Chilukuru Balaji: చిలుకూరు ఆలయానికి 2 కి.మీ పరిధిలో అన్యమతస్థుల ప్రార్థనా నిర్మాణాలొద్దు
ABN , Publish Date - Jul 25 , 2024 | 03:36 AM
చిలుకూరు బాలాజీ ఆలయానికి 2కిలోమీటర్ల పరిధిలో అన్యమతాలకు సంబంధించిన ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ డిమాండ్ చేశారు.

ఆలయ ప్రఽధాన అర్చకుడు రంగరాజన్, హిందూ సంఘాల డిమాండ్
గ్రామంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో మసీదు నిర్మాణంపై అభ్యంతరాలు
ఆలయం వద్ద నిరసన గ్రామంలో144 సెక్షన్
మొయినాబాద్ రూరల్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చిలుకూరు బాలాజీ ఆలయానికి 2కిలోమీటర్ల పరిధిలో అన్యమతాలకు సంబంధించిన ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ డిమాండ్ చేశారు. ఏపీలోని తిరుమల తిరుపతి వేంకటేశ్వర దేవస్థానం పరిధిలో ఈ పద్ధతి అమలవుతోందని చెప్పారు. తిరుమలలోని వేంకటేశ్వరస్వామి చిలుకూరులో స్వయంభువుగా వెలిశారని, అందువల్ల అక్కడ ఎలాంటి నియమాలున్నాయో అవే చిలుకూరు దేవాలయానికి కూడా వర్తిసాయని ఆయన చెప్పారు. ఈ పద్ధతిని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులపై ఉందన్నారు.
ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే దృష్టిసారించి ఆలయానికి 2కిలోమీటర్ల పరిధిలో అన్యమతాలకు చెందిన ప్రార్థనా నిర్మాణాలను ఆపేయాలని కోరారు. లేనియెడల ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని రంగరాజన్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మొయునాబాద్ మండలం చిలుకూరు గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. ఇటీవల ఆ స్థలాన్ని చదును చేస్తూ.. దానికి పక్కనే సర్వేనంబర్ 133లో వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన 4 గుంటల స్థలంలో ఉన్న పురాతన కట్టడాన్ని కూడా కూల్చివేశారు. దీంతో, తిరిగి ఆ నిర్మాణాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
ఇది తెలుసుకున్న పలు హిందూ సంఘాల నాయకులు బుధవారం పెద్ద సంఖ్యలో చిలుకూరుకు తరలివచ్చారు. నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీంతో చిలుకూరులో ఉద్రిక్త వాతవారణం నెలకొంది. నార్సింగి ఏసీపీ రమణారెడ్డి, చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయునాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డిలు హిందూ సంఘాల నాయకులతో పాటు రంగరాజన్‌తో సమావేశమయ్యారు. సదరు స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. నిరసన ప్రదర్శనలు, ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో చిలుకూరు, హిమాయత్‌నగర్ గ్రామాల్లో 144 సెక్షన్‌ను విధించినట్లు పోలీసులు చెప్పారు.