Phone tapping case: ప్రభాకర్‌రావు, రాధాకిషన్ విచారణకు అనుమతి
ABN, Publish Date - Jul 12 , 2024 | 04:42 AM
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
మరికొంత కాలం అమెరికాలోనే ప్రభాకర్‌రావు.. వీసీ, టెలికాన్ఫరెన్స్ విచారణపై త్వరలో నిర్ణయం
చార్జ్‌షీట్ తిరస్కరణ.. తిరిగి దాఖలు..!
నిందితుల ‘డీఫాల్ట్ బెయిల్’పై నేడు తీర్పు
హైదరాబాద్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావును విచారించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ విషయంలో దర్యాప్తు అధికారుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హోంశాఖ ముఖ్య కార్యదర్శి.. న్యాయశాఖతో సంప్రదింపులు జరిపాక ఈ మేరకు అనుమతినిచ్చినట్లు తెలిసింది. వీరిద్దరూ విశ్రాంత అధికారులు కాగా.. మిగతా ముగ్గురు-- ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో.. విశ్రాంత అధికారుల ప్రాసిక్యూషన్‌కు మాత్రమే అనుమతి లభించినట్లు తెలుస్తోంది. కాగా.. క్యాన్సర్‌తో బాధపడుతున్న పభాకర్‌రావు అమెరికాలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే..! తాను ఇప్పట్లో భారత్‌కు రాలేనని, అవసరమైతే వీడియో/టెలి కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని పేర్కొంటూ దర్యాప్తు అధికారులకు ఇటీవల ఈ-మెయిల్ పంపారు. ఈ అంశంపై దర్యాప్తు అధికారులు త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం.
మరోమారు చార్జ్‌షీట్ తిరస్కరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో మరోమారు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అధికారులు ఇప్పటికే రెండు సార్లు చార్జ్‌షీట్‌లను సమర్పించగా.. కోర్టు తిరసర్కించిన విషయం తెలిసిందే..! తాజాగా మరోమారు దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరించింది. చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఆధారాల్లో కొన్నింటిని కోర్టుకు సమర్పించకపోవడంతో జడ్జి అభియోగపత్రాలను తిరస్కరించారు. దీంతో రిమాండ్‌లో ఉన్న రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు ‘డీఫాల్ట్ బెయిల్’ పిటిషన్ దాఖలు చేశారు. తమను అరెస్టు చేసి 100 రోజులు పూర్తయిందని, ఇప్పటికీ చార్జ్‌షీట్ దాఖలు చేయనందున డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న జడ్జి.. తీర్పును శుక్రవారానికి వాయిదా వేశారు.
Updated Date - Jul 12 , 2024 | 04:42 AM