Medical Colleges: ‘రివర్స్’లో పదోన్నతులపై గుర్రు!
ABN, Publish Date - Jul 07 , 2024 | 03:05 AM
వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) పరిఽధిలోని పదోన్నతుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాఽధికారుల తీరుపై సీనియర్ ఆచార్యులు, అధ్యాపకులు అభ్యంతరం తెలుపుతున్నారు.
డీఎంఈ పరిధిలో అడ్డగోలు వ్యవహారం.. రాష్ట్రంలో ఖాళీ పోస్టులన్నీ చూపని వైనం
కేవలం 8 కాలేజీల్లోనే చేరాలని నిబంధన
నేటి కౌన్సెలింగ్‌ను అడ్డుకుంటామని సీనియర్ల హెచ్చరిక
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) పరిఽధిలోని పదోన్నతుల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. వైద్యారోగ్యశాఖ ఉన్నతాఽధికారుల తీరుపై సీనియర్ ఆచార్యులు, అధ్యాపకులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఎన్నడూ లేని విధంగా అడ్డగోలుగా రివర్స్ పద్ధతిలో పదోన్నతులు చేపడుతున్నారని ఆక్షేపిస్తున్నారు. పదోన్నతులను ముందుగా అదనపు వైద్య విద్య సంచాలకులతో మొదలుపెట్టాలి. తర్వాత ఆచార్యులు (ప్రొఫెసర్లు), ఆపై అసోసియేట్ ప్రొఫెసర్లు, చివరిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతులు చేపట్టాలి. కానీ డీఎంఈలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. తొలుత అసిస్టెంట్ ప్రొఫెసర్ల నుంచి పదోన్నతులు చేపట్టారు. వీరికి ఆదివారం కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆయా కాలేజీల్లో నాలుగేళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్న 245 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు దక్కాయి. వాస్తవానికి వీరు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని కాలేజీలకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది. కానీ ఉన్నతాఽధికారులు మాత్రం కొత్తగా ఏర్పాటైన (గద్వాల, నారాయణ్‌పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్‌జిల్లా కుత్బుల్లాపూర్ల్) 8 కాలేజీల్లోనే పోస్టింగులు చూపుతున్నారు.
పదోన్నతులు తీసుకుని కచ్చితంగా ఆ కాలేజీలకే వెళ్లాలని చెబుతున్నారు. వీటిలోనే కాకుండా గత రెండేళ్ల నుంచి ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కూడా పోస్టింగులు చూపాలని పదోన్నతులు పొందిన డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీనికి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు మాత్రం కుదరదంటున్నారు. వాస్తవానికి గత మూడేళ్లలో ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కూడా భారీగా ఖాళీలున్నాయి. వాటిని కూడా కౌన్సెలింగ్‌లో చూపిస్తే తమ సమీప ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరే అవకాశముంటుంది. ఉదాహరణకు ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీల్లో 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతులు దక్కాయి.
వీరు తమకు సమీపంలోని ఆసిఫాబాద్, నిర్మల్ మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను చూపిస్తే చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ వైద్య శాఖ మాత్రం తాను పట్టినా కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఏ కాలేజీలో పనిచేస్తూ పదోన్నతి పొందినా వారు ఈ 8 కాలేజీల్లోనే చేరాలంటుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి బలవంతపు పోస్టింగ్‌ను చాలామంది ఇష్టపడటం లేదని సమాచారం. పదోన్నతులు పొందిన వారిలో 20-30 శాతం మంది చేరకపోవచ్చంటున్నారు.
అడ్డుకుంటామంటున్న వైద్య సంఘాలు
ఆదివారం డీఎంఈ ఆఫీసులో చేపడుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకుంటామని వైద్య సంఘాలు హెచ్చరించాయి. అడ్డగోలుగా కౌన్సెలింగ్ చేపడతామంటే ఊరుకునేది లేదంటున్నాయి. నిబంధనల ప్రకారం ముందుగా అదనపు డీఎంఈలుగా పదోన్నతులు ఇవ్వాలి. వారిని కొత్త మెడికల్ కాలేజీలకు ప్రిన్సిపల్స్‌గా నియమిస్తారు. వాటి అనుబంధ ఆస్పత్రులకు సూపరింటెండెంట్ పోస్టులను కూడా వారితోనే భర్తీ చేస్తారు. అదనపు డీఎంఈలుగా పదోన్నతి పొందిన వారి స్థానాలు ఖాళీ అవుతాయి. వాటిని ప్రొఫెసర్లకు పదోన్నతులివ్వడం ద్వారా భర్తీ చేయాలి. తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్లు, ఆపై అసిస్టెం ట్ ప్రొఫెసర్ల పదోన్నతులు చేపట్టాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను నేరుగా భర్తీ చేస్తారు.
ఇలా నిబంధనల ప్రకారం జరగాల్సిన వ్యవహారాన్ని పై నుంచి కాకుండా కింద నుంచి చేపట్టడం, అన్ని కాలేజీల్లో ఖాళీలు చూపకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సగటు ఉద్యోగికి లేని నియంత్రణలు ఒక్క బోధనా వైద్యులకే ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదు. ఏవో కొన్ని కాలేజీలకే వెళ్లాలనడం కాకుండా రాష్ట్రంలో ఉన్న ఖాళీలన్నీ చూపాలి. బదిలీల జీవో 40 శాతం క్యాడర్ స్ట్రెంత్‌తో త్వరగా విడుదల చేయాలి. ఈ విషయంలో వైద్యులకు అన్యాయం జరిగితే సహించం. ఏ నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడబోం.
- డాక్టర్ మాదల కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం
Updated Date - Jul 07 , 2024 | 03:05 AM