ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: విపత్తు నిర్వహణ విభాగం ఇక హైడ్రా..

ABN, Publish Date - Jul 02 , 2024 | 03:12 AM

ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దానికి హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా)గా నామకరణం చేశారు.

  • ఇప్పటిదాకా జీహెచ్‌ఎంసీలో భాగం

  • ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని సీఎం నిర్ణయం

  • అధిపతిగా డీఐజీ స్థాయి పోలీస్‌ అధికారి

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ ఏ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌

  • విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు

  • విధులు, నిధుల ముసాయిదా తయారీకి ఆదేశం

  • జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ ఏ, వాటర్‌ బోర్డు, ట్రాఫిక్‌ విభాగాల నుంచి హైడ్రాలో ప్రత్యేక బృందాలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో భాగంగా ఉన్న విపత్తుల నిర్వహణ విభాగాన్ని ఒక ప్రత్యేక వ్యవస్థగా విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దానికి హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌(హైడ్రా)గా నామకరణం చేశారు. హైడ్రా పరిధిని కూడా అవుటర్‌ రింగ్‌ రోడ్డు లోపలి భాగం మొత్తానికి విస్తరించారు. అంటే, జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్‌ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాలు హైడ్రా పరిధిలోకి వస్తాయి. అంతేకాకుండా డీఐజీ స్థాయి అధికారి హైడ్రాకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఎస్పీ స్థాయి అధికారులు అడిషనల్‌ డైరెక్టర్లుగా ఉంటారు. హైడ్రా కేవలం వరదలో, ఇతర విపత్తులో వచ్చినపుడే రంగంలోకి దిగడం కాకుండా వాటికి కారణం అవుతున్న మూల సమస్యల మీద కూడా దృష్టి సారిస్తుంది. అంటే, చెరువులు, నాలాల ఆక్రమణలపై ఎప్పటికప్పుడు కన్నేసి ఉంచుతుంది.


బ్రాండ్‌ హైదరాబాద్‌ విషయంలో పట్టుదలగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరదలు, ఇతర విపత్తులపై సోమవారం సాయంత్రం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏ, మూసీ అభివృద్ధి సంస్థ అధికారులు ఇందులో పాల్గొన్నారు. హైదరాబాద్‌ భౌగోళిక పరిధి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో విపత్తుల నిర్వహణ విభాగం పరిధిని కనీసం అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. హైడ్రాలో కేవలం ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ మాత్రమే కాకుండా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీ ఏ, వాటర్‌ బోర్డు, సిటీ ట్రాఫిక్‌, తదితర విభాగాల నుంచి ప్రత్యేక బృందాలను నియమించాలని చెప్పారు. హైడ్రాలో సిబ్బంది సంఖ్య, విధులు, నిధుల కేటాయింపు, ఇతర బాధ్యతలపై ముసాయిదా సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. కేవలం వరదలు, ప్రమాదాలప్పుడే కాకుండా 365 రోజులూ ఈ విభాగం పనిచేస్తూ ఉండాలని చెప్పారు. మహానగరంలో ప్రజలు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారంలో ‘హైడ్రా’ క్రియాశీలంగా వ్యవహరించాలని సీఎం స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వ్యవస్థాగత మార్పులతో పాటు, బాధ్యతల పంపిణీ జరగాలని చెప్పారు.


ఆక్రమణలకు అడ్డుకట్ట

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను పరిరక్షించడంతో పాటు నగరంలోని నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడే కీలక బాధ్యతలను హైడ్రా చేపట్టాలని నిర్ణయించారు. హోర్డింగులు, ఫ్లెక్సీల నియంత్రణ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ సరఫరా లైన్లు, డ్రైనేజీలు, వరద నిర్వహణ, ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవహారాలన్నింటిలోనూ ఈ విభాగం సేవలను అందించాలని ముఖ్యమంత్రి చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్‌ హైదరాబాద్‌ సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చేలా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలన్నారు.


చారిత్రాక కట్టడాల పునరుద్ధరణకు చర్యలు

నగరంలోని చారిత్రక ప్రాధాన్య కట్టడాలు, శిథిలమైన నిర్మాణాలను పునరుద్ధరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సిటీ లైబ్రరీ, చార్మినార్‌ సమీపంలోని యునానీ ఆస్పత్రి, నిజామియా అబ్జర్వేరటరీ, గుడిమల్కాపూర్‌ కోనేరులపై జీహెచ్‌ఎంసీ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్లు ప్రదర్శించింది. వాటిని పర్యాటకంగా అభివృద్ధి చే సేందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం సూచించారు. వీటిలో మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో కలిపే అవకాశం ఉన్నవి గుర్తించి, జోడించాలని చెప్పారు.


నేడు శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం సమావేశం!

అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల మీద ఏపీ సీఎం చంద్రబాబుతో 6న భేటీ ఉన్న నేపథ్యంలో మంగళవారం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్‌ సమావేశం కానున్నట్లు తెలిసింది. ఇరు రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఉన్న విభజన సమస్యలు.. వాటి పరిష్కారానికి ఉన్న అవకాశాలు.. ఆ మేరకు చేయాల్సిన ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శులతో రేవంత్‌ చర్చించనున్నట్లు తెలిసింది. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలు శాఖల భూములు, ఆస్తులను కేంద్రం విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోకి చేర్చింది. ఆ భూములు, ఆస్తులపై ఇప్పటికీ ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. వీటిలో హౌసింగ్‌ బోర్డు, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌(దిల్‌) భూములున్నాయి.


దిల్‌కు ఏపీలోని విశాఖపట్నంలోనూ కొంత భూమి ఉంది. దీనిపై మొదటినుంచీ వివాదం నడుస్తోంది. ఇక కృష్టా, గోదావరి నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలున్నాయి. రెండు రాష్ట్రాల విద్యుత్తు బకాయిలు, ఉద్యోగుల బదిలీల సమస్యలూ ఉన్నాయి. పోలవరం బ్యాక్‌ వాటర్‌ విషయంలోనూ పలు సమస్యలున్నాయి. వీటన్నింటినీ ఏపీతో ఎలా పరిష్కరించుకోవాలి? అనే విషయాన్ని రేవంత్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రాచలం దగ్గర ఏపీలోకి వెళ్లిన 5గ్రామాలను వెనక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైనా ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైనా రేవంత్‌ చర్చించనున్నట్లు సమాచారం.

Updated Date - Jul 02 , 2024 | 03:12 AM

Advertising
Advertising