BRS and BJP : బీసీలకు 42% ఇవ్వాల్సిందే
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:41 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ పెంపుపై అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.
స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి
ఎన్నికల కమిషన్ నిర్వహించిన అఖిలపక్ష
సమావేశంలో బీఆర్‌ఎస్, బీజేపీ డిమాండ్
కోటా ఖరారైన వెంటనే ఎన్నికలు పెడతాం: ఈసీ
6న పంచాయతీల్లో ఓటర్ల జాబితా విడుదల
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీఆర్‌ఎస్, బీజేపీలు డిమాండ్ చేశాయి. రిజర్వేషన్ పెంపుపై అధికార పార్టీ అఖిలపక్ష సమావేశాన్ని పెట్టాలని వామపక్షాలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో నిర్వహించాల్సిన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలతో హైదరాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని, అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వాటా ఇవ్వాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, ఈ మేరకు కామారెడ్డి డిక్లరేషన్‌లో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని బీజేపీ గుర్తుచేసింది. రిజర్వేషన్ల పెంపు అంశం అసలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా..? లేదా కేంద్రంతో చర్చించాల్సి ఉందా..? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని వామపక్షాలు కోరాయి. సమావేశంలో కాంగ్రెస్ తరఫున పాల్గొన్న టీపీసీసీ ఎన్నికల కమిషన్ నిర్వహణ కమిటీ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ ఈ విషయంలో స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
అయితే దీనితో కులగణన అంశం ముడిపడి ఉన్నందున అన్ని వర్గాల సహకారమూ ఉండాలన్నారు. పంచాయతీ ఎన్నికలు సమయానుగుణంగా జరగకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీంతోపాటు పోలింగ్ స్టేషన్లు కి.మీ. పరిధిలో ఉండేలా చూడాలని.. ఓటర్ల జాబితాను గ్రామపంచాయతీల్లోని వార్డుల వారీగా విభజించే సమయంలో ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు ఒకే వార్డులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని పార్టీలు కమిషన్‌కు సూచించాయి.
కాగా, పార్టీల ప్రతినిధులు అభిప్రాయాలను వెల్లడించిన అనంతరం.. ఎన్నికల కమిషనర్ పార్థసారధి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు లోబడి.. రిజర్వేషన్లు 50శాతానికి మించకుండానే ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఎవరికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేస్తే వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్ ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల అంశాన్ని ఖరారు చేయకముందే.. ఎన్నికల నిర్వహణకు కమిషన్ అఖిలపక్ష సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేసిందని ప్రశ్నించినట్టు తెలిసింది. స్పందించిన కమిషనర్.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ అని.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు తమ కార్యాచరణ ఉంటుందని అన్నారని సమాచారం.
సెప్టెంబరు 21న ఓటర్ల తుది జాబితా.. గ్రామ పంచాయతీల్లో ఓటరు జాబితాల రూపకల్పనకు కసరత్తును ప్రారంభించామని కమిషనర్ చెప్పారు. 2024 ఫిబ్రవరి 8న ప్రచురించిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా ఎటువంటి మార్పులు లేకుండా వార్డుల వారీగా జాబితాను సెప్టెంబరు 6న ప్రకటిస్తామని తెలిపారు. సెప్టెంబరు 7 నుంచి 13 వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. ఆ అభ్యంతరాలను జిల్లా పంచాయతీ అధికారులు 19 వరకు పరిష్కరిస్తారని, అనంతరం సెప్టెంబరు 21న గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని కమిషనర్ తెలిపారు. కాగా, సెప్టెంబరు 9, 10 తేదీల్లో జిల్లా, మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నట్టు కమిషన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Updated Date - Sep 01 , 2024 | 03:41 AM