ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: రాష్ట్రాన్ని అమ్మేశారు!

ABN, Publish Date - Dec 22 , 2024 | 03:52 AM

‘‘ఆరు గ్యారెంటీల్లో ఏదైనా ఒక గ్యారెంటీని అమలు చేయడం ఆలస్యం అవుతోందంటే దానికి కారణం ఆ పాపాత్ములే! ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేటలో భూములు.. ఔటర్‌ రింగు రోడ్డు, హైదరాబాద్‌ భూములు, హైటెక్‌ సిటీ సహా ప్రతిదీ అమ్మేశారు.

ఔటర్‌.. కోకాపేట భూములే కాదు.. వైన్‌ షాపులు కూడా..

  • ఏకంగా 11.50ు మిత్తితో అప్పులు తెచ్చారు

  • హామీల అమలు ఆలస్యానికి ఈ పాపాల భైరవులే కారణం

  • ఇలాంటి వారిని ఉరి తీసినా తప్పు లేదు

  • లక్షల కోట్ల అప్పులు చేసి కట్టింది కూలేశ్వరమే

  • అసెంబ్లీలో బీఆర్‌ఎ్‌సపై ముఖ్యమంత్రి రేవంత్‌ నిప్పులు

హైదరాబాద్‌, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘‘ఆరు గ్యారెంటీల్లో ఏదైనా ఒక గ్యారెంటీని అమలు చేయడం ఆలస్యం అవుతోందంటే దానికి కారణం ఆ పాపాత్ములే! ఈ పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు. కోకాపేటలో భూములు.. ఔటర్‌ రింగు రోడ్డు, హైదరాబాద్‌ భూములు, హైటెక్‌ సిటీ సహా ప్రతిదీ అమ్మేశారు. వైన్‌ షాపులను ఆరు నెలలు ముందుగానే అమ్మేశారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకునేటప్పుడు మిత్తిని కాస్త తగ్గించాలని అడుగుతుంటాం. కానీ.. వీళ్లు 11.50 శాతం మిత్తితో అప్పులు తెచ్చారు. ఇలాంటి వారిని ఉరి తీసినా తప్పు లేదు’’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైకా, ప్రపంచ బ్యాంకు 2-4 శాతం మిత్తితోనే అప్పులు ఇస్తాయని, కానీ, వాళ్ల హయాములో 11.5 శాతం వడ్డీతో అప్పులు తెచ్చారని, ఇలాంటి ఆర్థిక నేరాలకు ఇతర దేశాల్లో పాల్పడి ఉంటే.. ఉరి తీసి ఉండేవారని ధ్వజమెత్తారు. సోనియాగాంధీ ఇచ్చిన రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పదేళ్లు పాలించి, వందేళ్ల విధ్వంసం చేసి, వెయ్యి తరాలకు సరిపోయేంత ఆస్తులను కొల్లగొట్టారని ఆరోపించారు. అసెంబ్లీలో రైతు భరోసా పథకంపై శనివారం జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సపై దాదాపు గంటన్నరపాటు నిప్పులు చెరిగారు. బీఆర్‌ఎస్‌ నాయకులు దొంగలకు సద్దులు మోసెటోళ్లని, వారిని తెలంగాణ సమాజం క్షమించదని వ్యాఖ్యానించారు.


రాళ్లు రప్పలకు రూ.22,606 కోట్లు

పంటకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని గత ప్రభుత్వం ఘనంగా చెప్పుకొందని, కానీ, పదేళ్ల కాలంలో రూ.22,606 కోట్లను రాళ్లు రప్పలు, రోడ్లు, రియల్‌ వెంచర్లకే చెల్లించారని సీఎం రేవంత్‌ రెడ్డి తప్పుబట్టారు. వ్యవసాయం చేసుకునే వారికి నగదు రూపంలో పెట్టుబడిగా సహాయం చేయాలన్నది జీవో సారాంశమని, కానీ, పథకం అమల్లో బాధ్యతారహితంగా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కింద రూ.7,625 కోట్లను చెల్లించాం. ఇదే పథకం కింద గత పదేళ్లలో రూ.72,816 కోట్లు చెల్లించామని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పుకొంది. కానీ.. ఇందులో సాగులో లేని భూములకే రూ.22,606 కోట్లు చెల్లించారు. రాజీవ్‌ రహదారి కింద.. శ్రీశైలం రహదారిలో పోయిన భూములకూ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, పోడు భూములపై నకిలీ పట్టాలు, దొంగ పాస్‌ బుక్‌లు తయారు చేసిన వారికి ఇచ్చారు. హైదరాబాద్‌ చుట్టూ సాగు చేయని భూములకు ఇచ్చారు. ఇప్పుడు కూడా రాళ్లు రప్పలు, గుట్టలకు రైతు భరోసా ఇద్దామా?’’ అని ప్రశ్నించారు. ‘‘80 వేల పుస్తకాలు చదివిన అనుభవంతో రైతు బంధును తయారు చేసిన ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్‌) సభకు వచ్చి రైతు భరోసాపై సూచనలు ఇస్తాడని అనుకున్నాం. కానీ, భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, రియల్‌ ఎస్టేట్‌ భూములకు రైతు భరోసా ఇవ్వాలని వాళ్లు (బీఆర్‌ఎస్‌) అంటున్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే మేం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం? అక్కడ కూర్చుండేవాళ్లం. బయటకు వెళ్లిపోయేవాళ్లం. మీరు కాదు.. రైతులు మాకు ఆదర్శం. ’’ అని చెప్పారు.


రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానం

రైతుబంధు పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వాళ్లు చెబుతున్నారని, కానీ, నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్‌ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘‘బీఆర్‌ఎ్‌సవి నోరు తెరిస్తే అబద్ధాలు. అబద్ధాల సంఘం అధ్యక్షుడు (కేసీఆర్‌) రాలేదు. ఉపాధ్యక్షుడు (కేటీఆర్‌) వచ్చి ఇంకా అబద్ధాలు చెబుతున్నారు. రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 160, 2015లో 516, 2016లో 239 జరిగాయి. మూడేళ్లలో అక్కడ మొత్తం ఆత్మహత్యలు వెయ్యిలోపే. మహారాష్ట్రలో 2014లో 2,568, 2015లో 3030, 2016లో 2550 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. దేశంలో ఆ రాష్ట్రానిదే ప్రథమ స్థానం. 80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి నాయకత్వంలోని తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2014లో 898, 2015లో 1,358, 2016లో 632 రైతు ఆత్మహత్యలు జరిగాయి. అంటే.. మూడేళ్లలో దాదాపు మూడు వేలు. దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. అయినా... వాళ్లు ఆత్మహత్యలు తగ్గించామంటున్నారు. ఏంటి మీరు తగ్గించింది మీ బొంద’’ అని మండిపడ్డారు.


వాళ్ల మాఫీ.. గుండు సున్నా

అధికారంలోకి రాగానే లక్షలోపు రుణ మాఫీ చేస్తామని అన్నారని, దానిని కాస్తా ఐదేళ్లపాటు కొనసాగించారని సీఎం రేవంత్‌ తప్పుబట్టారు. ‘‘ఐదేళ్లపాటు ఆపసోపాలు పడి వాళ్లు రూ.16,143 కోట్లు రుణ మాఫీ చేశారు. అయినా... అది మిత్తికే సరిపోయింది. రైతుల అసలు అప్పు అలాగే ఉండిపోయింది. మళ్లీ 2018లో ఇచ్చిన హామీ మేరకు ఔటర్‌ను అమ్మి తెచ్చిన సొమ్ముతో రూ.11,909.31 కోట్లను మాఫీ చేశారు. ఇందులో మిత్తి కింద పోయింది రూ.8,515 కోట్లు. నికరంగా చేసిన మాఫీ రూ.3,384 కోట్లు. మీరు అసలు కట్టిందే లేదు, మాఫీ చేసిందే లేదు’’ అని ధ్వజమెత్తారు. పదేళ్లలో వాళ్లు చేసిన రూ.27 వేల కోట్ల రుణ మాఫీలో మిత్తిని తీసేస్తే గుండు సున్నా అవుతుందని ఎద్దేవా చేశారు. ‘‘మేం రూ.2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పాం. ఏడాది కాలంలోనే 25,35,963 మంది రైతులకు రూ.20,616.89 కోట్లను మాఫీ చేశాం. కడుపు కట్టుకుని, ఇతర కార్యక్రమాలు ఆపి, రైతులపై మిత్తి పడకుండా, వెంటనే మాఫీని అమలు చేశాం. ఇది రైతుల పట్ల మేం చూపించిన ప్రేమ, ఆప్యాయత. మాది భావోద్వేగం. వాళ్లదంతా వ్యాపారమే’’ అని విమర్శించారు. రుణ మాఫీకి రూ.8 వేల కోట్లు కావాలని, అంత డబ్బు తమ వద్ద లేదని అప్పట్లో అన్నారని, కానీ, స్విస్‌ బ్యాంకుకు కూడా అప్పు ఇచ్చేంత శక్తి వాళ్లకుందని ఎద్దేవా చేశారు.


... కట్టింది కూలేశ్వరం

పదేళ్ల పాలనలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి కూలేశ్వరం కట్టారంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ ఎద్దేవా చేశారు. ‘‘అప్పులపై సభలో ఇటీవల మేం శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాం. దాని ప్రకారం.. రాష్ట్ర మార్కెట్‌ రుణాలు రూ.3,89,673 కోట్లు. ఎస్పీవీల కింద కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి, ప్రభుత్వమే చెల్లించాల్సిన అప్పులు 1,29,243 కోట్లు. ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్లు తీసుకుని, ఆ సంస్థలే చెల్లించే రుణాలు రూ.95,462 కోట్లు. ఎలాంటి ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలు రూ.59,414 కోట్లు. ఇలా మొత్తం రుణాలు రూ.6,71,757 కోట్లు. ఇక, సర్పంచులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌, సాగునీటి ప్రాజెక్టుల బకాయిలన్నీ కలిపితే మరో రూ.40,154 కోట్లు. మొత్తం అప్పులు రూ.7,11,911 కోట్లు. తెలంగాణ వచ్చేనాటికి ఉన్న అప్పులు రూ.72 వేల కోట్లు; కార్పొరేషన్ల గ్యారెంటీ రుణాలు రూ.11 వేల కోట్లు! ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక కుటుంబం తొమ్మిదిన్నరేళ్లపాటు పాలించి చేసిన అప్పు రూ.6.71 లక్షల కోట్లు. అప్పట్లో రూ.72 వేల కోట్లతో కాంగ్రెస్‌ పాలనలో నెట్టెంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌, కల్వకుర్తి, ఎస్‌ఆర్‌ఎస్పీ, వంటి ప్రాజెక్టులు, ఓఆర్‌ఆర్‌, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తే.. మిగులు రాష్ట్రాన్ని అప్పగించినా లక్షల కోట్లు అప్పు చేసి మీరు చేసిందేమిటంటే ‘కూలేశ్వరం’ కట్టడం’’ అని ఎద్దేవా చేశారు. ఇక, ‘‘మేమొచ్చిన 11 నెలల్లో రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేశామని అంటున్నారు. వాళ్లు ఇచ్చిపోయిన అప్పు రూ.7,11,911 కోట్లు. మేం చేసిన అప్పు రూ.1,27,000 కోట్లు! మొత్తం కలిపితే.. రూ.8,38,911 కోట్లు ఉండాలి. కానీ.. ఈనెల 18నాటికి ఉన్న రాష్ట్ర అప్పు కేవలం రూ.7,22,788 కోట్లు. మిగతా రూ.1.20 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?’’ అని ప్రశ్నించారు. అప్పులు తెచ్చి తాము గజ్వేల్‌లో, జన్వాడలో, మొయినాబాద్‌లో ఫామ్‌ హౌజ్‌లు కట్టుకోలేదని, ధరణిలో భూములను కబ్జా పెట్టలేదని మండిపడ్డారు. వాళ్ల పదేళ్ల పాలనలో ‘బొచ్చెడు తప్పులు.. పుట్టెడు అప్పులు’ అని ధ్వజమెత్తారు.


అడుగుదామని, కడుగుదామని ఎదురు చూశా..!

‘‘పదేళ్లలో మీరు ప్రగతి భవన్‌, సచివాలయం, ఫామ్‌ హౌజ్‌, 33 జిల్లాల్లో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. పేపర్లు, టీవీలు పెట్టుకున్నారు. కానీ, పేద పిల్లల కోసంఒక్క హాస్టల్‌ బిల్డింగు కట్టారా? బాత్‌రూమ్‌ కట్టారా? భవనాలు కట్టనందుకు సిగ్గుతో తల దించుకుని, ముక్కు నేలకు రాసి, క్షమాపణ చెప్పాలి. అందుకే మొహం చెల్లక ఆయన (కేసీఆర్‌) సభకు రావడం లేదు. వస్తే.. అడుగుదామని, కడిగేద్దామని సంవత్సరం నుంచి ఎదురు చూశా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసం తాము ఔటర్‌ రోడ్డును, కోకాపేటను అమ్మలేదని, పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, తాకట్టు పెట్టి, బొందలగడ్డ చేసిన నువ్వా నాకు పరిపాలన గురించి చెప్పేదని విరుచుకుపడ్డారు. పోటీ పరీక్షలు సరిగా నిర్వహించలేని సన్నాసులు నాతో మాట్లాడతారా!? అని ధ్వజమెత్తారు.


ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ద్రోహం చేయలేదు

తీవ్రంగా వెనకబడిన కొడంగల్‌ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తాను ప్రయత్నిస్తుంటే కాళ్లల్లో కట్టెలు పెడుతున్నారని, అడ్డం పడుతున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత ద్రోహం చేయలేదని సీఎం రేవంత్‌ మండిపడ్డారు. ‘‘కొడంగల్‌ చాలా వెనకబడిన ప్రాంతం. దేవుడు నాకు అవకాశమివ్వడంతో మొన్న 14 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. వారికి నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కొన్ని పరిశ్రమలు తెచ్చి, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అనుకున్నా. అక్కడ 1300 ఎకరాల భూమి సేకరించి, ఫార్మా విలేజ్‌ను పెట్టాలనుకున్నాం. కానీ.. నేను ఏం చేసినా తప్పు పడుతున్నారు. రూ.కోట్లు పంపించి, మద్యాన్ని తాగించి అధికారులపై దాడులు చేయించారు. వాళ్లను చంపే ప్రయత్నం చేసిన వీళ్లను ఏం చేయాలి? వీళ్లు అడ్డమొస్తే తొక్కుకుంటూ పోయి చేస్తా’’ అని తేల్చి చెప్పారు. పరిశ్రమలను తెస్తానంటే వద్దంటున్నారని, అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాను అయ్య పేరో, మామ పేరో చెప్పుకొని ఇక్కడికి రాలేదని, స్వశక్తితో కష్టపడి వచ్చానని, నల్లమల నుంచి వచ్చిన తనకు పులులు, సింహాలు, మృగాల నుంచి ఎలా బయట పడాలో తెలుసునని వ్యాఖ్యానించారు. ‘‘ఈ దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమిస్తుందా? ఈ ఆర్థిక ఉగ్రవాదులను ఎంత కాలం భరించాలి?’’ అని ప్రశ్నించారు.

Updated Date - Dec 22 , 2024 | 03:53 AM