CM Revanth Reddy: కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు!
ABN, Publish Date - Aug 01 , 2024 | 02:46 AM
సమయం, సందర్భాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలూ రద్దు కావచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి నిలుచున్నారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలను రద్దు చేశారని, అప్పుడు వారు స్పీకర్ పోడియం వద్దకు కూడా వెళ్లలేదని.. 2014 నుంచి 2018 వరకూ ఏ ఒక్క సమావేశంలోనూ తనను ఉండనీయ లేదని, సభకు వచ్చిన వెంటనే తీసుకెళ్లి బయటకు తోసేశారని గుర్తు చేశారు.
కోమటిరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వం రద్దు కాలేదా?
నన్ను కూడా ఏ ఒక్కరోజూ అసెంబ్లీలో ఉండనివ్వలేదు
బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పరోక్ష హెచ్చరిక
సబితక్క ఈ తమ్ముణ్ని అనాథ చెయ్యొచ్చా అని వ్యాఖ్య
కేటీఆర్ 100ు ఆర్టిఫిషియల్.. 0 ఇంటెలిజెన్స్: సీఎం
బీఆర్‌ఎస్ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి పరోక్ష హెచ్చరిక
హైదరాబాద్, జూలై 31(ఆంధ్రజ్యోతి): సమయం, సందర్భాన్ని బట్టి కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలూ రద్దు కావచ్చునని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ తొలి శాసనసభలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా కుర్చీలో నుంచి లేచి నిలుచున్నారన్న కారణంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాలను రద్దు చేశారని, అప్పుడు వారు స్పీకర్ పోడియం వద్దకు కూడా వెళ్లలేదని.. 2014 నుంచి 2018 వరకూ ఏ ఒక్క సమావేశంలోనూ తనను ఉండనీయ లేదని, సభకు వచ్చిన వెంటనే తీసుకెళ్లి బయటకు తోసేశారని గుర్తు చేశారు. ఇప్పుడూ సభ్యుల శాసనసభ సభ్యత్వాలను స్పీకర్ రద్దు చేసినా చెయ్యవచ్చన్నారు. సభలో సస్పెన్షన్లు, బహిష్కరణలు, మార్షల్స్ అవసరం రావద్దనే తాను కోరుకుంటున్నానన్నారు. అసెంబ్లీలోని తన చాంబర్లో బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన రేవంత్.. శాసనసభ సభ్యత్వాల రద్దుపై బీఆర్‌ఎస్ నేతలకు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. ‘ఈ సంప్రదాయం మన దగ్గర ఇప్పటికే వచ్చింది కదా?’ అని వ్యాఖ్యానించారు. శాసనసభలో గత ప్రభుత్వం తీసుకువచ్చిన రకరకాల సంప్రదాయాల్లో ఏ సంప్రదాయాన్నయినా మనం తీసుకోవచ్చునన్నారు.
అలాగే.. ‘‘నన్ను కాంగ్రె్‌సలోకి రమ్మని ఆహ్వానించిన సబితక్క.. నాకు అండగానిలబడకుండా బీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిందంటే ఈ తమ్ముణ్ని అనాథను చేసినట్లే కదా?’’ అని సీఎం వ్యాఖ్యానించారు. అలాగే 2018 ఎన్నికల్లో సునీతక్క తరఫున ప్రచారానికి వెళితే అప్పటి ప్రభుత్వం తనపై రెండు కేసులు పెట్టించిందన్నారు. కౌడిపల్లి, నర్సాపూర్ పోలీస్ స్టేషన్లలో ఆ కేసులు ఇప్పటికీ ఉన్నాయన్నారు. తాను కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటే.. సునీతక్క మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ పోస్టు తీసుకుని, ఆ తర్వాత ఎమ్మెల్యే కూడా అయ్యారన్నారు. అక్కల మాట నమ్మి మోసపోవద్దనే తాను శాసనసభలో కేటీఆర్‌కు చెప్పానని, వారి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని వివరించారు. రేవంత్‌ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చినందుకు తన కొడుకుకు రాజేంద్రనగర్ టిక్కెట్టు రాకుండా ఉత్తమ్ అడ్డుపడ్డారన్న సబిత వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అప్పుడు పొత్తులో భాగంగా రాజేంద్రనగర్ సీటు టీడీపీకి కేటాయించారని గుర్తు చేశారు.
2014ఎన్నికల్లో సబితక్కకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు ఇవ్వలేదని, కానీ 2018 ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. పెద్ద మనసు చేసుకుని ఆమెకు టిక్కెట్టు ఇచ్చారన్నారు. ఉత్తమ్‌పైన ఆమె ఆ ఔదార్యం ఎందుకు చూపట్లేదని ప్రశ్నించారు. సబితక్కకు సభలో నిజంగా అవమానం, అన్యాయం జరిగితే.. ఆమె ఆవేదన చెందితే.. సభకు వచ్చి అండగా నిలబడాల్సిన కేసీఆర్, హరీశ్‌రావు ఎందుకు డుమ్మా కొట్టారని ప్రశ్నించారు. తన పార్టీ సభ్యులను పట్టించుకోకుండా కేసీఆర్ ఎందుకు పత్తా లేకుండా పోయారని ప్రశ్నించారు. ‘‘సభలో మాట్లాడేందుకు కేటీఆర్, హరీశ్ చాలనుకుంటే.. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఎందుకు పెట్టుకున్నట్లు? ఆ పదవి నుంచి ఆయన్ను తొలగించండి!’’ అని సూచించారు. శాసనసభ నడపడంలో తాము ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసిన సీఎం.. బడ్జెట్, డిమాండ్లపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ సభ్యులకు అనుకున్న దాని కంటే ఎక్కువ సమయమే ఇచ్చామన్నారు.
సభలో వాగ్యుద్ధం..
ద్రవ్య వినిమయ బిల్లుపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం రేవంత్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ‘‘కృత్రిమమేధకు, కేటీఆర్‌కు పోలిక ఏమిటంటే.. కేటీఆర్ 100 శాతం ఆర్టిఫీషియల్, సున్నా ఇంటెలిజెన్స్’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. దీనికి ఘాటుగా స్పందించిన కేటీఆర్.. తనను అలా అన్నా బాధ లేదని, తనను తన తండ్రి బాగా చదివించారని, తనకు రెండు డిగ్రీలు ఉన్నాయని, రేవంత్ ఏం చదివారో మాత్రం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. తొలుత కేటీఆర్ మాట్లాడుతూ.. మగ్గంపై మళ్లీ మరణ మృదంగం మోగుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో ఇప్పటివరకు 15 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. బతుకమ్మ చీరల పంపిణీని, గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీని నిలిపివేశారన్నారు.
దీనికి రేవంత్.. ‘‘కేటీఆర్ సభను తప్పుదోవ పట్టించటానికి సమయాన్ని వినియోగించుకుంటున్నారు. సూచన అనే ముసుగులో మోసం అనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో జొప్పిస్తున్నారు. బతుకమ్మ చీరల పథకంలో అవినీతి జరిగింది. నేత కార్మికులకు పని కల్పించామంటూ అబద్ధాలు చెప్పారు. పథకాన్ని ప్రారంభించిన 2017-18 సంవత్సరంలో సూరత్ నుంచి చీరలు తెప్పించారు. కిలోల కొద్దీ చీరలను కొని, కమీషన్లు దండుకున్నారు. సిరిసిల్ల నేతన్నలకు రూ.275కోట్లు బకాయి పడ్డారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.100కోట్లు చెల్లించాం’’ అని వ్యాఖ్యానించారు. అలాగే.. తాము ఫార్మాసిటీ అనకుండా ఫార్మా విలేజెస్ అంటున్నామని.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత అక్కడి 4000 ఎకరాల్లో నాల్గో సిటీని అభివృద్ధి చేస్తున్నామని, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటుచేసి ప్రపంచస్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ చీల్చి చెండాడుతానని అనడంతో తాము సభకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చామని ఎద్దేవా చేశారు.
రెండు గంటలపాటు మాట్లాడిన కేటీఆర్.. విషం చిమ్మడం తప్ప ప్రజలకు మేలు చేసేలా మాట్లాడలేదని ఆరోపించారు. ఇలాగైతే ప్రజలు వారిని సభలో కూడా ఉండనివ్వరని వ్యాఖ్యానించారు. దీనికి కేటీఆర్.. అదృష్టం బాగుండి రేవంత్ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. గతంలో ఆయన, తాను మంచి స్నేహితులమేనని.. కానీ, గత పదేళ్లుగా చెడిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్‌ను ఏకవచనంతో సంబోధించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. దీంతో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కేటీఆర్ చెప్పాల్సి వచ్చింది. మళ్లీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... తాను రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నానని, గుంటూరులో చదువుకోలేదని.. 610 జీవో, ముల్కీ రూల్స్ ప్రకారం ఉద్యోగాలకు కేటీఆర్‌కు అర్హత లేదని అన్నారు. ఇందుకు కేటీఆర్.. 610 జీఓ, ముల్కీ రూల్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమని, తాను ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేశానని బదులిచ్చారు. మొదటి సంవత్సరం పాక్షికంగా సూరత్ నుంచి బతుకమ్మ చీరలను తెప్పించిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చినంతమాత్రాన..
బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి అరగంట పాటు కూర్చుని వెళ్లారని, చాలా విషయాలు తనతో మాట్లాడారని సీఎం రేవంత్ వెల్లడించారు. తన వద్దకు వచ్చి వెళ్లినంత మాత్రాన వారు ఇటు వచ్చేసినట్లు కాదన్నారు. అలాగే తమవాళ్లు కేటీఆర్‌ను కలిసినంత మాత్రాన అటు పోయినట్లు కాదన్నారు. గద్వాల ఎమ్మెల్యే తిరిగి బీఆర్‌ఎ్‌సలో చేరనున్నారన్న వార్తలపై సీఎం ఇలా స్పందించారు.
Updated Date - Aug 01 , 2024 | 02:46 AM