్పారు. కేటీఆర్‌ వాస్తవాలు తెలుసుకోకుండా ఏదిపడితే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచిస్తోందని.. అర్హులందరికీ పింఛను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి పైసా అర్హులకే దక్కాలన్నది తమ సంకల్పమన్నారు. మల్లమ్మ విషయంలో రెండు రకాల పింఛన్లు ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవన్న విషయాన్ని తెలుసుకోవాలని కేటీఆర్‌కు సూచించారు.

Updated Date - Jul 14 , 2024 | 04:20 AM

Advertising
Advertising
<