ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cognizant: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ భారీ విస్తరణ..

ABN, Publish Date - Aug 06 , 2024 | 02:20 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది.

  • 10 లక్షల చదరపు అడుగుల్లో కొత్త క్యాంపస్‌

  • మరో 15 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

  • న్యూజెర్సీ కార్యాలయంలో సీఈవోతో సీఎం రేవంత్‌ భేటీ

  • ఇప్పటికే హైదరాబాద్‌లో 5 ఆఫీసులు, 18 వేల ఉద్యోగులు

  • తెలంగాణ స్టార్టప్‌లలో వాల్స్‌ కర్రా రూ.839 కోట్ల పెట్టుబడులు

  • సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ

  • అమెరికాను మార్చేశారు.. ఇక సొంత రాష్ట్రం తెలంగాణకు రండి

  • ఎన్నారైల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి పిలుపు

  • రేవంత్‌కు ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రవాసులు

  • అమెరికాకు పయనమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • జయశంకర్‌ సార్‌.. నిన్ను మరువం: రేవంత్‌ నివాళి

హైదరాబాద్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్‌ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్‌లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్‌ నెలకొల్పనున్నట్లు సోమవారం ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్‌ సీఈవో రవికుమార్‌ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో ఐదు కార్యాలయాలు, 18 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ నెలకొల్పనున్నట్టు సీఈవో రవికుమార్‌ వెల్లడించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ ఇంజనీరింగ్‌, క్లౌడ్‌ సొల్యూషన్స్‌తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్‌ ప్రధాన కార్యాలయంలో సీఈవో రవికుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుంది.


  • ఐటీకి మరింత అనుకూల వాతావరణం..

ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కాగ్నిజెంట్‌తో ఎంవోయూ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్‌ కంపెనీ కొత్త సెంటర్‌ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కంపెనీకి ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని, ఈ విస్తరణతో రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్‌ కంపెనీలన్నీ హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్‌ నిర్ణయం హైదరాబాద్‌ వృద్థికి మరింతగా దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ను సందర్శించింది.


  • పెట్టుబడులతో తెలంగాణకు రండి..

ప్రవాస భారతీయులు తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, పెట్టుబడులు వచ్చేందుకు సహకరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. పది రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం సోమవారం అమెరికా చేరుకున్నారు. న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. అంతకుముందు దారి పొడవునా భారీ ర్యాలీతో రేవంత్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికీ తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది.


మన ప్రాంత అభివృద్థిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోన్‌సగా లభిస్తుంది. మీ నైపుణ్యాలు, ప్రతిభా పాటవాలతో అమెరికాను ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మార్చారు. అత్యంత పటిష్ట, సంపన్న దేశంగా అభివృద్ధి చెందడంలో మీ పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు సొంత రాష్ట్రానికి మీ అవసరం ఉంది. ఇక మీ ప్రతిభ, నైపుణ్యాలు తోడైతే హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేయవచ్చు’’ అని రేవంత్‌ అన్నారు. గతేడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరికాకు వచ్చానని, పదేండ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పానని గుర్తు చేశారు. తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు.


  • అబద్ధాలకోరు మాటలు తప్పు అని నిరూపిస్తాం

‘‘ఎన్నికల ముందు మాపై ఎంతో విష ప్రచారం జరిగింది. గిట్టని వాళ్లందరూ కాంగ్రెస్‌ అధికారంలోకే రాదన్నారు. వచ్చినా అది ఉండనే ఉండదన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అభివృద్థి మందగిస్తుందంటూ లేనిపోని అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ది చెప్పాం. అబద్ధాలకోరుల మాటలు తప్పు అని నిరూపిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమ్మిళిత ఆర్థిక వృద్థిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్సారైలు అభినందించారు.


హైదరాబాద్‌ అభివృద్థికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే పాటలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నారైలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్‌ సింగ్‌ గీల్జియాన్‌ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికాకు చెందిన వాల్ష్‌ కర్రా హోల్డింగ్స్‌ రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో నెలకొల్పే స్టార్ట్‌పలలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్‌ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన వి-హబ్‌లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో వాల్ష్‌ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్‌ వాల్ష్‌, వి-హబ్‌ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.


  • జయశంకర్‌ సార్‌.. నిన్ను మరువం: సీఎం రేవంత్‌

ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్‌ జయశంకర్‌సార్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని సీఎం రేవంత్‌ పేర్కొన్నారు. మంగళవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను సీఎం గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ రాష్ట్రాన్ని., ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్‌ వ్యతిరేకించారని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో విలీనంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏ విధంగా నష్టపోయారో గణాంకాలతో సహా ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్‌దేనని కొనియాడారు. ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్‌ తెలిపారు.


  • అమెరికా వెళ్లిన కోమటిరెడ్డి

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం అమెరికా వెళ్లారు. అక్కడి పలు కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ కానున్నారు. నల్లగొండలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ తవ్వకం.. బేరింగ్‌, ఇతర మరమ్మతుల కారణంగా ఏళ్ల తరబడి ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఆ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన అధునాతన బేరింగ్‌ యంత్రాలను సమకూర్చే కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 12న ఓహియోలోని రాబిన్స్‌ టన్నెల్‌ బోరింగ్‌ మెషినరీ ఉత్పత్తి కంపెనీ సీఈవో లాక్‌హోమ్‌తో భేటీ కానున్నారు. కాగా, 7న అమెరికాలోని ప్రవాస భారతీయ నేతలతో నిర్వహించే ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’ కార్యక్రమంలో సీఎం రేవంత్‌తో కలిసి కోమటిరెడ్డి పాల్గొననున్నారు.


తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీ చైర్మన్‌గా ఆనంద్‌ మహీంద్ర

  • న్యూజెర్సీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన

హైదరాబాద్‌, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్‌ అధినేత ఆనంద్‌ మహీంద్ర వ్యవహరిస్తారని సీఎం రేవంత్‌ ప్రకటించారు. సోమవారం న్యూజెర్సీలో తెలంగాణ ప్రవాసుల సభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. కొద్దిరోజుల్లో ఆనంద్‌ మహీంద్ర బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. తెలంగాణ యువతను ప్రపంచంలోనే ఉత్తమ నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన స్కిల్‌ యూనివర్సిటీకి అంతర్జాతీయంగా పేరున్న ప్రముఖుడినే చైర్మన్‌గా నియమిస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఆనంద్‌ మహీంద్ర ఇటీవల హైదరాబాద్‌లో సీఎంని కలిసిన సందర్భంలోనూ స్కిల్‌ యూనివర్సిటీపై చర్చలు జరిపారు.

Updated Date - Aug 06 , 2024 | 02:27 AM

Advertising
Advertising
<