Hyderabad: గ్రూప్-1 మెయిన్స్ 7 రోజులు..
ABN, Publish Date - Jun 13 , 2024 | 03:52 AM
గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి.
అక్టోబరు 21 నుంచి 27 దాకా పరీక్షల నిర్వహణ
మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకూ!
అక్టోబరు 21వ తేదీన జనరల్ ఇంగ్లిష్ పరీక్ష
అన్ని పరీక్షలూ ఒకే మాధ్యమంలో రాయాలి
అభ్యర్థులకు కమిషన్ అధికారుల సూచనలు
త్వరలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 దాకా.. వరుసగా ఏడు రోజుల పాటు నిర్వహించాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అధికారులు నిర్ణయించారు. రోజూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల దాకా పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మాధ్యమాల్లో నిర్వహిస్తున్నారు. అయితే... అభ్యర్థులు అన్ని పరీక్షలనూ ఏదో ఒక మీడియంలోనే రాయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సమయంలోనే ఏ మీడియంలో రాసేదీ తెలపాల్సి ఉంటుంది. ఒక పరీక్ష తెలుగులో, మరో పేపర్‌ను ఇంగ్లి్‌షలో రాయడానికి వీల్లేదు. అలా వేర్వేరు మాధ్యమాల్లో రాసినవారి పేపర్లను పరిగణనలోకి తీసుకోరు. రాష్ట్రంలో సుమారు 563 గ్రూపు-1 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను త్వరలోనే ప్రకటించనున్నారు. అందులో ఉత్తీర్ణులైనవారిని.. ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌లో ప్రతిభ కనబరిచే అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నియామకాల్లో ఏలాంటి ఇంటర్య్వూలూ ఉండవు. మెయిన్ పరీక్షలకు సంబంధించిన వివరాలను కమిషన్ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పరీక్షల తొలిరోజు అయిన అక్టోబరు 21న క్వాలిఫైయింగ్ టెస్ట్ (జనరల్ ఇంగ్లిష్ పరీక్ష) నిర్వహించనున్నారు. అనంతరం ఇతర పేపర్ల పరీక్షలను నిర్వహిస్తారు. క్వాలిఫైయింగ్ టెస్ట్ కాకుండా మెయిన్స్‌లో మొత్తం 6 పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తున్నారు.
పరీక్షలన్నీ హైదరాబాద్, దాని చుట్టు పక్కల హెచ్‌ఎండీఏ పరిధిలోనే జరుగుతాయి. ప్రతిపేపర్‌లోనూ 150 మార్కులకు ప్రశ్నలుంటాయి.
అభ్యర్థులు అన్ని పేపర్లూ రాయాల్సి ఉంటుంది. ఏ ఒక్క పరీక్షకు గైర్హాజరైనా ఆ అభ్యర్థులు రాసిన ఇతర పేపర్లను పరిగణనలోకి తీసుకోరు.
క్వాలిఫయింగ్ పరీక్షను 10వ తరగతి ప్రమాణాలతో నిర్వహిస్తారు. ఇతర పేపర్ల పరీక్షలకు సంబంధించిన సిలబ్‌సను ఇప్పటికే ప్రకటించారు.
గ్రూప్-1 ప్రిలిమినరీ కీ విడుదల
ఈ నెల 9వ తేదీన నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కీని విడుదల చేశారు. గురువారం (13వ తేదీ) నుంచి 17వ తేదీ మధ్య ఈ కీ కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. కీపై అభ్యంతరాలుంటే.. 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తెలపాల్సిందిగా అభ్యర్థులకు అధికారులు సూచించారు.
Updated Date - Jun 13 , 2024 | 03:52 AM