Traffic Issues: స్లో స్పీడ్ కారిడార్!
ABN , Publish Date - Dec 16 , 2024 | 04:03 AM
హైదరాబాద్ కంటే ముందున్నదని చెప్పే కర్ణాటక రాజధాని బెంగళూరును ‘ట్రాఫికర్’ ఎంత అప్రదిష్ఠ పాల్జేసిందో అందరూ చూశారు. సోషల్ మీడియాలోనూ దీనిపై అనేక వ్యంగ్య పోస్టులు, వీడియోలు వచ్చాయి.
ఔటర్ రింగ్ రోడ్‌పై టోల్ నిర్వహణ అస్తవ్యస్తం
టోల్‌బూత్‌లలో పనిచేయని బూమ్ బారియర్స్.. భారీగా నిలిచిపోతున్న వాహనాలు
ఎగ్జిట్ రోడ్లు నిండిపోయి ఓఆర్‌ఆర్ పైవరకు చేరిక.. 20 వాహనాలు దాటి ఆగితే ఉచితం
అయినప్పటికీ గేట్లు ఎత్తని సిబ్బంది.. 10 గేట్లకు ముగ్గురు నలుగురు సిబ్బందితోనే సరి
1, 2 లేన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు.. జరిమానాల విధింపు మాటే లేని వైనం
‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో స్పష్టం
నానక్‌రామ్‌గూడ వద్ద ఔటర్ రింగ్ రోడ్‌పై ఇదీ పరిస్థితి. వాహనాల రద్దీ ఉన్నప్పటికీ 11వ నంబరు లేన్‌ను మూసివేశారు. దీంతో మిగతా లేన్లలో వాహనాలు బారులు తీరాయి. ఒక లేన్‌లో 20 వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు వంద మీటర్ల లోపే ఎల్లో లేన్లను గీశారు. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు.
రాజేంద్రనగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో.. 1, 2 లేన్లలోకి భారీ వాహనాలు దూసుకొస్తున్న దృశ్యం. ఔటర్‌పైకి వచ్చే భారీ వాహనాలకు నిర్దేశించిన 3, 4 లేన్లలో గరిష్ఠ వేగం 80 కిలోమీటర్లు. కానీ, గరిష్ఠ వేగ పరిమితి 120 కిలోమీటర్లు ఉన్న, కార్లు వెళ్లే 1, 2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. దీంతో కార్ల డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు ఇలా రాకూడదంటూ టోల్‌బూత్‌ల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్).. విశ్వ నగరిగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు గ్రోత్ కారిడార్..! నగరంపై ట్రాఫిక్ భారం పడకుండా చేపట్టిన భారీ నిర్మాణం..! వాహనాలు అత్యంత సాఫీగా వెళ్లేలా చూడడం దీని ఉద్దేశం..! అలాంటి ఓఆర్‌ఆర్‌పైనే తీవ్ర ‘జామ్’ఝాటం..! టోల్‌ప్లాజాల నిర్వహణ అస్తవ్యస్తం.. ఫలితంగా ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి..! ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ కంటే ముందున్నదని చెప్పే కర్ణాటక రాజధాని బెంగళూరును ‘ట్రాఫికర్’ ఎంత అప్రదిష్ఠ పాల్జేసిందో అందరూ చూశారు. సోషల్ మీడియాలోనూ దీనిపై అనేక వ్యంగ్య పోస్టులు, వీడియోలు వచ్చాయి. ట్రాఫిక్ కష్టాలను సాకుగా చూపుతూ పరిశ్రమలను బెంగళూరు నుంచి తరలించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఓఆర్‌ఆర్‌పై నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించకుంటే హైదరాబాద్‌కూ వచ్చే ఏడెనిమిదేళ్లలో ఇలాంటి అనుభవమే ఎదురవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అందుకని ప్రభుత్వం తక్షణం దృష్టిసారించిన అవసరం ఉంది.
సాఫీ కాదు.. సంకట పరిస్థితి
వాహనాలు సాఫీగా సాగిపోయేందుకు నిర్మించిన ఔటర్‌పైనే ట్రాఫిక్ ‘జామ్’ఝాటం నెలకొంటోంది. నిర్వహణలో కనీస నిబంధనలు పాటించక పోవడంతో పరిస్థితి అస్తవ్యస్తం అవుతోంది. సాంకేతికతను అందిపుచ్చుకొని వాహనాలు కదిలేందుకు మెరుగైన చర్యలు చేపట్టడం లేదు. టోల్‌ప్లాజాల వద్ద ఒక్కో లైన్‌లో ఉండే బూమ్ బారియర్స్ పనిచేయడం లేదు. పైకి లేస్తే కిందికి రావడం లేదు. కిందికి వస్తే పైకి లేవడం లేదు. టోల్‌బూత్ సిబ్బంది వచ్చి వాటిని బలవంతంగా పక్కకు జరిపి వాహనాలను వదిలే పరిస్థితి నెలకొంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య ఔటర్‌పై ‘ఆంధ్రజ్యోతి’ చేసిన పరిశీలనలో ఇలాంటి లోపాలు స్పష్టంగా కనిపించాయి.
1, 2 లేన్లలోకి దూసుకొస్తున్న భారీ వాహనాలు
ఔటర్‌పైకి వచ్చే భారీ వాహనాలు గరిష్టంగా 80కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. ఇవి ప్రయాణించేందుకు నిర్దేశించిన 3, 4 లేన్లలో గరిష్ఠ వేగం 80 కిలోమీటర్లు. కానీ, భారీ వాహనాలు 1, 2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. వీటిలో గరిష్ఠ వేగ పరిమితి 120 కిలోమీటర్లు. దీంతో అదే వేగంతో వెళ్లే కార్ల డ్రైవర్లు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఒకటి, రెండు లేన్లలోకి నెమ్మదిగా వెళ్లే భారీ వాహనాలు రావడంతో ఆందోళన చెందుతున్నారు. భారీ వాహనాలు 1, 2 లైన్లలోకి రాకూడదంటూ అవగాహన కల్పించేలా టోల్‌బూత్‌ల వద్ద బోర్డులు, చర్యలు చేపట్టడం లేదు. జరిమానాలు విధిస్తామనే హెచ్చరికలూ లేవు. ఇంటర్ ఛేంజ్‌ల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి భారీ వాహనదారులు ఏ వైపు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో ఓ మార్గంలో వెళ్లిన తర్వాత తప్పుగా వెళ్తున్నామని భావించి వాహనాన్ని తిప్పుతున్నారు. ఇలా రాంగ్ రూట్‌లో వస్తున్నా హెచ్చరించేవారు కరువయ్యారు.
ఔటర్ నిర్మాణ సమయంలోనే ఓవైపు ఆరు.. మరోవైపు ఆరు చొప్పున 12 టోల్‌బూత్‌లతో డిజైన్ చేశారు. ట్రాఫిక్ బాగా ఉన్నప్పుడు వాడేందుకు ఓవైపు మూడు.. మరోవైపు మూడు తాత్కాలిక బూత్‌లు కూడా ఉన్నాయి. కానీ, రద్దీ సందర్భంలోనూ వీటిని తెరవడం లేదు. పైగా 12 బూత్‌లలోనే ఒకటి, రెండు మూసేస్తున్నారు. ఇటీవల ఒక్కో లేన్‌లో 20 వరకు వాహనాలు ఉండగా.. 11వ లేన్ మూసేశారు. దీంతో మిగతా లైన్లలో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఎల్లో లైన్ దాటిపోతున్నా పట్టించుకోవడం లేదు. సిబ్బంది పర్యవేక్షణ శూన్యం.
ఎల్లో లైన్ దాటినా.. ఉచితం లేదు
టోల్ వసూళ్ల కోసం ఏజెన్సీ ఏర్పాటు చేసిన సందర్భంలో హెచ్‌ఎండీఏ అధికారులు నిబంధనలు విధించారు. వాటి ప్రకారం టోల్‌ప్లాజాల వద్ద ఒక లైన్‌లో 20 వాహనాలకు మించి ఉంటే రుసుము తీసుకోకుండానే వదలాలి. ఈ నిబంధన అమలుకు టోల్‌ప్లాజాల వద్ద వంద మీటర్ల లోపే ఎల్లో లైన్లను గీశారు. ఇప్పుడు ఎక్కడా దీనిని పట్టించుకోవడం లేదు. ఔటర్‌ను 30 ఏళ్లకు ప్రైవేటుకు లీజుకిచ్చినా ఈ నిబంధన కొనసాగుతోంది. కానీ, అమలుకావడం లేదు. వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఈ నిబంధనలేవీ బోర్డు రూపంలో పెట్టలేదు.
వందల వాహనాలున్నా టోల్ చెల్లించాకే వెళ్లాల్సిన పరిస్థితి. ఇక వాహన రాకపోకలతో కొన్ని ప్రాంతాల్లో ఎల్లో లైన్లు తుడుచుకుపోగా.. మరికొన్నిచోట్ల రోడ్ల రీ కార్పెటింగ్ చేసిన తర్వాత గీతలు గీయలేదు.
ఉదయం, సాయంత్రం ట్రాఫికర్
ఔటర్‌పై ఉదయం, సాయంత్రం శంషాబాద్, రాజేంద్రనగర్, కోకాపేట, టీజీపీఏ, నానక్‌రాంగూడ తదితర టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్‌లవుతున్నాయి. ఈ వేళల్లో ఔటర్‌పైకి వచ్చేందుకు, ఎగ్జిట్ అయ్యేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాజేంద్రనగర్ ఎగ్జిట్ టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరి చివరకు ఔటర్‌పైకి చేరుతున్నాయి. ఔటర్‌పై నాలుగో లైన్‌లో బారులు తీరిన కానీ వెనుక నుంచి ఏ వాహనం వేగంగా దూసుకొస్తున్నదో తెలియక ఆందోళన చెందే పరిస్థితులున్నాయి.
శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఔటర్ పైకి చేరుకునే వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద సాంకేతిక సమస్యలతో నిలిచిపోయి.. చివరకు జాతీయ రహదారి 44పైకి కూడా చేరుతున్నాయి. పలు టోల్‌ప్లాజాల వద్ద ఔటర్ పైకి చేరుకునేందుకు, దిగిపోయేందుకు (ఎగ్జిట్) 15 నిమిషాలకు పైగా పడుతోంది. 158 కిలోమీటర్ల ఔటర్ పరిధిలో ప్రతి 16 కిలోమీటర్లకు పది అడ్వాన్స్ లైఫ్ సపోర్టు అంబులెన్స్‌లున్నాయి. సాధారణ వాహనాలతో పాటే ఇవి కూడా రద్దీలో చిక్కుకుంటున్నాయి. గత గురువారం రాత్రి నానక్‌రాంగూడ వద్ద 10వ టోల్ బూత్ నుంచి ఇతర వాహనాల వెనుకే ఓ ప్రముఖ ఆస్పత్రి అంబులెన్స్ చాలాసేపు ఆగిపోయింది.
పనిచేయని బూమ్ బారియర్స్.. రద్దీకి తగ్గ సిబ్బంది కరువు
ఔటర్‌పై 130 వరకు టోల్‌ప్లాజాలుండగా.. బూమ్ బారియర్స్ చాలాచోట్ల సాంకేతిక సమస్యలతో పనిచేయడం లేదు. వాహనాలు రాకుంటే బూమ్ బారియర్స్ కిందకు ఉండడం, వస్తే ఫాస్టాగ్ ద్వారా పైకి లేవడం చేయాలి. కానీ, ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక గ్రీన్ లైన్ వచ్చినా బూమ్ బారియర్స్ పైకి లేవడం లేదు. దీంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. బూమ్ బారియర్స్‌ను టోల్ సిబ్బంది బలవంతంగా పక్కకు జరపాల్సిన పరిస్థితులున్నాయి. కాగా, ఫాస్టాగ్ లైన్ ఉన్నా.. ఔటర్‌పై ప్రతి టోల్ బూత్‌లో సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి. వారు వాహనాలను గమనించాలి. ఫాస్టాగ్‌లో ఏదైన సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేయాలి. కానీ, ప్రస్తుతం సిబ్బంది కరువయ్యారు. టీజీపీఏ వద్ద ఔటర్ ఎక్కే క్రమంలో ఉన్న రెండు టోల్ బూత్‌లకు కలిసి ఒక్కరే ఉన్నారు. ఫాస్టాగ్ లైన్‌లోని బూత్‌లో అసలే లేరు. ఇదేవిధంగా ఔటర్‌పై అన్ని ఎగ్జిట్, ఎంట్రీ పాయింట్లలో ఇదే పరిస్థితి. రాత్రి సమయంలో కూడా ఒక్కరే ఉంటున్నారు. ఇక నానక్‌రాంగూడ వద్ద దాదాపు 10కి పైగా టోల్ బూత్‌లు ఉంటే ఇద్దరు, ముగ్గురే సిబ్బంది ఉంటున్నారు. ఫాస్టాగ్ లైన్‌లో సిబ్బందిని పెట్టడం లేదు. సమస్య వస్తే పరిష్కారం లేక వాహనాలు భారీగా నిలిచిపోతున్నాయి. సిబ్బందిని చాలా వరకు కుదించారని చెబుతన్నారు. గతంలో నానక్‌రాంగూడ వద్ద టోల్, సెక్యూరిటీ సిబ్బంది, సూపర్‌వైజర్లతో కలిసి ఒక్కో షిఫ్ట్‌కు 30మందిపైగా ఉండేవారు. ఇప్పుడు 15మంది కూడా లేరని ఓ ఉద్యోగి వాపోయారు.
కనిపించని పెట్రోలింగ్ వాహనాలు
నానక్‌రాంగూడ నుంచి శంషాబాద్ మార్గంలో ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో ఒక్క ప్రెటోలింగ్ వాహనం కనిపించలేదు. ప్రమాదం జరిగితే క్షణాల్లోనే పెట్రోలింగ్ సిబ్బంది రావాలి. టోయింగ్ వాహనంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను సుగమం చేయాలి. ఏదైనా వాహనం మొరాయిస్తే ఇతర వాటికి అడ్డు రాకుండా పక్కకు జరపాలి. హెచ్చరిస్తూ బారికేడ్లను పెట్టాలి. కానీ ఎస్‌వోస్ ద్వారా సంప్రదించినా స్పందన లేదు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌లవుతున్నాయి. ఔటర్‌పైకి మనుషులు రాకుండా కంచె ఏర్పాటు చేశారు. నార్సింగి వద్ద దానిని తొలగించి వస్తున్నారు. అక్కడే సరుకు రవాణా వాహనాలను ఎక్కుతున్నారు. పెట్రోలింగ్ సిబ్బందికి తెలిసే ఇది సాగుతున్నదనే ఆరోపణలున్నాయి.
సమయం: రాత్రి 8 గంటలు..! హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఓ వాహనం నార్సింగి వద్ద ఆగిపోయింది. డ్రైవర్ బండిని పక్కకు తీశాడు. పది నిమిషాలు ప్రయత్నించినా ఇతర వాహనదారులెవరూ ఆపలేదు. అత్యవసరంలో సాయం అందించే ఎస్‌వో్‌సకు (సేవ్ అవర్ సోల్) చేరుకుని బటన్ నొక్కాడు. ‘సార్ నా వాహనం ఆగిపోయింది. సాయం చేయండి’ అని కోరాడు. ఎస్‌వో్‌సలో మాత్రం.. ‘సారీ అండి, టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి?’ అని చెప్పి కట్ చేశారు. టోల్ ఫ్రీ ఎక్కడుందో తెలియక డ్రైవర్ మళ్లీ ఇతర వాహనాలను ప్రయత్నం చేశాడు. అప్పుడు ఔటర్ క్షేత్రస్థాయి పరిశీలనలో ఉన్న ‘ఆంధ్రజ్యోతి’.. అతడి ఇబ్బంది తెలుసుకుంది. ఓ మెకానిక్‌తో ఫోన్‌లో సంప్రదించి సమస్యను పరిష్కరించింది. ఎస్‌వోఎస్ కూడా చేతులేత్తేసిన పరిస్థితుల్లో.. ఔటర్‌పై గంటన్నరపైగా ఒక్క పెట్రోలింగ్ వాహనం లేదు. ఇవే కాదు.. టోల్ ప్లాజాల వద్ద తగిన సిబ్బంది లేరు. అత్యంత కీలకమైన నానక్‌రాంగూడ వంటి చాలాచోట్ల ఉదయం, రాత్రిళ్లు వందల మీటర్లకు మించి పెద్దఎత్తున వాహనాలు బారులు తీరుతున్నా.. సజావుగా, వేగంగా వెళ్లేందుకు చర్యలు చేపట్టడం లేదు.