T. Harish Rao: కారం మెతుకులతో కడుపు నింపుకోవాలా?
ABN, Publish Date - Aug 05 , 2024 | 03:29 AM
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సర్కారీ బడి పిల్లల గతి ఇంతేనా?
బిల్లుల పెండింగ్ వల్లే దుస్థితి: హరీశ్
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు కారం మెతుకులతో కడుపు నింపుకోవాల్సిందేనా.. మధ్యాహ్న భోజనంలో ఏం పెడుతున్నారు.. పిల్లలకు అందించే మెనూపై ప్రభుత్వం స్పందించాలని మాజీమంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం, నూనెతో అన్నం తిని కడుపు నింపుకొన్నారని ఓ ఫొటోను ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు.
విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అటకెక్కించిన ప్రభుత్వం, ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలోనూ విఫలమైందన్నారు. భోజన సామగ్రి బిల్లులు, కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు పెండింగ్ ఉండడంవల్ల విద్యార్థులకు సరైన భోజనం అందించలేని దుస్థితి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీశ్ రావు కోరారు.
Updated Date - Aug 05 , 2024 | 03:29 AM