BRS: ‘ఫార్ములా-ఈ’పై అసెంబ్లీలో రగడ
ABN, Publish Date - Dec 21 , 2024 | 03:21 AM
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌పై కాగితాలు విసిరారు. దీనికి ప్రతిగా వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కాగితాలు విసిరారు.
చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టిన విపక్షం
స్పీకర్ వైపుగా కాగితాలు, పుస్తకాలు విసిరివేత
విపక్షం దిశగా చెప్పు చూపిన ఎమ్మెల్యే శంకర్
చూసుకుందాం అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు
రెండుసార్లు సభ వాయిదా.. బీఆర్‌ఎస్ వాకౌట్
గందరగోళం మధ్యే భూ భారతి బిల్లు ఆమోదం
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్‌పై కాగితాలు విసిరారు. దీనికి ప్రతిగా వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కాగితాలు విసిరారు. అంతేగాక, తన కాలికి ఉన్న చెప్పు చూపించారు. శంకర్ తమవైపు చెప్పు విసిరే ప్రయత్నం చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. మొత్తమ్మీద, ఫార్ములా ఈ రేసుపై చర్చకు విపక్ష సభ్యుల పట్టుబట్టడంతో సభ రెండుసార్లు వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే అధికారపక్షం భూ భారతి బిల్లుపై చర్చను ప్రారంభించింది. అయితే, విపక్ష బీఆర్‌ఎస్ సభ్యులు ఫార్ములా ఈ కారు అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు.. ‘ప్రభుత్వానికి నిజాయితీ, దమ్ము, చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చ పెట్టాలి’ అని స్పీకర్‌ను కోరారు. అయితే, అది ఒక వ్యక్తికి సంబంధించిన విషయమని, రాష్ట్రానికి సంబంధించింది కాదని.. స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఈ కారు రేస్ అక్రమ కేసు అంటు బీఆర్‌ఎస్ సభ్యులు తమ వెంట తెచ్చుకున్న ప్లకార్డులు ప్రదర్శించారు. అదే అంశంపై చర్చ జరపాలన్న వారి డిమాండ్‌ను స్పీకర్ తిరస్కరించారు. దీంతో బీఆర్‌ఎస్ సభ్యులు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్లకార్డులు చింపి స్పీకర్‌పై విసిరారు. అసెంబ్లీ సిబ్బంది వద్ద ఉన్న పుస్తకాలు లాక్కొని స్పీకర్‌పైకి విసిరేశారు. మార్షల్స్ విపక్ష నేతల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికార, విపక్ష ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు కాగితాలు విసురుకున్నారు. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన కొద్దిసేపటికే మరోసారి వాయిదా పడింది.
చూసుకుందాం రా!
విపక్ష సభ్యులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ పేపర్లు విసిరారు. అంతేకాదు తన కాలు చెప్పు చూపించారు. ఆయన తీరును బీఆర్‌ఎస్ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. బయటకు రా చూసుకుందాం అని అనటంతో.. అధికార, విపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు ‘రా... చూసుకుందాం’ అని సవాళ్లు విసురుకున్నారు. దళిత స్పీకర్‌ను అవమానించిన వారిని సస్పెండ్ చేయాలని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. దొర (కేసీఆర్) కోసం విపక్ష సభ్యులు ఇదంతా చేస్తున్నారన్నారు. అధికార, విపక్ష సభ్యులు ఒకరికి వ్యతిరేకంగా మరొకరు గట్టిగా నినాదాలు చేశారు. వాయిదా అనంతరం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్ష సభ్యులు ఈ కారు రేస్ కేసు అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగకరమైన భూ భారతి బిల్లు ముఖ్యమైనదని, ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత బీఆర్‌ఎస్ సభ్యుల్ని తన ఛాంబర్‌కు పిలిచి మాట్లాడుతానని చెప్పారు. అయినా... బీఆర్‌ఎస్ సభ్యులు వెనక్కి తగ్గలేదు.
హరీశ్‌రావును ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ... హరీశ్! మీరు సీనియర్‌సభ్యులు. ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కావాలని సభాసమయం వృథా చేస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల్ని అడ్డుకునేందుకు విరామం తర్వాత మార్షల్స్‌ను మోహరించారు. దీంతో అధికారపక్షం వైపు నుంచి హరీశ్ రావు స్పీకర్ పోడియం వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన్ను అడ్డుకున్నారు. ఈ గందరగోళం మధ్యే మంత్రి పొంగులేటి భూ భారతి బిల్లుపై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పదే పదే సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మార్షల్స్‌ను తోసుకుని పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘కౌశిక్! జాగ్రత్త. ఒక సంవత్సరం సస్పెండ్ చేస్తా’ అని హెచ్చరించారు. బీజేపీ సభ్యుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో ‘బడే భాయ్... చోటే భాయ్’ అంటూ కౌశిక్ రెడ్డి నినాదాలు చేశారు. విరామం అనంతరం మధ్యాహ్నం 1.30 నిమిషాలకు సభ తిరిగి ప్రారంభమైంది. మళ్లీ బీఆర్‌ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ‘తానాషాహీ నహీ చలేగా’ (నియంతృత్వం చెల్లదు) అంటూ నినాదాలు చేశారు. 40 నిమిషాలపాటు నిరసన కొనసాగించిన విపక్ష సభ్యులు ఆ తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు.
వారి సభ్యత్వం రద్దుచేయాలి: కాంగ్రెస్
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుచూస్తే ఇది తెలంగాణకు చీకటిరోజుగా భావిస్తున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఆదిశ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దళిత సామాజికవర్గానికి చెందిన స్పీకర్‌పై అవమానకరంగా కాగితాలు వేస్తూ.. అగ్రకుల దురహంకారం చూపించారన్నారు. ఈ మేరకు హారీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి, కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వెల్‌లోకి వచ్చి స్పీకర్‌ను అవమానించిన వారి సభ్యత్వాలను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో హరీశ్‌రావు రౌడీలాగా ప్రవర్తించారని.. సభలో ఏ అంశంపై చర్చ పెట్టినా బీఆర్‌ఎ్‌సకు నష్టం కలిగించడమే లక్ష్యంగా ఆయన ప్లాన్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్‌ను భ్రష్టుపట్టించి, పార్టీపగ్గాలు చేపట్టాలని హరీశ్ భావిస్తున్నారన్నారు.
దమ్ముంటే గలాటా వీడియో విడుదల చేయాలి: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
సభ జరుగుతున్నంతసేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని, తమపైకి పేపర్లు, బాటిల్స్ విసరడంతోపాటు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివా్‌సయాదవ్, వివేకానంద, జి.జగదీ్‌షరెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే అసెంబ్లీలో జరిగిన గలాటా వీడియోలు బయట పెట్టాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, ప్రజా సమస్యలను పక్కదోవ పట్టించేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని, ఇటువంటి డొల్ల కేసులు తమను ఏమీ చేయలేవన్నారు.
నేను కిందపడ్డ పేపర్‌ను తీశానంతే: వీర్లపల్లి శంకర్
తనపై బీఆర్‌ఎస్ నేతలు కుట్ర పన్నారని, అసెంబ్లీలో తాను చెప్పు తీయలేదని, కిందపడ్డ పేపర్‌నే తీశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ పేర్కొన్నారు. శాసనసభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పేపర్లు చింపుతూ మంత్రి పొంగులేటి వద్దకు వచ్చారని, ఆయన్ను డిస్ట్రబ్ చేసే ప్రయత్నం చేశారని, దీంతో కౌశిక్‌ను ఆపేందుకే తాను పేపర్‌ను విసిరానని వివరించారు. సభలో జరిగిన గొడవపై అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. బీఆర్‌ఎస్ వాళ్లు ఆరోపిస్తున్నట్లుగా తానేమీ చెప్పు తీయలేదని, కింద పడ్డ పేపర్‌ను తీశానన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద విసిరిన పుస్తకం స్పీకర్‌కు తగిలిందన్నారు.
మండలిలో వాయిదాల పర్వం
హైదరాబాద్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): శాసనమండలి సమావేశాలు మరోసారి వాడీవేడిగా జరిగాయి. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఆ పార్టీ సభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. చైర్మన్ సర్దిచెప్పినా వినకుండా వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన కొనసాగిచారు. దీంతో శుక్రవారం శాసనమండలి పలుమార్లు వాయిదా పడింది. సభను శనివారానికి వాయిదా వేసినట్టు ప్రకటించారు.
Updated Date - Dec 21 , 2024 | 03:21 AM