Hyderabad: అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది
ABN, Publish Date - Jun 03 , 2024 | 04:18 AM
బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని, తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చిందని మండిపడ్డారు.
ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరు చేస్తాం: సంజయ్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుందని, తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చిందని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు సహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షల అమలుకు రాష్ట్ర ప్రజలు మరో పోరుకు సిద్ధమవుతున్నారని ప్రకటించారు. ఈ పోరుకు బీజేపీ నేతృత్వం వహిస్తుందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లయినా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉందని.. ఏ ఆశయాలు, ఆకాంక్షలతో ప్రజలు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమించారో.. అవి నేటికీ నెరవేరలేదని విమర్శించారు. ఈ మేరకు సంజయ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘గతంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను పరాయి పాలకు లు పక్క రాష్ట్రానికి దోచిపెడితే.. స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణ పాలకులే స్వార్థ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి నీటిని తాకట్టు పెట్టారు. పదేళ్ల పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. కాం గ్రెస్ సర్కారు సైతం బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోంది. కాంగ్రెస్ పాలకులు బీఆర్‌ఎస్ మాదిరిగానే ‘తెలంగాణ పదేళ్ల పండుగ’ పేరుతో ప్రకటనలిస్తూ రూ.కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైంది’’ అని సంజయ్ వివరించారు.
బలిదేవతకు రేవంత్ భక్తుడెలా అయ్యారు: లక్ష్మణ్
సోనియాను బలిదేవతగా అభివర్ణించిన రేవంత్.. ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే ఆమె భక్తుడిగా మారిపోయారంటే అవకాశవాదం కాదా..? అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నిలదీశారు. సకల జనుల పోరాటాలు, యువత బలిదానాలతో తెలంగాణ సిద్ధిస్తే.. సోనియానే తెలంగాణ ఇచ్చారని రేవంత్ ప్రకటించడం భావ్యం కాదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆవిర్భావ ఉత్సవా ల్లో బీజేపీని ఎందుకు భాగస్వామ్యం చేయలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 1969 తెలంగాణ ఉద్యమకారులను సన్మానించారు.
Updated Date - Jun 03 , 2024 | 04:18 AM