Central Government: ‘వక్ఫ్’ అపరిమిత అధికారాలకు చెక్!
ABN, Publish Date - Aug 05 , 2024 | 03:56 AM
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది.
ప్రతిదీ తన ఆస్తేనని బోర్డు ఏకపక్షంగా ప్రకటించడం కుదరదు.. ప్రతిపాదిత భూముల తనిఖీ తప్పనిసరి
బోర్డుల్లో మహిళలకూ చోటు
ఆస్తుల పరిరక్షణ బాధ్యత కలెక్టర్లకు
40 సవరణలకు కేంద్ర కేబినెట్ ఓకే
ప్రస్తుత సమావేశాల్లోనే సవరణ బిల్లు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్రం సమాయత్తమైంది. ప్రధానంగా.. కనిపించిన ప్రతి భూమీ, ఆస్తీ తమదేనంటూ నియంత్రణలోకి తీసుకుంటున్న వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయనుంది. మరింత పారదర్శకత కోసం సదరు భూములు/ఆస్తుల విషయంలో కూలంకష తనిఖీలను తప్పనిసరి చేయనుంది. అలాగే వక్ఫ్ బోర్డుల్లో మహిళలకూ తప్పనిసరి చోటు కల్పిస్తూ వక్ఫ్ చట్టంలోని 9,14 సెక్షన్లను సవరించాలని ప్రతిపాదించింది. దాదాపు 40 సవరణలతో కూడిన సవరణ బిల్లును మోదీ కేబినెట్ ఇటీవల ఆమోదించింది.
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే దీనిని ప్రవేశపెట్టనుంది. వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగానికి అరికట్టేందుకు వాటిపై పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని కేంద్రం తన బిల్లులో పేర్కొంది. వక్ఫ్ బోర్డులకు ప్రస్తుతం విస్తృత అధికారాలు ఉన్నాయి. ఏదైనా భూమి/ఆస్తిని తమది ప్రకటించడం ద్వారా పలు వివాదాలకు, అధికార దుర్వినియోగానికి కారణమవుతున్నాయి. ఉదాహరణకు 2022 సెప్టెంబరులో తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం తాలూకా తిరుచెందురై గ్రామం మొత్తంపై తనకే హక్కు ఉందని తమిళనాడు వక్ఫ్ బోర్డు ప్రకటించింది. కావేరీ తీరాన ఉన్న సుప్రసిద్ధ చంద్రశేఖరస్వామి ఆలయం, దాని భూములు కూడా తనవేనని పేర్కొంది. ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు వెళ్లినప్పుడు.. వక్ఫ్ బోర్డు నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలని తిరుచిరాపల్లి జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ స్పష్టం చేశారు.
గ్రామంలోని మొత్తం 480 ఎకరాల భూమి తనదేనని, ఇందులో క్రయవిక్రయాలు జరపాలంటే తన నుంచి ఎన్‌వోసీ తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు సబ్‌రిజిస్ట్రార్‌కు ఇదివరకే సమాచారం పంపింది. దాంతో సదరు సబ్‌రిజిస్ట్రార్ ఆ వ్యక్తికి పై సూచన చేశారు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఊరంతా తనదంటున్న వక్ఫ్ బోర్డు తీరుపై ధ్వజమెత్తారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. దరిమిలా ఓ రెవెన్యూ అధికారి ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనంతరం క్రయవిక్రయాలను ఎప్పటిలాగే కొనసాగించాలని నిర్ణయించారు. ఇలాంటి వివాదాలను అరికట్టేందుకు కేంద్రం చట్ట సవరణలకు ఉపక్రమించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పైగా వక్ఫ్ బోర్డుల్లో తమకు చోటివ్వడం లేదని, చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు చాలాకాలంగా కోరుతున్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఈ సవరణలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఒమన్, సౌదీ అరేబియా, టర్కీ వంటి ముస్లిం దేశాల్లో కూడా ఏ సంస్థకూ భూములు, ఆస్తులపై గుత్తాధిపత్యం లేదని ప్రాథమిక అధ్యయనంలో తేలింది. హరియాణా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ల్లో ఈ ఏడాది అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జమ్మూకశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో కూడా ఎన్నికల సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
సహించేది లేదు: ముస్లిం పర్సనల్ లా బోర్డు
వక్ఫ్ బోర్డుల చట్ట ప్రతిపత్తి, అధికారాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకొన్నా సహించేది లేదని మరోవైపు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు హెచ్చరించింది. వక్ఫ్ చట్టాన్ని సవరించి ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా ఎన్‌డీఏ పక్షాలకు బోర్డు విజ్ఞప్తి చేసింది.
వక్ఫ్ ఆస్తులను లాక్కోవడానికి మోదీ కుట్ర: అసదుద్దీన్
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): వక్ఫ్ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. వక్ఫ్‌బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్ఛకువిఘాతం కలిగించేలా వక్ఫ్ చట్టంలో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు. ఆదివారం ఆయన మజ్లిస్ ప్రధాన కార్యాలయం దారుల్‌సలాంలో విలేకరులతో మాట్లాడారు.
వక్ఫ్ ఆస్తులపై పరిపాలనాపరంగా వివాదాలను సృష్టించి, ఆ సమస్యకు పరిష్కారం పేరిట వక్ఫ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. వక్ఫ్ చట్టానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణలను పరిశీలిస్తే ఆరెస్సెస్ హిందూత్వ ఎజెండాను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. వక్ఫ్ ఆస్తులపై వివాదాలుంటే ఆ సమస్యకు పరిష్కారం న్యాయవ్యవస్థ పరిధిలో ఉంటుందని అసదుద్దీన్ పేర్కొన్నారు. కానీ, సమస్యకు పరిష్కారం పేరుతో చట్ట సవరణ చేసి, దర్గాలు, మసీదులను లాక్కునే ప్రయత్నం చేస్తే అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
Updated Date - Aug 05 , 2024 | 03:56 AM