Bandi Sanjay: హరీశ్ వచ్చినా రాజీనామా చేయాల్సిందే
ABN, Publish Date - Jul 15 , 2024 | 04:07 AM
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజల మనిషి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు హరీశ్‌రావు మాత్రమేనని ప్రశంసించారు.
బీఆర్‌ఎస్‌లో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు ఆయనే
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ప్రచారం.. ఓ డ్రామా
కేసీఆర్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక
ఆ పార్టీ నేతలను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
హైదరాబాద్/కరీంనగర్, జూలై 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రజల మనిషి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎ్‌సలో ఉన్న ఏకైక మంచి వ్యక్తి, వివాదరహితుడు హరీశ్‌రావు మాత్రమేనని ప్రశంసించారు. కేసీఆర్‌తోపాటు, కేటీఆర్ కుటుంబ సభ్యుల మాదిరిగా హరీశ్‌రావు కాదన్నారు. కరీంనగర్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. హరీశ్‌రావు గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు మంచి నాయకుడు, ప్రజల మనిషి అని.. ఆయన బీజేపీలోకి వచ్చినా రాజీనామా చేసి రావాల్సిందేనని అన్నారు. ఆయనకు మళ్లీ గెలిచే సత్తా ఉందని చెప్పారు. తాను హరీశ్‌రావుతో మాట్లాడలేదని సంజయ్ స్పష్టం చేశారు. ఎవరు రాజీనామా చేసి బీజేపీలో చేరినా వారిని గెలిపించుకునే సత్తా బీజేపీ కార్యకర్తలకు ఉందని అన్నారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అనేది ఒక రాజకీయ డ్రామా అని సంజయ్ అన్నారు. బీఆర్‌ఎ్‌సను కాపాడుకోవడానికి కేసీఆర్.. దొంగ హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక ఆ పార్టీ నాయకులను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో తనతో పాటు బీజేపీ కార్యకర్తలను ఏ విధంగా హింసించారో, అక్రమ కేసులు పెట్టి జైలులో వేశారో ఎవరూ మరచిపోలేరని అన్నారు. అభివృద్ధిని చూసి పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారని మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలు.. చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో గెలిపించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వన్ టైం సెటిల్‌మెంట్ ఏమైందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నిరుద్యోగులతో రేవంత్ చర్చలు జరపాలి: శంకర్
డీఎస్సీ వాయిదా వేయాలంటూ ఆందోళన చేస్తున్న నిరుద్యోగులతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరపాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ వైఖరితో విసిగిపోయిన నిరుద్యోగులు అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌ను విశ్వసించి ఓటేశారని, అందుకే ఆయన చొరవ తీసుకోవాలని అన్నారు.
Updated Date - Jul 15 , 2024 | 04:07 AM