Jaipal Yadav: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ ఎమ్మెల్యే జైపాల్ విచారణ
ABN , Publish Date - Nov 17 , 2024 | 04:36 AM
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది.
ఓ కుటుంబ వివాదం గురించి.. తిరుపతన్నతో మాట్లాడా: జైపాల్ యాదవ్
హైదరాబాద్, ఆమనగల్లు, కల్వకుర్తి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది. విచారణ సాంతం మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న కాల్ లిస్ట్ చుట్టూ తిరిగింది. ‘‘మీరు తిరుపతన్న మొబైల్ ఫోన్‌కు రెండు ఫోన్ నంబర్లు పంపించారు. వాటిని ఎందుకు పంపారు?’’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. రెండు గంటల పాటు విచారణ కొనసాగింది. కాగా.. ఈ కేసులో ఇటీవలే మరో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించిన విష యం తెలిసిందే..! లింగయ్య ఇచ్చిన రెండు నంబర్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్‌రెడ్డి, రాజ్‌కుమార్ ఫోన్లను తిరుపతన్న ట్యాప్ చేసినట్లు నిర్ధారణ కావడంతో.. పోలీసులు లింగయ్యను మరోమారు విచారించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు, ఓ పారిశ్రామికవేత్తను పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు నమోదైన తర్వాత.. ఎఫ్‌ఎ్‌సఎల్ నివేదిక రావడంతో.. అధికారులు తిరుపతన్న కాల్‌డేటా ఆధారంగా ముందుకు సాగుతున్నారు. ఈ కేసులో కీలక పాత్ర పోషించిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు.. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసి.. ఆ తర్వాతే భారత్‌కు వచ్చే యోచనలో ఉన్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్‌కు ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరం(షార్ట్ రేంజ్ బగ్) తెప్పించిన రవిపాల్‌ను మరోసారి విచారించేందుకు దర్యాప్తు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నేను ఏ తప్పూ చేయలేదు: జైపాల్
‘‘నేను ఏ తప్పూ చేయలేదు. ఏ రాజకీయ నాయకుడి ఫోన్‌ను ట్యాప్ చేయాలని తిరుపతన్నను ఆదేశించలేదు. ఓ వివాదానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులతో మాట్లాడాలని కోరుతూ.. తిరుపతన్నకు రెండు నంబర్లను పంపాను’’ అని తెలిపారు. దర్యాప్తు అధికారులు మరోసారి విచారణకు రావాలని ఏమీ కోరలేదని ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.