TG News: న్యాప్‌కిన్లకు నిధుల కొరత..
ABN, Publish Date - Jul 08 , 2024 | 03:15 AM
బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు.
నిరుటి నుంచి విద్యాసంస్థల్లో నిలిచిన పంపిణీ
8-12వ తరగతుల బాలికలకు తీవ్ర ఇబ్బందులు
రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షలమంది విద్యార్థినులు
ఏడాదికి 25-30 కోట్లు అవసరమని అంచనా
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): బాలికల ఆరోగ్య సంరక్షణలో భాగంగా నెలసరి సమయంలో ఇచ్చే శానిటరీ న్యాప్‌కిన్ల పంపిణీ ఏడాది కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వీటిని కొనుగోలు చేసి విద్యాశాఖకు పంపితే, అక్కడి అధికారులు అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాల విద్యార్థినులకు అందించేవారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ వద్ద నిధుల కొరత కారణంగా న్యాప్‌కిన్స్ కొనుగోలు చేయడం లేదు. వాస్తవానికి ఈ పథకం కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అమలు చేస్తోంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఈ పథకం అమలు కోసం నిధులు కూడా కేటాయిస్తున్నారు.
గతంలో రాష్ట్రప్రభుత్వం తాము ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పీఐపీ (ప్రొగ్రామ్ ఇప్లిమెంట్ ప్లాన్)లో కూడా ఎన్‌హెచ్‌ఎమ్‌కు ప్రజెంటేషన్ ఇచ్చి మరీ నిధులు తెచ్చుకుంది. ఎన్‌హెచ్‌ఎమ్ కూడా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన హెచ్‌ఎల్‌ఎల్ హెల్త్‌కేర్ నుంచి ఈ న్యాప్‌కిన్స్‌ను కొనుగోలు చేయాలని సూచించింది. తొలుత మనదగ్గర హెచ్‌ఎల్‌ఎల్ దగ్గరి నుంచే కొనుగోలుచేశారు. తర్వాత ఆ కంపెనీకి బిల్లులు నిలిపివేయడంతో వారు డబ్బులు కోసం కోర్టును ఆశ్రయించారు. ఇదిలావుంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు విధిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినిల కోసం న్యాప్‌కిన్స్ కొనుగోలు చేసి ఉచితంగా అందించాలని సుప్రీంకోర్టులో పిల్ కూడా వేశారు. సుప్రీం ఆదేశాలతో మెజారిటీ రాష్ట్రాలు న్యాప్‌కిన్స్ కొనుగోలు చేసి పాఠశాల విద్యార్థినిలకు పంపిణీ చేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటిలో 8 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినుల సంఖ్య 11 లక్షల వరకు ఉంది. నెలసరి సమయంలో కనీసం ఆరు న్యాప్‌కిన్స్ అవసరం అవుతాయని, అలా ఒక్కో విద్యార్థినికి ఏడాదికి 72 న్యాప్‌కిన్స్ అవసరమవుతాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. మొత్తం 11 లక్షల మంది కోసం కొనుగోలు చేయాల్సివస్తే సుమారు రూ.25-30 కోట్ల వరకు అవుతుందని అంచనా. కానీ ఆ నిధులు కూడా మన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వద్ద లేవు. ఇప్పటికే ఎంసీహెచ్ కిట్(గతంలో కేసీఆర్ కిట్) పంపిణీతో పాటు గర్బిణీలకు రెండుసార్లు ఇచ్చే న్యూట్రియంట్ కిట్స్‌ను కూడా నిలిపివేసింది.
Updated Date - Jul 08 , 2024 | 03:15 AM