CM Revanth Reddy: ఆక్రమణల వల్లే ఖమ్మంకు ఈ పరిస్థితి.. కేసీఆర్ ఫ్యామిలీ 2వేల కోట్లు ఇవ్వాలని రేవంత్ డిమాండ్
ABN , Publish Date - Sep 03 , 2024 | 02:30 PM
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రెండ్రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు. ఖమ్మంకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? భారీ వరదలకు, ఇంతటి బీభత్సానికి కారణాలేంటి..? అనే దానిపై రివ్యూ చేసిన రేవంత్.. మీడియాతో చిట్ చాట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు..
ఖమ్మం: నిన్న మొన్నటివరకు సుందరీకరణకు మారుపేరుగా ఉన్న ఖమ్మం (Khammam) నగరం ఒక్కరాత్రిలోనే మురికి కూపంగా మారింది. రెండు తెలుగురాష్ట్రాల రాకపోకలకు కేంద్రబిందువుగా ఉన్న జిల్లా కేంద్రం ఒక్కరోజు కురిసిన వర్షానికే జలదిగ్భంధం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ రెండ్రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడుపుతున్నారు. ఖమ్మంకు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది..? భారీ వరదలకు, ఇంతటి బీభత్సానికి కారణాలేంటి..? అనే దానిపై రివ్యూ చేసిన రేవంత్.. మీడియాతో చిట్ చాట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయని సీఎం స్పష్టం చేశారు. ఆక్రమించిన స్థలంలోనే మాజీ మంత్రి పువ్వాడ ఆస్పత్రి కట్టారన్నారు. పువ్వాడ ఆక్రమణలపై హరీష్‌రావు స్పందించాలన్నారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 42 సెం.మీ వర్షం పడిందన్నారు. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు ఇంకా పెంచొచ్చా..? పెంపునకు ఛాన్స్ ఉందా..? అనే దానిపై ఇంజనీర్లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ముందు చూపు వల్లే ప్రాణ నష్టం తగ్గిందని మీడియాకు వెల్లడించారు. నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి వాటిని తొలగిస్తామని చెప్పుకొచ్చారు.
తేల్చుకుందాం రా..
ఖమ్మంలో ఆక్రమణాలపై బీఆర్ఎస్‌కు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ‘ఖమ్మంలో ఎవరి అక్రమాలేంటో తేల్చేద్దాం.. రావాలంటూ హరీశ్‌కు సీఎం సవాల్ విసిరారు. కేటీఆర్ విదేశాల్లో ఉండి ఏదేదో మాట్లాడుతున్నారు. కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్ల రూపాయల డబ్బులున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2వేల కోట్లు ఇవ్వాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సవాల్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధైర్యం చెప్పకుండా బీఆర్ఎస్‌పై నిందలు వేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కాల్వ తెగిపోయింది. ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం, రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ఎకరాకు రూ.50వేల పంట నష్టపరిహారం అందించాలి’ అని హరీష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
నేను విన్నాను.. నేనున్నాను..
ఇదిలా ఉంటే ఖమ్మం నగరం నుంచి గంగారంతండాకు సీఎం రేవంత్ బయల్దేరి వెళ్లారు. తండ్రికుమార్తె వరదల్లో కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రేవంత్.. ప్రకృతి ప్రకోపం చూపించిందన్నారు. ఖమ్మంకు ఈ పరిస్థితి రావడం అత్యంత దురదృష్టమన్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొంత మేర ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందన్నారు.
అన్నీ చూసుకుంటాం..
‘సీతారాంనాయక్ తండా సహా మూడు తండాలను ఒకే దగ్గర నిర్మాణం చేసేలా ఒక గ్రామ పంచాయితీగా రూపొందించేలా కలెక్టర్ ప్రభుత్వ స్థలం పరిశీలించి ప్రభుత్వానికి పరిశీలనకు పంపించండి. ఈ మూడు తండాల వాసులకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణం చేసిన మంచి కాలని నిర్మాణం చేసేలా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేస్తున్నాం. ముంపునకు గురైన, నష్టపోయిన వారికి 10 రోజుల పాటు నిత్యావసర వస్తులు కలెక్టర్ ద్వారా అందిస్తాం. వర్షంతో సర్టిఫికెట్లు కానీ ఇతరత్రా గుర్తింపు కార్డులు కోల్పోయిన వారికి కలెక్టర్ లిస్ట్‌ను తయారు చేసి ఎఫ్ఐఆర్ తయారుచేస్తారు. వారికి కావాల్సిన సర్టిఫికెట్లను జారీ చేస్తారు. కొట్టుకపోయిన రోడ్లను పరిశీలించాం.. మరొకసారి ఇలాంటి సంఘటన జరగకుండా శాశ్వత పరిష్కారాలు చూపించేలాగా నేషనల్ హైవేతోపాటు రాష్ట్ర ఆర్ అండ్ బి అధికారులకు సూచనలు చేస్తాం. ఆకేరు వాగు పొంగి కట్ అయిపోయిన బ్రిడ్జి దగ్గర తాత్కాలిక పనులు కాకుండా శాశ్వత పరిష్కారంగా.. మరోసారి డామేజ్ లేకుండా జరగకుండా శాశ్వత పరిష్కారం చూపేలాగా పనులు చేపట్టాం. వర్షాలతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది’ అని సీఎం రేవంత్ భరోసా ఇచ్చారు.