Share News

AICC: ముగిసినకురియన్‌ కమిటీ విచారణ..

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:09 AM

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్‌ కమిటీ.. తన విచారణను ముగించింది.

AICC: ముగిసినకురియన్‌ కమిటీ విచారణ..

  • 21న ఏఐసీసీకి కమిటీ నివేదిక

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఆశించిన సీట్లు రాకపోవడంతో నిజనిర్ధారణ కోసం ఏఐసీసీ నియమించిన కురియన్‌ కమిటీ.. తన విచారణను ముగించింది. ఏఐసీసీ నేతలు కురియన్‌, రఖిబుల్‌ హుస్సేన్‌, ఫర్గత్‌ సింగ్‌తో కూడిన త్రిసభ్య కమిటీ.. గురు, శుక్రవారాల్లో గాంధీ భవన్‌ వేదికగా 16 మంది లోక్‌సభ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, డీసీసీ అధ్యక్షుల నుంచి అభిప్రాయాలను స్వీకరించింది. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి ఈ నెల 21న ఏఐసీసీకి ఓ నివేదికను అందజేయనున్నట్లు కమిటీ సభ్యుడు రఖిబుల్‌ హుస్సేన్‌ మీడియాకు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన కమిటీ.. ఆదివారం వరకూ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. అయితే గురువారం కురియన్‌ కమిటీ ముందు హాజరైన నేతలందరూ దాదాపుగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం, ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల హిందుత్వ ప్రభావం చూపడమే కారణమని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చి పోటీ చేసిన నేతలపై స్థానికంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు కొంత మేరకు కోపంగా ఉండడమూ ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. దాదాపు అందరి అభిప్రాయం ఒకే విధంగా ఉండడంతో తన విచారణను కమిటీ శుక్రవారమే ముగించింది. సమావేశంలో స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పలేక పోయిన వారు... ఫోన్‌ ద్వారా గానీ, రాతపూర్వకంగా కానీ కమిటీకి అభిప్రాయం చెప్పవచ్చని నేతలకు సూచించారు. ఇదిలా ఉండగా.. కురియన్‌ కమిటీ సభ్యులు గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.


ఈ సందర్భంగా ఆశించిన మేరకు సీట్లు రాకపోవడంపై అధిష్ఠానానికి చెప్పిన అంశాలనే రేవంత్‌ మరొకసారి కురియన్‌ కమిటీకి వివరించారు. ఇదిలా ఉండగా, కురియన్‌కు సమీప బంధువు ఒకరు మరణించడంతో శుక్రవారం ఉదయం ఆయన కేరళ వెళ్లారు. దీంతో శుక్రవారం రఖిబుల్‌ హుస్సేన్‌, పర్గత్‌ సింగ్‌ మాత్రమే పలువురు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల అభిప్రాయాలను సేకరించారు.

Updated Date - Jul 13 , 2024 | 03:09 AM