Mohan Babu: జర్నలిస్టుపై దాడి కేసు.. మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:53 AM
జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం
హైకోర్టుకు మోహన్‌బాబు లాయర్ల విన్నపం
విలేకరిని కొట్టారు, గొంతు పట్టి పిసికారు
హత్యాయత్నమే: జర్నలిస్టు తరఫు వాదనలు
పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు
సుప్రీంలో అదృష్టం పరీక్షించుకొనే అవకాశం
హైదరాబాద్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సినీ నటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మోహన్‌బాబు ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల నేపథ్యంలో జల్‌పల్లిలో ఉన్న మోహన్‌బాబు ఇంటికి వార్తల కవరేజీ కోసం వెళ్లిన తనపై మోహన్‌బాబు దాడి చేశారని పేర్కొంటూ జర్నలిస్టు రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. మోహన్‌బాబు తరఫున న్యాయవాది వాదిస్తూ, 78 ఏళ్ల వయస్సులో మోహన్‌బాబు గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్నారని, నిరంతరం వైద్యుల పర్యవేక్షణ అవసరమని చెప్పారు. మోహన్‌బాబు దుబాయిలో మనుమడిని చూసి వచ్చాక, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారని వెల్లడించారు. తన విద్యా సంస్థల పర్యవేక్షణ కోసం తిరుపతి వచ్చారని చెప్పారు. ముందస్తు బెయిలు పిటిషన్‌ను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు.
డిసెంబరు 10న మోహన్ బాబు తనయుడు మంచుమనోజ్ విజ్ఞప్తి మేరకు ఆయన వెంట మీడియా మోహన్‌బాబు ఇంటికి రాగా ఆయన ఒక విలేకరి దగ్గరున్న మైక్‌ను లాక్కొని తల మీద కొట్టారు. తీవ్ర గాయాల పాలైన విలేకరిని ఆస్పత్రిలో చేర్చారు. రాచకొండ పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సోమవారం వాదనల సందర్భంగా జర్నలిస్టు రంజిత్ తరఫు న్యాయవాది వాదిస్తూ, మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని కోరారు. జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా గొంతు పట్టి నులిమారని చెప్పారు. ఈ మేరకు ఇరు వర్గాలు అఫిడవిట్లు దాఖలు చేశాయి. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం మోహన్‌బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. క్రిమినల్ కేసు కావడంతో డివిజన్ బెంచ్‌కు అప్పీలు చేసే అవకాశం లేదు. ముందస్తు బెయిలు కోసం మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తప్ప మార్గం లేదు. మోహన్‌బాబు ఈ నెల 24 లోపు పోలీసుల ముందు హాజరు కావాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో ప్రయత్నం చేసిన అనంతరం మోహన్‌బాబు పోలీసుల ముందు హాజరవుతారని భావిస్తున్నారు.
Updated Date - Dec 24 , 2024 | 04:53 AM