Share News

Hyderabad: ఔను.. ఖర్చు రెట్టింపైంది!

ABN , Publish Date - Jun 24 , 2024 | 04:39 AM

కొత్త సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతనేది ఎట్టకేలకు తేలింది. అనుకున్నదానికంటే వ్యయం రెట్టింపైనట్లు స్పష్టమైంది. పాత భవనాల సముదాయాన్ని కూల్చివేసి చేపట్టిన పనుల వ్యయాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు అత్యంత గోప్యంగా ఉంచింది.

Hyderabad: ఔను.. ఖర్చు రెట్టింపైంది!

  • సచివాలయ నిర్మాణ వ్యయం రూ.1,140 కోట్లు.. రూ.617 కోట్లు అనుకున్నది కాస్తా డబులైంది

  • మంత్రి కోమటిరెడ్డికి చెప్పిన అధికారులు

  • ఐటీ 181 కోట్ల నుంచి 361 కోట్లకు

  • పరికరాల కొనుగోలులో అక్రమాలు?

  • విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వ నిర్ణయం

  • ‘సెక్రటేరియట్‌’పై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంతనేది ఎట్టకేలకు తేలింది. అనుకున్నదానికంటే వ్యయం రెట్టింపైనట్లు స్పష్టమైంది. పాత భవనాల సముదాయాన్ని కూల్చివేసి చేపట్టిన పనుల వ్యయాన్ని బీఆర్‌ఎస్‌ సర్కారు అత్యంత గోప్యంగా ఉంచింది. ఏ చిన్న విషయాన్నీ బయటకు రానీయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక.. గత ప్రభుత్వం మొదలుపెట్టిన నిర్మాణాలు, వెచ్చించిన నిధులపై దృష్టిసారించింది. దీంతో నూతన సచివాలయం గురించిన వివరాలు సహా ఇంకా ఇతర బకాయిలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.


కాగా, రూ.617 కోట్ల అంచనాతో ప్రారంభమైన సచివాలయం నిర్మాణం పూర్తయ్యేసరికి రూ.1,140 కోట్లకు చేరింది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖ అధికారులు నివేదించగా.. ప్రభుత్వం విస్మయం వ్యకం చేసినట్లు తెలిసింది. సంబంధిత నివేదికను అధికారులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా అందించారు. మరోవైపు సచివాలయంలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఐటీ పరికరాల కోసం వెచ్చించిన నిధులు, వాటి కొనుగోలులోనూ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత రూ.181 కోట్ల మేర ఖర్చవుతుందని భావించగా, ఇది ఏకంగా రూ.361 కోట్లకు చేరింది. ఈ పనులను టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారన్న అంశం తెరమీదకు వచ్చింది. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేయిస్తున్నట్టు సమాచారం. కాగా, సచివాలయ నిర్మాణ ఖర్చు రూ.1,140 కోట్లకు చేరిందన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ గతంలోనే చెప్పింది. ‘సచివాలయం ఖర్చు డబుల్‌’ శీర్షికన మార్చి 24న కథనాన్ని ప్రచురించింది. మరోవైపు సచివాలయం, 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం, అమర వీరుల స్మారక స్తూపం, జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌లు సహా పలు నిర్మాణాలకు రూ.3,740 కోట్ల ఖర్చు కాగా రూ.1,251 కోట్లను ఆయా సంస్థలకు చెల్లించాల్సి ఉంది.


ఇదీ విషయం..

కొత్త సచివాలయ నిర్మాణానికి 2019 జూన్‌ 27న అప్పటి సీఎం కేసీఆర్‌ పాత సచివాలయంలోని డి-బ్లాక్‌ వెనుకభాగంలో శంకుస్థాపన చేశారు. 2023 ఏప్రిల్‌ 30న ప్రారంభోత్సవం చేశారు. అయితే, ఖర్చుపై గత ప్రభుత్వం, అర్‌అండ్‌బీ అధికారులు అత్యంత గోప్యత పాటించారు. ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా రూ.617 కోట్ల అంచనాతో కూడిన జీవో గురించి మాత్రమే చెబుతూ వచ్చారు. తప్పితే పెరిగిన అంచనాల గురించి ప్రస్తావించలేదు. నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా సచివాలయ నిర్మాణంపై అనుమానాలను వ్యక్తం చేసింది. ఇప్పుడు అధికారంలోకి రావడంతో గతంలో చేపట్టిన నిర్మాణాలు, చేసిన ఖర్చులపై వివరాలు సేకరిస్తున్నది. ఈ క్రమంలో సచివాలయం వ్యయం రూ.1,140 కోట్లు అయిందని తేలింది. ఇక ఐటీ పరికరాల వ్యయం రూ.361 కోట్లు కూడా కలిపితే కొత్త సచివాలయం ఖర్చు మొత్తం రూ.1,501 కోట్లుగా ఉంది.


రోడ్లు, భవనాల శాఖ పరిధిలో, పర్యవేక్షణలో చేపట్టిన పలు నిర్మాణాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సమీకృత కలెక్టరేట్‌లు, అధికారుల నివాస సముదాయాలకు సంబంధించి దాదాపు రూ.468 కోట్లు, 119 మంది ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాల బిల్లులు రూ.22 కోట్లు, నూతన సచివాలయానికి రూ.523 కోట్లు, అమరుల స్మారక స్తూపం (రూ.6.58 కోట్లు), అంబేడ్కర్‌ విగ్రహం (రూ.13.99 కోట్లు), ప్రెస్‌ అకాడమీ భవనం (రూ.3 కోట్లు), ఈవీఎం, వీవీప్యాట్ల స్టోరేజీ గోదాం (రూ.11.42 కోట్లు), ఆర్‌అండ్‌బీ ఇన్‌స్పెక్షన్‌ బంగ్లా (రూ.98.73 కోట్లు)లతో పాటు మరికొన్నిటికి సంబంధించి దాదాపు రూ.1,251 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో కొన్ని ఆర్థిక శాఖ వద్దే ఉన్నాయి. కాగా, ఆయా భవనాలు, నిర్మాణాలు చేపట్టిన సంస్థలు తమకు బిల్లులు చెల్లించాలంటూ రోడ్లు, భవనాల శాఖకు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Updated Date - Jun 24 , 2024 | 04:39 AM