Assembly: గురుకులాలపై మాటల యుద్ధం
ABN, Publish Date - Dec 19 , 2024 | 04:12 AM
అసెంబ్లీలో గురుకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
వసతులు, కలుషితాహార ఘటనలపై
అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
పిల్లల ఆహారంలో తప్పు జరిగితే కఠిన చర్యలు
ఆహార భద్రతా కమిటీలు, టాస్క్‌ఫోర్స్‌లు
కోడిగుడ్డుకు 6 చొప్పున ఇవ్వాలని నిర్ణయం
విద్యా వ్యవస్ధను గాడిన పెడుతున్నాం: సీతక్క
గురుకులాల్లో చదవాలంటే భయపడుతున్నారు
ఈ ఏడాది 54 మంది పిల్లల మృతి: గంగుల
ఇంకా యూనిఫాంలు ఇవ్వలేదు: హరీశ్
వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్: అక్బర్
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో గురుకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గురుకులాల్లో చదవాలంటేనే పిల్లలు భయపడుతున్నారని బీఆర్‌ఎస్ విమర్శించగా.. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ విద్యా వ్యవస్థను విస్మరించి.. ఇప్పుడు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. గురుకులాల్లో కలుషితాహార ఘటనలపై ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ తప్పుపట్టగా... వాటి వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తం చేశారు. గురుకులాలు, పాఠశాలలపై చర్చను ప్రారంభించిన మంత్రి సీతక్క.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఒక గాడిన పెట్టడానికి ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తోందంటూ చేపట్టిన వివిధ చర్యలను వివరించారు. పిల్లలకు పెట్టే ఆహారం విషయంలో తప్పు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లు నాణ్యమైన ఆహార పదార్థాలు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
హాస్టళ్లలో వివిధ కారణాలతో విద్యార్థుల మరణాలు ఇప్పుడే సంభవించడం లేదని, అప్పట్లోనూ 62 మంది పిల్లలు చనిపోయారని, ఈ ఏడాది 26 మంది మరణించారని, ఈ మరణాలు బాధాకరమన్నారు. నాణ్యమైన ఆహారం అందించడానికి ఆహార భద్రతా కమిటీలు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు చేశామన్నారు. తమ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే ప్రతిపక్షం మద్దతు ఇవ్వకపోగా బట్టకాల్చి మీద వేస్తోందన్నారు. తెలంగాణలో 650 గురుకులాలకు సొంత భవనాలు లేవని, అద్దె భవనాల్లో ఉండడంతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. నవంబరు వరకు వరకు మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించామని, ఇకపై గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే డైట్, మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామన్నారు. కోడిగుడ్డు ధరను రూ.5 నుంచి రూ.6కు పెంచాలని నిర్ణయించామన్నారు. సాధారణ పాఠశాలల్లో 10,006 పోస్టులు, గురుకులాల్లో 10,225 పోస్టులు భర్తీ చేశామని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో కేటీఆర్ కుమారుడు ఒక పాఠశాల దగ్గరకు వెళ్లి ఆశ్చర్యపోయి ‘ఇది పాఠశాలేనా’ అని చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. చర్చ సందర్భంగా గంగుల మాట్లాడుతూ గురుకులాల్లో కలుషితాహార ఘటనలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. కలుషితాహారం తిని చనిపోయిన విద్యార్థిని శైలజ మరణంపై విచారణ జరపాలని కోరారు. ఈ ఏడాది ఇప్పటివరకు 54 మంది గురుకుల విద్యార్థులు విషపూరిత ఆహారం వల్ల మరణించారని ఆరోపించారు. ఒకరు చనిపోయారని ఒక హీరోను అరెస్టు చేసిన సర్కారు.. ఈ మరణాలకు ఎవర్ని అరెస్టు చేయాలని ప్రశ్నించారు.
ఇంకా యూనిఫాంలు ఇవ్వలేదు: హరీశ్
ఇంకా అనేక పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కోడిగుడ్ల బిల్లులు ఆరు నెలలుగా చెల్లించలేదన్నారు. ఈ ఏడాది హాస్టళ్లలో 54 మంది పిల్లలు చనిపోయారని, ఆయా కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. కాగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో గురుకుల పాఠశాల్లో 1,425 మంది విద్యార్థులు కలుషితాహారంతో అస్వస్థతకు గురయ్యారని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ హయంలో ప్రారంభించిన గురుకులాల్లో 66 శాతం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు.
గురుకులాల్లో భోజనం బాగుంది: రాకేశ్‌రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో భోజనం చాలా బాగుందని, తాను వెళ్లి తిన్నానని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి కితాబిచ్చారు. 2 లక్షల మంది విద్యార్థులు డ్రాపవుట్స్ కావడం ఆందోళనకు గురిచేస్తోందన్నారు.
విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్: అక్బరుద్దీన్
బీఆర్‌ఎస్ హయంలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక డైట్, కాస్మెటిక్స్ చార్జీలు పెంచడాన్ని ఆయన అభినందించారు. అయితే పెంచిన చార్జీలు కూడా సరిపోవన్నారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ పిరికిపందలా?
ఇదే అంశంపై చర్చ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై పొన్నం మండిపడ్డారు. తాను మాట్లాడడం మొదలుపెట్టిన ఒక నిమిషానికే అడ్డుపడుతున్నారని, మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఇటీవల ఇచ్చిన శిక్షణలో ఇంకేం చెప్పారని గంగుల వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. దీంతో పొన్నం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘మాట్లాడాలంటే శిక్షణ అవసరమా? నాకు సంస్కారం ఉంది. మొదటిసారి ఎన్నికై వస్తే మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమం చేశానని, రాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడనని, తన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గంగుల స్పందిస్తూ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి కరీంనగర్ నుంచి ఎందుకు పారిపోయారని అన్నారు. తాను హుస్నాబాద్‌కు పారిపోలేదని, రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే నియోజకవర్గం మారాల్సి వచ్చిందన్న పొన్నం.. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి పోటీ చేయాలంటూ గంగులకు సవాల్ విసిరారు. ‘కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సొంత నియోజకవర్గాలు ఎక్కడ? వారు ఎక్కడి నుంచి పోటీ చేశారు? వాళ్లు పిరికిపందలు కాబట్టే నియోజకవర్గాలు మారారా? లేదంటే వాళ్లని అనలేక నన్ను అంటున్నారా’? అని గంగులను నిలదీశారు. రాష్ట్రం కోసం పార్లమెంటులో కొట్లాడిన పొన్నం లాంటి నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని మరో మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు.
Updated Date - Dec 19 , 2024 | 04:12 AM