Ganta Srinivasa Rao: ‘తెలుగు’ రాజకీయాలను శాసించేది కాపులే!
ABN, Publish Date - Dec 16 , 2024 | 06:09 AM
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.
పార్టీలు వేరైనా కాపులంతా కలిసికట్టుగా ఉండాలి
ఏపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
కేసముద్రం (మహబూబాబాద్ జిల్లా), డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసించే శక్తి ఒక్క మున్నూరు కాపులకే ఉందని ఆంధ్రప్రదేశ్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమినాపురంలో మూన్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఎంకే కన్వెన్షన్‌ను సంఘం అధ్యక్షుడు చందా గోపితో కలిసి గంటా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోని కాపుల్లో రకరకాల పేర్లతో విభజించి ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని, అన్ని రకాల కాపులు ఒక్కటేనని పేర్కొన్నారు. పార్టీలు వేరైనా మున్నూరుకాపులంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు.
ఇక్కడి కన్వెన్షన్ హాల్ ఇరు రాష్ట్రాల కాపులకు ఆదర్శంగా ఉందని, ఈ హాలుకు రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, గాయత్రి గ్రానైట్స్ అధినేత వద్దిరాజు కిషన్, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, దాస్యం వినయభాస్కర్, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 16 , 2024 | 06:09 AM