ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: రేవంత్‌ది దైవద్రోహం..

ABN, Publish Date - Aug 23 , 2024 | 04:04 AM

వంద శాతం రుణమాఫీ చేస్తానంటూ సీఎం రేవంత్‌ దేవుళ్లపై ఒట్టేసి మాటతప్పారని.. రైతులను మోసం చేయడమే కాక, దైవద్రోహానికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.

  • రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు

  • గుళ్లలో ముక్కు నేలకు రాసి పాపపరిహారం చేసుకోవాలి.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి

  • 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జనగామ రైతు ధర్నాలో హరీశ్‌రావు ధ్వజం

  • అందరికీ మాఫీ చేసేవరకూ వదలం.. రేవంత్‌.. దమ్ముంటే రా తేల్చుకుందాం: కేటీఆర్‌

  • సూర్యాపేట తిరుమలగిరిలో కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ

(‘ఆంధ్రజ్యోతి’ న్యూస్‌నెట్‌వర్క్‌): వంద శాతం రుణమాఫీ చేస్తానంటూ సీఎం రేవంత్‌ దేవుళ్లపై ఒట్టేసి మాటతప్పారని.. రైతులను మోసం చేయడమే కాక, దైవద్రోహానికి పాల్పడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఏ ఒక్క గ్రామంలోనైనా 100 శాతం రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని పేర్కొన్నారు. 54 శాతం మందికి కూడా రుణమాఫీ కాలేదన్న ఆయన.. ఈ విషయాన్ని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, రేవంత్‌ ఏ మండలానికి ఏ ఊరుకు వస్తారో రావాలని సవాల్‌ చేశారు. నేరుగా రైతులవద్దకే వెళ్లి వంద శాతం రుణమాఫీ జరిగిందో లేదో అడుగుదామన్నారు.


ప్రభుత్వం చేపట్టిన రూ.2 లక్షల రుణమాపీ పూర్తిస్థాయిలో జరగలేదని నిరసన వ్యక్తం చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో, జనగామ జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన రైతు ధర్నాల్లో హరీశ్‌ పాల్గొన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేస్తానంటూ కొమురవెల్లి మల్లన్న, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిపై ఒట్టు వేశారని గుర్తుచేశారు. మాటతప్పినందుకు.. వెంటనే సీఎం దేవుళ్ల ఎదుట ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలని.. దేవుళ్లకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రుణమాఫీపై యాదగిరి గుట్ట ఆలయం నుంచి యాత్ర మొదలుపెట్టామని.. రేవంత్‌ ఒట్టేసిన అన్ని ఆలయాలకూ ఈ యాత్రలో భాగంగా వెళ్తామని చెప్పారు.


రేవంత్‌ను క్షమించాలంటూ యాదగిరిగుట్టలో లక్ష్మీనృసింహస్వామికి పూజలు చేశామని చెప్పారు. దేవుళ్లను మోసం చేసిన ముఖ్యమంత్రి బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. మరోవైపు.. ఎలాంటి ఆంక్షలూ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేవరకూ ప్రభుత్వాన్ని వదలబోమని.. పోరాటాన్ని ఆపబోమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. రుణమాఫీ కోసం అధికారుల చుట్టూ తిరగొద్దని.. హామీ ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ నాయకులను ఊరూరా నిలదీసి అడగాలని రైతులకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఆయన రైతు నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు.


సీఎం సొంత ఊరైన కొండారెడ్డి పల్లెలోనూ పూర్తిగా రుణమాఫీ కాలేదని విమర్శించారు. మాఫీ మొత్తాన్ని రూ.49 వేల కోట్ల నుంచి రూ.7500 కోట్లకు తగ్గించారని ధ్వజమెత్తారు. ‘‘ప్రభుత్వం వచ్చి 8 నెలలైంది. రేవంత్‌రెడ్డీ.. నీ పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసు. సమయానికి విత్తనాలు, ఎరువులు అందుతున్నాయా లేవా? మద్దతు ధర లభిస్తోందా? రుణమాఫీ అయిందా? బోనస్‌, రైతుబంధు లభిస్తున్నాయా లేదా? ..అన్నీ రైతులే చెబుతారు. నీవు ఏ ఊరికి వస్తావో రా.


దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా. తేల్చుకుందాం’’ అని సవాల్‌ చేశారు. రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్ల మీద ఒట్లేసి.. చేయకుండా సీఎం దైవద్రోహానికి పాల్పడ్డారని విమర్శించారు. మనుషులనే కాక దేవుళ్లను కూడా రేవంత్‌ మోసం చేశారని ఆరోపించారు. పాలన సక్రమంగా లేదన్న పాపానికి సబితక్కపై రేవంత్‌ పగబట్టాడని.. ఆమెను నిండు శాసనసభలో అవమానించాడని దుయ్యబట్టారు. రుణమాపీ అమలు విషయంలో ప్రజాభిప్రాయసేకరణ కోసం సీఎం సొంతూరికి వెళ్లిన మహిళా జర్నలి్‌స్టలపై కాంగ్రెస్‌ గుండాలతో దాడులు చేయిస్తూ అసభ్యంగా ప్రవర్తించారని నిప్పులు చెరిగారు.


  • హరీశ్‌పై గుట్టలో కేసు నమోదు

యాదగిరీశుడి ఆలయ మాఢవీధుల్లో ఆయన ఓ ప్రైవేట్‌ పూజారితో పూజలు నిర్వహించారన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ మాఢవీధుల్లో తూర్పురాజగోపురం వద్ద హరీశ్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు ఆలయంతో సంబంధం లేని ఒక పూజారితో పూజలు చేయించారు. దీంతో ఆలయ ఈవో భాస్కర్‌రావు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ నేతలు అపవిత్రం చేశారంటూ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యతోపాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆలయాన్ని నీటితో శుద్ధిచేశారు.


  • ఉద్యమకాల నిరసనలు.. మళ్లీ చేస్తాం

తెలంగాణ ఉద్యమ కాలంలో చేసిన అన్ని రకాల నిరసనలూ మళ్లీ చేస్తామని కేటీఆర్‌ అన్నారు. చేవెళ్ల రైతు దీక్ష సందర్భంగా మీడియాతో చిట్‌చాట్‌ చేసిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుందని తాము అనుకోవట్లేదని తెలిపారు. బీసీలకు 42 శాతం సీట్లిస్తామన్న కాంగ్రెస్‌ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. అప్పులపై రేవంత్‌ సర్కారు దుష్ప్రచారం చేస్తోందన్న ఆయన.. రాహుల్‌, రేవంత్‌ మధ్య చాలా విభేదాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాన్ని మాదిగలకు ఇస్తానని చెప్పి మోసం చేసి.. అభిషేక్‌ మను సింఘ్వికి ఇచ్చారని విమర్శించారు. తెలంగాణలో అదానీతో ఒప్పందాలు చేసుకున్న రేవంత్‌.. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేయడం హాస్యాస్పదమని ట్వీట్‌ చేశారు.


  • నినాదాలు.. ప్రతినినాదాలు..

రైతులందరికీ రుణమాఫీ చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ నేతలు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు నిర్వహించారు. అయితే, సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన నిరసనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ మాట్లాడుతుండగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు డౌన్‌డౌన్‌ నినాదాలు చేశారు. వారికి ప్రతిగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై గుడ్లు, రాళ్లు విసిరారు. వారు అట్నుంచీ చెప్పులు విసిరారు. పరిస్థితి శ్రుతి మించడంతో పోలీసులు లాఠీలు ఝుళిపించి ఇరువర్గాలనూ చెదరగొట్టారు.

Updated Date - Aug 23 , 2024 | 04:04 AM

Advertising
Advertising
<