Shadnagar: గ్లాస్ పరిశ్రమలో పేలుడు..
ABN, Publish Date - Jun 29 , 2024 | 03:35 AM
ఒక్క కార్మికుడు పనిలో చేసిన పొరపాటు.. పెను ప్రమాదానికి కారణమైంది! అద్దాలు తయారుచేసే పరిశ్రమలో రియాక్టర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఐదుగురు కార్మికుల దుర్మరణం.. 10 మందికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా బూర్గుల గ్రామశివారులో ఘోర ప్రమాదం
పేలుడు ధాటికి ఛిద్రమై.. చెల్లాచెదురైన మృతదేహాలు
మృతులు యూపీ, ఒడిసా, బిహార్ రాష్ట్రాలకు చెందినవారు
సీఎం రేవంత్ ఆరా.. సహాయకచర్యలు చేపట్టాలని ఆదేశం
షాద్‌నగర్/షాద్‌నగర్ రూరల్, హైదరాబాద్, జూన్ 28(ఆంధ్రజ్యోతి): ఒక్క కార్మికుడు పనిలో చేసిన పొరపాటు.. పెను ప్రమాదానికి కారణమైంది! అద్దాలు తయారుచేసే పరిశ్రమలో రియాక్టర్ పేలి ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని బూర్గుల గ్రామ శివారులోని సౌత్ గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం జరిగిందీ దుర్ఘటన. గాయపడ్డవారిలో తొమ్మిదిమందిని షాద్‌నగర్ పట్టణంలోని వివో ఆస్పత్రికి తరలించారు. మరో కార్మికుడిని చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని లిమ్స్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ పదిమందిలో.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముగ్గురిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్ అపోలో ఆస్పత్రికి తరలించారని.. వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని.. యాజమాన్యం ఈ విషయం బయటపడకుండా రహస్యంగా ఉంచుతోందని పలువురు కార్మికులు చెబుతున్నారు.
ప్రమాదం ఇలా..
ఈ పరిశ్రమలో.. వాహనాల అద్దాలు తయారు చేసేందుకు ఆటోక్లేవ్ అనే యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఇందులో గ్యాస్‌తో పాటు అధిక ఉష్ణం గల పరికరాలను ఉపయోగిస్తారు. అద్దాలు తయారయ్యాక.. తొలుత అందులో ఉన్న గ్యాస్‌ను బయటకు పంపి, తయారైన అద్దాలను బయటకు తీయాల్సి ఉంటుంది. కానీ అక్కడ పనిచేస్తున్న ఓ కార్మికుడు గ్యాస్‌ను విడుదల చేయకుండానే ఆటోక్లేవ్‌ను ఓపెన్ చేయడం వల్ల పెద్ద శబ్దంతో రియాక్టర్ పేలి.. అక్కడే పనిచేస్తున్న యూపీవాసులు నితీశ్‌కుమార్(22), రామ్‌సేత్(24), బిహార్‌కు చెందిన రామ్ ప్రకాశ్(31), చిత్తరంజన్(31), ఒడిసాకు చెందిన రతికాంత్(23) అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడ్డవారిలో.. మైకేల్ ఇమ్రాన్(25), గోవింద్(25), కార్తీక్(19), సుబోధ్(22), మంతు(23), సమిత్‌కుమార్(18), రోషన్ కుమార్(20), సురేందర్ పాశ్వాన్(21), రవికాంత్(37), రాజేష్ పాషా(36), మమత(26), నీలమ్మ(40), సుజాత(24) ఉన్నారు. వీరిలో రాజేష్ పాషా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
చేతులు తెగి..
ఈ ఫ్యాక్టరీలో షిఫ్టుకు 50 మంది చొప్పున మొత్తం 200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్ వద్ద 16 మంది.. ఫ్యాక్టరీలో మొత్తం 50 మంది ఉన్నారు. పేలుడు ధాటికి ప్రాణాలు కోల్పోయిన ఐదుగురి కాళ్లు, చేతులు విరిగి చెల్లాచెదురుగా పడ్డాయి. ఒక వ్యక్తి మృతదేహం మరో యంత్రంలో ఇరికి ఒక కాలు మాత్రమే బయటకు కనిపిస్తోంది. కొందరి శరీర భాగాలు 20 అడుగుల ఎత్తువరకూ ఎగిరి.. పరిశ్రమలోని రేకుల పైభాగం నుంచి బయట ఆవరణలోకి వచ్చిపడ్డాయి. పరిశ్రమలో ఎక్కడ చూసినా శరీర భాగాలు, రక్తపు మడుగులతో భీతావహ దృశ్యాలు కనిపించాయి. గాజుముక్కలు చెల్లాచెదురయ్యాయి. రేకులతో ఉన్న పైకప్పు ఎప్పుడు కూలుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. కాగా.. జరిగిన ఘోరం పట్ల జిల్లా కలెక్టర్ శశాంక దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం సంగతి తెలియగానే ఆయన హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. షాద్‌నగర్ ఆస్పత్రిని సందర్శించి, గాయపడిన కార్మికులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు.
మృతుల కుటుంబసభ్యుల వివరాలను సేకరించి, వారికి ప్రమాద ఘటన గురించి సమాచారం తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఇక.. ప్రమాదానికి కారణాలను తెలుసుకుని పరిశ్రమ యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని డీసీపీ వెల్లడించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదంపై ఆరా తీశారు. గాయపడ్డవారికి సత్వరం వైద్యచికిత్స అందించాలని.. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక శాఖ అధికారులతోపాటు వైద్యబృందాలు కూడా ఘటనాస్థలి వద్దే ఉండి సహాయకచర్యలు అందించాలని ఆదేశించారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ ప్రణాళిక అమలుచేయాలని, భద్రతా ఆడిట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jun 29 , 2024 | 03:35 AM