Share News

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ABN , Publish Date - May 08 , 2024 | 03:27 AM

సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్‌లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.

CM Revanth: దేశ భద్రతకే  ముప్పు తెచ్చారు

  • ఫోన్‌ ట్యాపింగ్‌ డేటాతోపాటు కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సమాచారమూ ధ్వంసం

  • ఉగ్రవాదులు, మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు

  • దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోం శాఖ కూడా పట్టించుకోలేదు

  • రిటైర్డ్‌ అధికారులను కేసీఆర్‌ నియమించారు.. సంబంధం లేదంటే కుదరదు

  • లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం శూన్యం.. ఆ పార్టీకి సీట్లూ రావు

  • పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్‌ బస్సు యాత్ర

  • కేసీఆర్‌ టికెట్లు ఇచ్చిన తర్వాత.. ఆరుగురు అభ్యర్థులు నన్ను కలిశారు

  • కేసీఆర్‌ పదేళ్లలో సాధించని వాటిని నేను వంద రోజుల పాలనలో సాధించా

  • రాజకీయ పోస్టు పెడితే కేంద్ర హోం శాఖ ఫిర్యాదు చేయడం ఏమిటి!?

  • ఎవరో పోస్టు పెడితే.. ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏమిటి!?

  • ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడే.. కేసీఆర్‌ మాట్లాడరేం!?

  • ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు

  • ఈ ఫైనల్స్‌లోనూ మేమే విజయం సాధిస్తాం.. చాంపియన్లుగా నిలుస్తాం

  • ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ ఆర్కే నిర్వహించిన బిగ్‌ డిబేట్‌లో సీఎం రేవంత్‌

కేసీఆర్‌ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు. ప్రజల్లో కేసీఆర్‌ పట్ల సానుభూతి కనిపించడం లేదు. ఆయన కూడా తనకు శాస్తి జరిగింది అనుకోవడం లేదు. ఇంకా ఓటమిని ఆమోదించడం లేదు. బీఆర్‌ఎస్‌ ఓటమిని ప్రజలు చేసిన తప్పుగా మాట్లాడుతున్నారు. టీవీల్లో కూర్చుని.. తెలంగాణ ప్రజలు తప్పు చేశారని నేరుగా అంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉన్న వాళ్లకు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్లకు లేదని అంటున్నారు. ఆంధ్రా వాళ్లు మంచోళ్లు.. మాకు ఓటేశారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ కింద తనను గెలిపిస్తాడని భావించారు. ఇప్పటికీ ఆయనకు బుద్ధి రాలేదు. ఈ ఎన్నికల్లో డొక్కలో వేసి గుద్దితే కానీ చక్కగ కాడని ప్రజలు భావిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ జమ చేసిన దానిని అక్కడా ఇక్కడా దాచుకున్నాడు. ఇప్పుడు వాళ్లు పలుకుత లేరు. రేవంత్‌ ఇవ్వొద్దన్నాడంటూ దుర్మార్గులు నా పేరు చెబుతున్నారు. వాళ్లు ఎవరూ కూడా కేసీఆర్‌కు పైసా వాపస్‌ ఇచ్చేలా లేరు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అయినట్లే. అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్‌దీ అదే పరిస్థితి. చింతమడకలో మిగిలిందే మిగులుతుంది.

  • సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): ‘‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మర్నాడు ఎస్‌ఐబీలోని అధికారులు అక్కడి సర్వర్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లను రంపంతో కట్‌ చేశారు. వాటిలో ఫోన్‌ ట్యాపింగ్‌ సమాచారంతోపాటు 40 ఏళ్లుగా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ కోసం సేకరించిన సమాచారం కూడా ఉంది. అంటే, ఉగ్రవాదులు, మావోయిస్టులు, అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేసేశారు.

ఉగ్రవాదులు, మావోయిస్టుల కదలికలకు సంబంధించిన వివరాలను మూసీలో పడేశారు. ఐఎ్‌సఐ కార్యకలాపాలు, ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఏళ్ల తరబడి రూపొందించిన సమాచారమంతా ఇప్పుడు లేదు. తద్వారా, దేశ భద్రతకే ముప్పు తెచ్చారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.


ఇంత తీవ్రమైన అంశంపై విచారణ చేయాల్సిన కేంద్ర హోం శాఖ పట్టించుకోకుండా వదిలేసిందని తప్పుబట్టారు. రాజకీయ ఆరోపణలపై కేసులు కట్టి అరెస్టు చేస్తామంటూ ఢిల్లీ పోలీసులను తెలంగాణకు పంపిందని, ఇది తెలంగాణ సార్వభౌమాధికారంపై దాడి అని స్పష్టం చేశారు. ఈ పరిణామాన్ని కేసీఆర్‌ ఖండించాల్సి ఉన్నా ఆయన ఆ పని చేయలేదని తప్పుబట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభావం ఏమీ లేదని, పోటీ కేవలం ఇండియా, ఎన్డీయే కూటముల మధ్యనేనని తెలిపారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఇంకా కోపం తగ్గలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో తగిన శాస్తి చేసినా ఇంకా మారలేదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని చెప్పారు. పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించడంతోనే బస్సు యాత్ర మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నిర్వహించిన బిగ్‌ డిబేట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తుది దశకు వచ్చిన నేపథ్యంలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆ వివరాలు..

ఆర్కే: ఐదు నెలలు అయిపోయింది. మామూలుగా అయితే ఆరు నెలలపాటు సెలబ్రేషన్స్‌ ఉంటాయి. కేసీఆర్‌ చేసిన పనితో ఐదు నెలలకే ఎన్నికలు రావడం చాలెంజ్‌ అయింది కదా. దీనిని ఎలా చేరదాం అనుకుంటున్నారు!?

ముఖ్యమంత్రి: డిసెంబరులో జరిగిన ఎన్నికలు సెమీ పైనల్స్‌. ఈ ఎన్నికలు మాకు ఫైనల్స్‌. వీటిలో గెలిస్తేనే చాంపియన్‌షి్‌ప కొట్టినట్లు. ప్రభుత్వ వంద రోజుల పాలనను దీనికి రెఫరెండంగా పెట్టుకున్నాం. ఎండలు మండిపోతున్నా.. పొయ్యిలో వేసి కాల్చినట్లు ఉన్నా ప్రచారం చేయక తప్పని పరిస్థితి. అనుకూలమైన వాతావరణం ఉంది. చాంపియన్లుగా నిలుస్తాం.


మూడు పార్టీల మధ్య చాలెంజింగ్‌. అందరికీ జీవన్మరణ సమస్య. ఏదో ఒక పార్టీ లేచిపోవాలి. ఎవరిని ఎవరు లేపుతున్నారు?

ఫ్రాంక్‌గా మాట్లాడితే.. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు రోల్‌ ఏమీ లేదు. చెప్పుకోవడానికీ ఏమీ లేదు. ఇండియా, ఎన్డీయే కూటములు కాకుండా మిగిలిన వారిది ప్రేక్షక పాత్రే. ముక్కోణ పోటీ ఉందని ఒకవేళ అనుకున్నా.. బూత్‌లోకి వెళ్లిన తర్వాత జరిగేది ముఖాముఖి ఎన్నికే. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాకలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఓటింగ్‌ పోలరైజ్‌ అయింది. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ కనిపించకుండాపోయింది. మునుగోడులోనూ అదే పరిస్థితి. నాగార్జున సాగర్‌, హుజూర్‌నగర్‌లలో బీజేపీ లేచిపోయి మేం మిగిలాం. అంటే ఈ ఎన్నికల్లో పోటీ ముక్కోణం అనిపించినా.. చివరికి పోలింగ్‌ ఇద్దరి మధ్యనే జరుగుతుంది.

రెండు కూటములకు మెజారిటీ రాదు. నేను చక్రం తిప్పుతానని కేసీఆర్‌ అనుకుంటున్నారు. చక్రం రెడీ చేసుకున్నారు. అలాంటి అవకాశం ఉందా..?

ఏమైనా సీట్లు వస్తే ఆయన గురించి చర్చించుకోవాలి. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. మూడు, నాలుగు సీట్లలో రెండో స్థానంలో ఉన్నాడు. మిగిలినచోట్ల మూడో స్థానమే. ఆయన ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా బీఆర్‌ఎ్‌సకు సీట్లు రావు. ఎన్నికల్లో అణా పైసా కూడా ఖర్చు చేయట్లేదు. ఖర్చులకు కూడా అభ్యర్థులనే పెట్టుకోమంటున్నారు. దాంతో, పదేళ్లపాటు వేల కోట్లు వెనకేసుకుని, ఖర్చులు చేయకుండా ఇప్పుడు తమను ఖర్చు చేయమనడం ఏమిటని అభ్యర్థులు మండిపడుతున్నారు. వాస్తవంగా, ఆరుగురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు నన్ను కలిశారు.

నామినేషన్లు వాపస్‌ తీసుకుంటాం.. మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అన్నారు. నేను అవసరం లేదన్నాను. అందుకే బీఆర్‌ఎస్‌ 17 చోట్ల పోటీ చేస్తోంది. లేకపోతే, అక్కడ కూడా అభ్యర్థులు ఉండేవాళ్లు కాదు. చివరికి, విత్‌ డ్రా సమయంలో కూడా నామినేషన్లు ఉపసంహరించుకుంటామని అన్నారు. కేసీఆర్‌ ఎంత లూజ్‌గా ఈ ఎన్నికలు చేస్తున్నారనే దానికి ఇదొక ఉదాహరణ. ఆయన బీఫాం ఇచ్చిన వాళ్లు కూడా అంతా అయ్యాక ఉపసంహరించుకుంటామనే పరిస్థితి వచ్చిందంటే రాజకీయంగా కేసీఆర్‌ విఫలమైనట్లే. ఆయన తప్పిదాలకు పాల్పడుతున్నాడా.. అహంకారంతో వ్యవహరిస్తున్నాడా.. తన ఇష్టారాజ్యంగా ఉంటే ఉండండి పోతే పోండి అనుకుంటున్నారో నాకు అంచనాకు రాలేదు. కానీ.. ఆయన తీరు మాత్రం ఆ పార్టీ మనుగడకు ఉపయోగపడేది కాదు.


సానుభూతి లేకున్నా ఎందుకో కొంత బీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో ఆదరణ పెరిగిందనే అభిప్రాయం వస్తోంది. తద్వారా, మొన్నటి వరకూ ఊపు మీద ఉన్న బీజేపీపై కొంత ప్రభావం పడుతోందని అంటున్నారు. నిజమేనా!?

అవకాశం ఉంది సార్‌.. బీఆర్‌ఎస్‌ పడుకుంటే కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతతో కాంగ్రెసేతర ఓటర్లు బీజేపీకి వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది గమనించే.. రాజకీయంగా అనుకూల పరిస్థితి లేకపోయినా మొత్తానికే తుడిచిపెట్టుకపోయే పరిస్థితి ఉంటుందనే భయంతో యాత్ర మొదలు పెట్టాడు. పార్లమెంట్‌ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఓటు బ్యాంకును కాపాడుకోకపోతే రేపు పార్టీ ఉనికే ఉండదని కేసీఆర్‌ గ్రహించారు. గ్రామాల్లో వదులుకుంటే రేపు పార్టీ ఉండదనే వాస్తవాన్ని గుర్తించారు. బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి వలస పోయే ఓట్లను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా, ఉన్న ఓటును నిలుపుకోవచ్చు. కొంత పెంచుకోవచ్చు. ఉన్న ఓట్లలో బీఆర్‌ఎస్‌ నుంచి వంద ఓట్లు బయటికి పోతుంటే.. 20నో 30నో మాకు వస్తే మిగిలిన 70 ఓట్లు బీజేపీకి పోతాయి. ఆ పార్టీ మనుగడ సాగిస్తుందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది.

కేసీఆర్‌ ఆత్మ విశ్వాసం పెరిగింది. నేను బస్సు ఎక్కితే కానీ రైతు బంఽధు వేయలేదని చెబుతున్నాడు.

2018 వానాకాలానికి మేలో రైతు బంధు డబ్బులు వేయడం మొదలుపెట్టి సెప్టెంబరులో పూర్తి చేశాడు. 2019-20లో జూన్‌లో మొదలుపెట్టి డిసెంబరు వరకు వేశాడు. 2020-21లో జనవరిలో మొదలుపెట్టి అక్టోబరు వరకు వేశారు. మేం డిసెంబరులో మొదలుపెట్టి మే 7వ తేదీకి వంద శాతం పూర్తి చేశాం. మార్చి 31న ఆర్థిక సంవత్సరం ముగింపు కాగానే కేసీఆర్‌ చేసిన అప్పులకు రూ.27 వేల కోట్లు కట్టాల్సి వచ్చింది. ఈ ఐదు నెలల్లో కేసీఆర్‌ చేసిన అప్పులకు మిత్తి కింద రూ.30 వేల కోట్లు కట్టా.


కానీ, ఎన్నికలయ్యాక మీరు బీజేపీలో చేరతారని ఎందుకు మాట్లాడుతున్నారు!?

నన్ను అనడానికి కేసీఆర్‌కు ఏమీ దొరకలేదు. వంద రోజుల్లో పాస్‌ మార్కులతో పని చేశానని సమాజం ఆమోదించింది. నిజానికి, పార్టీ బలంగా ఉన్నప్పుడు నన్ను రమ్మంటేనే నేను వెళ్లలేదు. నేను తెలుగుదేశాన్ని వదిలిన రోజుల్లో ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి. నిజంగానే ఏదో ఒకటి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు నన్ను అకామిడేట్‌ చేయగలిగేవాడు. అయినా నేను ఆశించలేదు. కాంగ్రె్‌సలో చేరా. కష్టపడ్డా.. పైకి వచ్చా.. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం తక్కువుందని బీజేపీలోకి వెళతాను? కేంద్ర హోం శాఖ నాపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులను పంపించి.. ముఖ్యమంత్రిని పిలిపించే స్థితికి వచ్చింది. తెలంగాణ సార్వభౌమాధికారం మీదనే కేంద్రం దాడి చేస్తోంది. దీనిని కేసీఆర్‌ ఎందుకు ఖండించడం లేదు? ఇది రేవంత్‌ రెడ్డి సమస్య కాదు. నోటీసు ఇచ్చింది తెలంగాణ సీఎంకు. ఫిర్యాదుదారుడు ఢిల్లీలో హోం శాఖకు సంబంధించిన వారు.. ఇవాళ వంద, 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణలో అన్ని జిల్లాలకు పోయి వ్యవస్థల మీద రాత్రిపూట దాడి చేస్తున్నారు. నన్ను వస్తావా రావా అని కూర్చున్నారు. నేను కుదరదని చెప్పా.

ఎప్పుడు అడిగారు దిల్లీ రమ్మని.. అరెస్టు చేస్తామన్నారా..?

మన లాయరు పోతే దురుసుగా ప్రవర్తించారు. అరెస్టు పదం వాడలేదు కానీ ఎలా రప్పించాలో మాకు తెలుసు అని అన్నారు. ఇంతకు ముందు ఒకాయన ఇలాగే చేశాడు. ఫలితం చూస్తున్నాడు. మీరూ అదే ఫార్ములా ఫాలో అవుతామంటే చూద్దాం అనుకున్నా. ఎన్నికలయ్యాక ఢిల్లీ వెళతా. ఎందుకు పిలిచారని పోలీసు స్టేషన్‌కు వెళతా. ఏమవుతుంది. ఉరేస్తారా!? ఎవరో సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక పోస్టుకు సీఎంపై కేసు పెడతారా!? అది కూడా దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం తీసుకొస్తున్నామని కేసు పెట్టారు. ఇదే అంశంపై అసోంలో అరెస్టులు చేశారు. ఢిల్లీలో అరెస్టు చేశారు. ఆ వీడియో ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు. ఓ రాజకీయ నాయకుడిపై ఇంకో పార్టీ నాయకుడు పోస్టు పెడితే రాజకీయ పార్టీ ఫిర్యాదు చేయాలి. కానీ, కేంద్ర హోం శాఖ ఎందుకు ఫిర్యాదు చేయాలి? హోం శాఖకు, రాజకీయ పోస్టుకు ఏమిటి సంబంధం!? హిందువుల ఆస్తులు గుంజుకుని ముస్లిములకు పంచి పెడతారని, హిందూ మహిళల తాళి బొట్లను గుంజుకుని ముస్లిములకు పంచి పెడతారని మోదీ అన్నారు. ఇది రెండు మతాల మధ్య వైషమ్యాలను సృష్టించడం కాదా!? దీనికంటే రిజర్వేషన్లు రద్దు చేస్తామనేది పెద్ద ఆరోపణా..?

అమిత్‌ షా మీద మీరూ కేసు పెట్టారు కదా!?

అమిత్‌ షా మీద మేం కేసు పెట్టలేదు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెట్టారు. రాజకీయ పార్టీగా, రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేయదలుచుకోలేదు. బాధ్యతతో ప్రభుత్వం నడపాలనేది నా విధానం. హోం శాఖ కేసు పెట్టి విచారణ అంటే ఇది తెలంగాణ మీద దాడే కదా.. దీనిపై కేసీఆర్‌ మాట్లాడాలి కదా. ఇదేం పద్ధతి అని ప్రశ్నించాలి కదా. ఓట్లు కావాలంటే మాట్లాడతాడు. ఇవి మాత్రంమాట్లాడడు.

మోదీ, అమిత్‌ షాలతో పెట్టుకోవాలంటే అంతా గజగజ వణికిపోతున్నారు. ముఖ్యమంత్రులనూ జైల్లో పెట్టారు కదా!

నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చా. స్వాతంత్ర్యానికి ముందు రాజులు ఉన్నప్పుడు, బ్రిటిషర్ల హయాంలో కూడా ప్రజలు తిరుగుబాట్లు చేశారు. సమస్యలు వస్తాయని ఇంట్లోనే ఉండలేం.

కేసులు పెట్టి.. జైల్లో వేసి కేసీఆర్‌ మిమ్మల్ని సీఎంను చేశారు. వాళ్లు జాతీయ నాయకుడిని చేస్తారేమో..

కేసీఆర్‌, మోదీ, అమిత్‌ షాలాంటి వారు ఇలాగే వ్యవహరిస్తే చాలా ప్రమాదం. మాలాంటి వారు కూడా మౌనంగా ఉంటే సమాజానికి ప్రమాదం. శక్తిమంతులమని భావిస్తే ప్రకృతి చూసుకుంటుంది. మేం అన్నింటికీ అతీతులమని అనుకుంటే పరిష్కారం చూపుతుంది. నా అంచనా ప్రకారం.. ఈసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవడం లేదు.

ఎన్డీయే కూడా అధికారంలోకి రాదా..?

ఎన్డీయేలో ఎవరు అవుతారో చెప్పలేను. అంతా కలిసి డిమాండ్‌ పెట్టవచ్చు. ఒక్కరు కూడా ఎన్డీయేలో ఉండకపోవచ్చు. ఇంత నిర్బంధాన్ని, నియంతృత్వాన్ని ఏ రాజకీయ పార్టీ, వ్యక్తి కోరుకోడు. ప్రకృతి తన పని తాను చేస్తుందేమో అని అనుకుంటున్నా. ఇప్పటికే మొదలైందని అనుకుంటున్నా. బీఆర్‌ఎస్‌ వాళ్లే కాకుండా బీజేపీ వాళ్లు కూడా పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కాంగ్రె్‌సలో అంతర్గత పోరు వస్తుందని అంటున్నారు. కేసీఆర్‌ నమ్మకం కూడా ఏమిటంటే.. జగన్‌ ఏదో ప్రామిస్‌ చేశారంట. మంత్రులను మేనేజ్‌ చేసి.. రేవంత్‌ను దించి కేసీఆర్‌ను సీఎం చేస్తానని చెప్పినట్లు ఉన్నారు.. అది నమ్ముకుని మాట్లాడుతున్నాడని వాళ్లలో వాళ్లు చెప్పుకుంటున్నారు.

నా దగ్గర 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరే సీఎం అవుతారు. నేను అయ్యా.. నేను కాకపోతే ఇంకో వ్యక్తి అవ్వాలి.. మా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఎవరితో కంఫర్ట్‌ ఉంటుందో ఎమ్మెల్యేలు తేల్చుకుంటారు కదా. నేను మంత్రుల శాఖల్లో జోక్యం చేసుకోను. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాను. వారి శాఖలను నేను సమీక్ష చేయడం లేదు. అందరం కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. నేను యుద్ధం చేసేటప్పుడు టార్గెట్‌ చేసి యుద్ధం చేస్తా. నేను వార్‌జోన్‌లో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా వినను. గదిలో ఉన్న సమయంలో ఏం చెప్పినా వింటా. ఎవరు ఎన్ని అన్నా 65 సీట్లు తెచ్చి ఫలితం చూపాం కదా.


జూన్‌ 4 తర్వాత రాజకీయంగా,ప్రభుత్వపరంగా రేవంత్‌ను సమర్థమైన,బలమైన నాయకుడిగా చూడొచ్చా!?

వంద శాతం చూడవచ్చు. రాజకీయంగా నన్ను లక్ష్యం చేసుకుని మాట్లాడేటప్పుడు నేనూ టెంపర్‌ చూపాలి. కౌంటర్‌ చేయాలి. ఎన్నికలు చేయాలి కదా..

రాష్ట్రంలో మాదిగల సంఖ్య ఎక్కువ.. కానీ నాయకులు మాలలే ఉన్నారు!!

మాదిగల విషయంలో వాళ్ల వాదనను తప్పు పట్టడం లేదు. వివేక్‌ వెంకటస్వామి కుటుంబం, మల్లు అనంతరాము కుటుంబం 50 ఏళ్ల నుంచి కాంగ్రెస్‌ కుటుంబాలు. మాదిగల్లో నాయకత్వ సమస్య వచ్చింది. దానిని సరిదిద్దడానికి సిరిసిల్ల రాజయ్యను చైర్మన్‌ చేశా, సంపత్‌కుమార్‌కు, దామోదర్‌ రాజనర్సింహకు అవకాశం ఇచ్చాం. పాల్వాయి రజినీకుమారిని టీఎ్‌సపీఎస్సీ మెంబర్‌గా వేశాం. సర్వే సత్యనారాయణ కుమార్తెను సీఎంవో ముఖ్య కార్యదర్శిగా వేశాం. చాలా నామినేటెడ్‌ పోస్టుల్లో మాదిగలకు ఐదారు పోస్టులు వేశాం. ఇవి వారిని సంతోష పెట్టలేదు. ఎమ్మెల్సీలు ఉన్నాయి. రాజ్యసభ ఉంది. భవిష్యత్తులో పార్టీ నుంచి చేయగలిగినవి చేస్తాం. మంద కృష్ణ మాదిగా ఇప్పుడు ఎమ్మార్పీఎస్‌ లీడర్‌ కాదు. ఆయన బీజేపీ లీడర్‌. బీజేపీ కోసం పని చేస్తున్నారు.


రైతు రుణమాఫీ పెద్ద సవాలు.. ఆగస్టు 15 అన్నారు.. రాజీనామాకు హరీశ్‌ సిద్ధమన్నారు. సాధ్యమేనా..?

సాధ్యమే సార్‌.. 9వ తేదీలోపు రైతుబంధు వేస్తా అన్నా.. 6వ తేదీలోపే వేశాం.. నేను సాధ్యాసాధ్యాలు చూసుకుని పని చేస్తా. ఆగస్టు 15 లోపల చేసి తీరుతాం. రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండాలి కాబట్టి.. హరీశ్‌ చూసుకుని మాట్లాడాలి.. నేను ఆయన మామలా కాదు కదా.. జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.

సీఎం అయినా రేవంత్‌ భాష మారలేదని కేసీఆర్‌ అంటున్నారు

కేసీఆర్‌ చాలా అన్నాడు. అందుకే నేను తిరగబడి మాట్లాడుతున్నా. తెలంగాణలో ఇలాంటి భాషా ప్రయోగానికి కేసీఆరే పితామహుడు. నేను మాట్లాడతా.. నన్ను అనొద్దు అంటే నా దగ్గర కుదరదు. చిల్లర వేషాలు, చిల్లర మాటలు మాట్లాడితే సహించను.

కేసీఆర్‌ ఏమో నేనే మళ్లీ సీఎం అవుతానని అనుకుంటున్నారు?

తొలి నుంచీ ఆయన ఇలాంటి నమ్మకాలతోనే ఉన్నాడు. జ్యోతిషంతోపాటు తన దగ్గర ఉన్న వాళ్లను నమ్ముతారు. తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయి. నా దగ్గర 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేసీఆర్‌ చేసిన తప్పిదాలపై ఇంకా పని మొదలు పెట్టలేదు. ఆయన అది కూడా మరచిపోతున్నాడు. మేం అనుకుంటే ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలి.


ఇంకా మొదలు పెట్టలేదా.? ఫోన్‌ ట్యాపింగ్‌ మొదలు పెట్టారు కదా..!

నిజానికి పదవీ విరమణ చేసిన వారికి పదోన్నతులు ఇచ్చి ట్యాపింగ్‌ పనిని కేసీఆర్‌ వారికి అప్పగించారు. ఇప్పుడు నాకేం సంబంధం లేదంటే కుదరదు. ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. నిజానికి, డిసెంబరు 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 4న అక్కడి అధికారులు సర్వర్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లను రంపంతో కట్‌ చేశారు. కొన్ని తగలబెట్టారు. కొన్ని మూసీలో పడేశారు. ఈ క్రమంలో 40 ఏళ్లుగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సంబంధించి సేకరించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు. కొత్త అధికారులు వచ్చిన తర్వాత పరిశీలిస్తే.. కంప్యూటర్లు, ల్యాప్‌టా్‌పలు, హార్డ్‌ డిస్క్‌లు మిస్సయ్యాయి. దాంతో, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తొలుత పంజాగుట్ట పోలీసు స్టేషన్లో కేసు పెట్టారు. వాటిని ఎందుకు మాయం చేశారని ఆరా తీస్తే.. ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చాలా మంది అనుకున్నట్లు రేవంత్‌ రాగానే ట్యాపింగ్‌పై విచారణ ప్రారంభించారనేది వాస్తవం కాదు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో దీనిపై లోతుగా మాట్లాడతా.


తెలంగాణలో ఇప్పుడు ఫోన్‌ ట్యాపింగ్‌ లేదని చెప్పగలరా..?

పొలిటికల్‌ ట్యాపింగ్‌ లేదని వంద శాతం కచ్చితంగా చెప్పగలను. రాజకీయ నాయకులు స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను.

గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కొంత అసంతృప్తి ఉందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఉందని నమ్ముతున్నారా..?

అందులో నిజం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.50 శాతం ఓటింగ్‌ వచ్చింది. పార్లమెంట్‌ ఫలితాలు 40 శాతం తక్కువ కాకుండా వస్తుంది. ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం. పింఛను ఇస్తున్నాం. ఆసరా వేశాం. రైతు బంధు పూర్తి చేశాం. 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. రూ.500కే సిలిండర్లు ఇచ్చాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇచ్చాం. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాం. బీసీ జనగణనకు ఆదేశాలు ఇచ్చాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇక అసంతృప్తికి తావు ఎక్కడిది!? పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్‌ అనే వాసన లేకుండా తొక్కి పడేశా. దేశానికి సరిపోయే గంజాయి ఏవోబీ నుంచే వస్తోంది. కాలేజీ యాజమాన్యాలను పిలిపించి మాట్లాడా. బార్లు, పబ్‌లలో కౌన్సెలింగ్‌ చేయించాం. సందీప్‌ శాండిల్య రూ.40 కోట్లు కావాలంటే రూ.50 కోట్లు ఇచ్చా. అధికారులను ఇచ్చా. నా మార్కు ఉండేలా దీన్ని తయారు చేస్తా.. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ తరహాలో దేశంలో డ్రగ్స్‌ ఏ మూలన ఉన్నా.. తెలంగాణ యంత్రాంగం పసిగట్టుద్ది అనేలా తయారు చేస్తా.


మొన్న నా షోలో మీ మిత్రుడు ఒక సలహా ఇచ్చారు. సీఎంను లోన్లు రీషెడ్యూల్‌ చేయించమనండి..అప్పుడే తెలంగాణ బతుకుతుందని..

దీనిపై తొలిసారి ప్రధాన మంత్రిని కలిసినప్పుడే నేను ఒక ప్రతిపాదన ఇచ్చాను. నిర్మలా సీతారామన్‌ కేంద్ర, రాష్ట్ర అధికారులను, బ్యాంకర్లను పిలిపించి మాట్లాడారు. కేసీఆర్‌ 9 నుంచి 12 శాతం వరకూ మిత్తి మీద అప్పులు తెచ్చాడు. నిజానికి, 4 శాతం మిత్తికే ఇచ్చే సంస్థలు కోకొల్లలు ఉన్నాయి. మేం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామరాజన్‌ను కలిసి ఆర్థిక సలహాదారుగా పెట్టుకోవాలని ఆయనతో చర్చించాం. ఆయన హైదరాబాద్‌ వచ్చి మాతో చర్చించారు. ‘‘రుణాలు రీ షెడ్యూల్‌ చేసుకో. దుబారా తగ్గించుకో. దీనివల్ల 10-12 శాతం ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగే దాన్ని ప్లాన్‌ చేసుకుంటే మీ సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు’’ అని సూచించారు. మేం కూడా ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి అప్పులపై ఎలాంటి పరిష్కారం కావాలనే దానిపై చర్చించాం.


ఎన్నికల ప్రక్రియకు ముందు మీరు మోదీని పెద్దన్న అన్నారు. ఇప్పుడు విమర్శించుకోవడంలో ఇద్దరూ పోటీ పడుతున్నారు. రీ షెడ్యూల్‌కు కేంద్రం ఒప్పుకుంటుందా..?

నా వంద రోజుల పాలనలో పదేళ్లలో కేసీఆర్‌ సాధించలేనివి నేను సాధించా. కంటోన్మెంట్‌లో 194 ఎకరాల భూమి బదలాయించారు. రాష్ట్రంలో నేవీ రాడార్‌ వంటి సమస్యలు తక్షణమే పరిష్కరించాం. కేసీఆర్‌ అహంకారంతో వ్యవహరించాడు. కానీ, వంద రోజుల పాలనలో నాకు కేంద్రం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాలేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాన మంత్రిగా ఆయన గౌరవానికి ఇబ్బంది లేకుండా వ్యవహరించా. ఎన్నికలు వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడిని. బీజేపీ వాళ్లు నేరుగా మోదీ పేరుతోనే ఓట్లు అడుగుతున్నారు. నేను ఆయనతోనే కొట్లాడాలి కదా!?

చివరికి, రేవంత్‌ రెడ్డికి హ్యాపీ మ్యారేజ్‌ డే చెబుతూ బిగ్‌ డిబేట్‌ను ఆర్కే ముగించారు...

Updated Date - May 08 , 2024 | 11:01 AM