CM Revanth Reddy : కుర్చీ బచావో బడ్జెట్
ABN, Publish Date - Jul 24 , 2024 | 03:22 AM
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు.
కుర్చీ కాపాడుకునేందుకు మోదీ ఏపీ, బిహార్లకు నిధులు ఇచ్చారు
ఇది క్విడ్ ప్రోకో.. ప్రధానికి గౌరవం కాదు
బడ్జెట్‌లో తెలంగాణ పదమే లేదు
తెలంగాణ మీద ఇంతటి కక్ష ఎందుకు?
తెలంగాణ ప్రజలు మీకు 8 సీట్లిచ్చారు
సీట్లు కావాలిగానీ.. అభివృద్ధి వద్దా?
కిషన్‌రెడ్డి మంత్రి పదవికి రిజైన్ చేయాలి
ఇదే వివక్ష కొనసాగిస్తే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయ్
కేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ నిప్పులు
హైదరాబాద్, జూలై 23(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, రాష్ట్రం పట్ల మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరించిందని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివక్షతో వ్యవహరిస్తే ఇక తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించారు. ప్రధానమంత్రి తన కుర్చీని కాపాడుకునేందుకు ఏపీ, బిహార్‌కు మాత్రమే నిధులు కేటాయించారని పేర్కొంటూ.. కేంద్ర బడ్జెట్‌ను ‘కుర్చీబచావో బడ్జెట్’గా అభివర్ణించారు.
ఇది పూర్తిగా క్విడ్‌ప్రోకో విధానంలా ఉందని, ఇలాంటి చర్యలు ప్రధానికి గౌరవాన్ని తెచ్చిపెట్టవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌పై నిప్పులు చెరిగారు. ‘బడ్జెట్ సారాంశాన్ని చూస్తే తెలంగాణ అనే పదాన్ని నిషేధించినట్లు ఉంది. అసలు ఆ పదాన్ని పలకడానికి కూడా కేంద్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రిగా నేను మూడుసార్లు, మంత్రులు 18 సార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని, కేంద్రంలోని మంత్రులను కలిశాం. కేంద్రంతో వివాదాలు లేకుండా సత్సంబంధాలు కొనసాగించాలని, ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సమయంలో పెద్దన్నలా వ్యవహరించాలని కోరాం.
కానీ, ఈ విజ్ఞప్తులను ఏమాత్రం పట్టించుకోలేదు. బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కేంద్రం తెలంగాణ పట్ల కక్షపూరితంగా వ్యవహరించింది. ఇక్కడి ప్రజల మీద వివక్ష ఎందుకు? ఇంతటి కక్షపూరిత వైఖరిని, వివక్షను ఎన్నడూ చూడలేదు’ అని రేవంత్ పేర్కొన్నారు. 10వ బడ్జెట్ సమయంలోమోదీ రాష్ట్ర విభజనపై మాట్లాడుతూ.. తల్లిని చంపి పిల్లను బతికించారని అన్నప్పుడే ఆయనకు తెలంగాణ ఏర్పాటు ఇష్టం లేదని తెలిసినా, ప్రధాని మనసులో తమపై ఇంతటి కక్ష గూడుకట్టుకొని ఉందని తెలంగాణ ప్రజలు అనుకోలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి నిధులు కేటాయించిన కేంద్రం, అదే చట్టం ప్రకారం తెలంగాణకు ఎందుకు నిధులు ఇవ్వలేదని సీఎం ప్రశ్నించారు. ఏపీలో రాజధాని అమరావతికి, పోలవరం ప్రాజెక్టుకు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు చేసినప్పుడు.. తెలంగాణలో విభజన హామీలైన బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు.
ఏపీకి ఎందుకిచ్చారని తాము అడగటం లేదని.. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారన్నదే తమ ఆవేదన అని రేవంత్‌రెడ్డి తెలిపారు. గంగానది ప్రక్షాళనకు, గుజరాత్‌లో సబర్మతి తీరప్రాంత అభివృద్ధికి నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణలో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధికి, రీజినల్ రింగు రోడ్డుకు, హైదరాబాద్ మెట్రోకు, ఐటీఐఆర్ కారిడార్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు.
సబ్ కా వికాస్ బోగస్
రూ.48.21 లక్షల కోట్ల బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణ పట్ల చూపిన వివక్షతో బీజేపీ ప్రచారం చేసుకుంటున్న ‘సబ్ కా వికాస్’ అనేది బోగస్ అని రుజువైందని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని 8 స్థానాల్లో గెలిపించారని, బీజేపీకి ఈ ప్రాంత ఓట్లు, సీట్లు కావాలేగానీ తెలంగాణ అభివృద్ధి పట్టదని దుయ్యబట్టారు. తెలంగాణ బిడ్డగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మోదీ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా.. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నిరసనగా తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.
మూడు రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి ఒక లేఖ వచ్చిందని, తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు వీలు కాదని ఆ లేఖలో తెలిపారన్నారు. ఐఐఎం ఇవ్వబోమని కేంద్రం చెప్పినా.. కిషన్‌రెడ్డి మోదీ క్యాబినెట్‌లో ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టొదన్నారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్‌లో కాంగ్రెస్ నిరసన తెలుపుతుందన్నారు. తెలంగాణపై మోదీ కక్షపూరిత వైఖరిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. విభజన చట్టం కేవలం ఏపీకే కాదని.. తెలంగాణకు కూడా వర్తిస్తుందనీ సీఎం గుర్తు చేశారు. బడ్జెట్‌ను సవరించే సమయంలోనైనా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ఇదే వివక్ష కొనసాగితే తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లినట్లేనన్నారు.
శాసనసభలో తీర్మానం చేస్తాం
కేంద్రం తెలంగాణ పట్ల చూపిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపడతామని, తీర్మానం చేసి తమ నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని సీఎం వెల్లడించారు. ఈ విషయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తాయో,కేంద్రానికి బానిసలుగా ఉంటాయో తేల్చుకోవాలన్నారు. పార్లమెంట్‌లో చేపట్టే నిరసనకు బీజేపీ ఏంపీలు కలిసి రావాలన్నారు. దక్షిణాదిపై కేంద్రం వివక్ష చూపుతోందని, త్వరలోనే దక్షిణాది సీఎంలతో సమావేశం అవుతానని చెప్పారు. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక సీఎంలకు లేఖ రాశానని, ఏపీ, కేరళ, పుదుచ్చేరి సీఎంలు కూడా కలిసి వస్తే మంచిదన్నారు. విలేకర్ల సమావేశంలో మంత్రులు రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, పొంగులేటి పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2024 | 03:22 AM