Share News

Heavy rainfall: జలదిగ్బంధం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:05 AM

రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో.. సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది.

Heavy rainfall: జలదిగ్బంధం..

  • రాష్ట్రవ్యాప్తంగా రోజంతా దంచికొట్టిన వాన

  • ఖమ్మం అతలాకుతలం

  • 23 చోట్ల.. 25 సెంటీమీటర్లకు పైగా వర్షం!

  • మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి,

  • చిన్నగూడురులో అత్యధికంగా 45 సెం.మీ.

  • వర్షం దెబ్బకు అతలాకుతలమైన జనజీవనం

  • 15 మందికిపైగా మృతి.. పలువురి గల్లంతు

  • వేలాది గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

  • నేడు, రేపు కొన్ని జిల్లాల్లో భారీ, అతిభారీ వర్షాలు

  • పెదవాగుకు మళ్లీ గండి.. తెగిన 220 చెరువులు

ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఒకటే వర్షం! రాష్ట్రం మొత్తమ్మీదా ఆదివారం వర్షం కురవని మండలం ఒక్కటి కూడా లేదు!! నిలిచి కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో కాలువలకు గండ్లు పడ్డాయి! చెరువులు అలుగులు పారాయి. చెక్‌డ్యాములు, జలాశయాలు మత్తడి దుంకాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. ఊర్లన్నీ ఏరులయ్యాయి. వాగులు పొంగి పొర్లి దారులను ముంచెత్తడంతో చాలా గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి!! హైదరాబాద్‌-విజయవాడ మధ్య.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు.. రాకపోకలు నిలిచిపోయాయి. వాగుల్లో కొట్టుకుపోయి.. వాన నీటిగుంతల్లో పడి.. 15 మందికిపైగా చనిపోయారు. పలువురి ఆచూకీ గల్లంతయ్యింది. జలదిగ్బంధంలో చిక్కుకుపోయి ప్రాణాలు అరచేతబట్టుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నవారు ఎందరో!! వర్షాల దెబ్బకి తెలుగు రాష్ట్రాల్లో 80 రైళ్లు పూర్తిగా, 5 రైళ్లు పాక్షికంగా రద్దయ్యాయి. 49 రైళ్లను దారి మళ్లించారు. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడం.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేయడం ఆందోళన కలిగిస్తోంది.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో రోజంతా వర్షం పడుతూనే ఉండడంతో.. సగటు వర్షపాతం 9.82 సెంటీమీటర్లుగా నమోదైంది. కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 52 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకాగా.. 25 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం 23 ప్రాంతాల్లో నమోదయిందని వాతావరణ శాఖ తెలిపింది. 20 సెంటీమీటర్లకుపైగా వాన 40 మండలాల్లో కురవగా.. 88 మండలాల్లో 11-20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం, 277 మండలాల్లో భారీ వర్షాలు, 199 మండలాల్లో మధ్యస్థ వర్షపాతం నమోదు అయినట్లు వెల్లడించింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురవని మండలమంటూ ఏదీ లేదని పేర్కొంది. ఈ భారీ, అతిభారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. వేలాది గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి. రోడ్లు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది. దాంతో కొన్నిచోట్ల కూరగాయలు, పాలు, పండ్ల ధరలు పెరిగాయి.


ఖమ్మంలో ఉప్పొంగిన మున్నేరు

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పలు వాగులు, ఏర్లు పొంగి ప్రవహించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఖమ్మం నగరం వద్ద మున్నేరుకు ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో 36 అడుగుల వరద రావడంతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాల్లోని వేలాది ఎకరాల పంటలు జలమయయ్యాయి. ఆకేరు నది కూడా భారీగా పొంగి ప్రవహించింది. ఆదివారం ఉదయం కూసుమంచి మండలంలో రికార్డు స్థాయిలో 31.5సెం.మీ వర్షం కురిసింది. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం వద్ద పాలేరు వరద ప్రవాహంలో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు.


వారిలో ఒకరిని కూసుమంచి పోలీసులు రక్షించారు. మధిర మండలం దెందుకూరులో గేదెలను మేతకు తోలుకెళ్లిన పద్మావతి (34) అనే మహిళ శనివారం వరదలో కొట్టుకుపోగా రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద ఆదివారం ఆమె మృతదేహం లభించింది. ఎర్రుపాలెం మండలం భవానిపురానికి చెందిన మనిశెట్టి సాంబశివరావు(20) శనివారం స్థానిక భీమవరం వాగులో గల్లంతు కాగా ఆదివారం అతడి మృతదేహం లభించింది. భారీవర్షాల నేపథ్యంలో జిల్లాలో 39పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి 7,090 మందిని తరలించారు.


జిల్లాలో కురిసిన వర్షాలు, పొంగిన వరదల కారణంగా సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. పంట పొలాలతోపాటు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇక.. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ సాయిబులగుంపు గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు కల్లూరి నీలమయ్య(70), తాటి ఆదెమ్మ(68) వాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. వారు పెంచుకుంటున్న 30 ఆవులు, 100 మేకలూ మృత్యువాతపడ్డాయి. భద్రాద్రి జిల్లా మణుగూరును వరద చుట్టుముట్టింది. ఆ పట్టణంలో.. నందికోళ్ల రాము (30) అనే వికలాంగురాలు వరదలో మునిగి మృతిచెందింది.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో..

కరీంనగర్‌ జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగిపొర్లాయి. శంకరపట్నం మండలం అంబాలాపూర్‌ గ్రామంలో ఊర చెరువుకు గండిపడడంతో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టువాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల కారణంగా.. శ్రీరాంపూర్‌, మందమర్రి, బెల్లంపల్లి సింగరేణి డివిజన్‌లలోని ఓపెన్‌ కాస్టు గనుల్లో బొగ్గు తవ్వకాలు, ఓబీ మట్టి తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. మూడు ఏరియాల్లోని శ్రీరాంపూర్‌, ఇందారం, రామకృష్ణాపూర్‌, మందమర్రి, గోలేటి, కైరిగూడ ఓసీపీల్లో రూ.13 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లగా, రూ. 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబీ వెలికితీత పనులు నిలిచిపోయాయి.


  • ఉమ్మడి పాలమూరు జిల్లాలో..

వాగులు, వంకలు పొంగి పొరలడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో.. రెండువైపా ఇరువైపులా ఘాట్‌ రోడ్డుపై కొండ చరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పడిన మట్టి, పెద్దపెద్ద కొండ రాళ్లను స్థానిక పోలీసులు, ఎన్‌హెచ్‌ఏ అధికారులు, స్థానికుల సహకారంతో ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. అయితే.. రాత్రి వేళ, వాహనాల రాకపోకలు లేని సమయంలో కొండ చరియలు విరిగిపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ వైపు నుంచి శ్రీశైలానికి వెళ్లే వాహనాలను పోలీసు, రెవెన్యూ, అటవీశాఖ అధికారులు మన్ననూర్‌ నుంచే వెనక్కి పంపిస్తున్నారు. కొద్ది రోజులపాటు శ్రీశైలానికి రాకపోకలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు.


ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..

ఆగకుండా కురుస్తున్న వర్షానికి ఈసీ, మూసీ నదులు ఉప్పొంగాయి. వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రహదారులన్నీ జలమయం కావడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఫరూక్‌నగర్‌ మండలం దేవనపల్లి గ్రామంలో చేపలు పట్టేందుకు చెరువులోకి దిగిన శేఖర్‌ అనే వ్యక్తి దుర్మరణంపాలయ్యాడు. వర్షపు నీటి గుంటలో పడి ఒక బాలుడు మృతిచెందాడు. బషీరాబాద్‌ మండలం, జీవన్గిలోని మహదేవ లింగేశ్వర దేవాలయం జలగిగ్భంధంలో ఉండిపోయింది. కాగ్నా నది ఉధృతంగా ప్రవహించడంతో ఒడ్డున ఉన్న ఈ దేవాలయం సగానికి పైగానే మునిగిపోయింది. తాండూరు పరిధిలో అల్లాపూర్‌ వాగులో వరద ఉధృతికి ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడి నదిలో కొట్టుకుపోయిన డ్రైవర్‌, క్లీనర్‌ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.


ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో..

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ, అతి భారీ వర్షాలతో వాగులు, వంకలు, చెరువులు వరద ఉధృతితో ప్రవహిస్తున్నాయి. రాజంపేట మండలం గుడితండా గ్రామంలో ప్రభుత్వ పాఠశాల గోడ కూలింది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారులో గల ఎగువ మానేరు ప్రాజెక్టులో గ్రామానికి చెందిన కైరం కొండ శివ రాములు(55) అనే మత్సకారుడి ఆచూకీ గల్లంతయ్యింది. ఆదివారం ఉదయం మానేరు ప్రాజెక్టులో చేపలు పట్టేందుకు వెళ్లిన శివరాములు వరద ఉధృతికి నీటిలో మునిగి కనిపించకుండాపోయాడు. అతడు ఉపయోగించిన తెప్ప, వల ఒడ్డుకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో..

ఉమ్మడి నల్గొండ జిల్లాను జోరువాన ముంచెత్తుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన జాతీయ రహదారులతోపాటు, రాష్ట్ర రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లలోకి మోకాళ్లలోతు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. పలు చోట్ల చెట్లు విరిగి, విద్యుత్‌ స్తంభాలపై పడడంతో సరఫరా నిలిచిపోయి పల్లెల్లో అంధకారం నెలకొంది. సూర్యాపేట జిల్లా కోదాడలో వరద ప్రవాహంలో చిక్కుకొని నాగం రవి (55), యర్రమల్ల వెంకటేశ్వర్లు (55) అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.


అలాగే.. వాహనాల వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లు భారీ వర్షం కారణంగా కనిపించక.. కారుతో వాటిని ఢీకొని ఒక వ్యక్తి మరణించాడు. సూర్యాపేట పట్టణంలోని రాజీవ్‌పార్క్‌ సమీపంలో శనివారం అర్ధరాత్రి తర్వాత జరిగిందీ ఘటన. నల్లగొండ జిల్లాలో 498 ఎకరాల్లో వరి, పత్తి పంటలు మునిగి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ గుర్తించింది. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద పాలేరు బ్యాక్‌ వాటర్‌ జాతీయ రహదారి 65పైకి చేరడంతో తెలంగాణ-ఏపీ మధ్య రాకపోకలు బంద్‌ అయ్యాయి. అలాగే.. కోదాడ మండలంలోని నల్లబండగూడెం గ్రామం వద్ద 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఉన్న బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో హైదరాబాద్‌- విజయవాడ రాకపోకలు నిలిచిపోయాయి.


హైదరాబాద్‌ను కుదిపేసిన వర్షం

హైదరాబాద్‌ నగరాన్ని శనివారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కుదిపేస్తోంది. వర్షాలతో రాజధానిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంబర్‌పేట బతుకమ్మకుంట, విఠల్‌వాడి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌, మహదేవపురం, యూసు్‌ఫగూడ, సరూర్‌నగర్‌, షేక్‌పేట, బండ్ల గూడ, మలక్‌పేట ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరదనీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


అయితే, ఆదివారం సెలువురోజు కావడం... భారీ వర్షాలున్నాయనే అధికారుల ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో నగరజనం చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ప్రధానరహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి. భారీ వర్షాలతో హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారింది. నీటి మట్టం ఫుల్‌ ట్యాంక్‌లెవల్‌ దాటడంతో తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు. మూసీలో వరద ఉదృతంగా ప్రవహిస్తుండంతో నీరు మూసారాంబాగ్‌ బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. 20కి పైగా ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలాయి. 50కిపైగా విద్యుత్‌స్తంభాలు నేలకూలాయి. విద్యుత్‌తీగలు తెగిపోవడంతో గంటల కొద్ది విద్యుత్‌సరఫరా నిలిచిపోయి చీకట్లు కమ్ముకున్నాయి.


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలతో తండ్రి, కూతురు సహా ఆరుగురు మృతి చెందారు. కొత్తగూడలో ఒక యువకుడు వాగులో కొట్టుకుపోతుంటే రెవెన్యూ సిబ్బంది కాపాడారు. ఇల్లు కూలి ఇద్దరు గాయపడ్డారు. మహబూబాబాద్‌ జిల్లాలో భారీ వర్షాల వల్ల నలుగురు మృత్యువాత పడ్డారు. తాడ్వాయి మండలం కాల్వపల్లి వద్ద వెంగమాంబ చెరువు మత్తడి వరదలో మునిగి జెరిపోతుల మల్లికార్జున్‌(35) మృతి చెందాడు. గూడూరు మండలం బొల్లెపల్లిలో పిడుగుపడి తిరుతమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. తొర్రూరు మండలం వెంకటాపురం శివారు బర్ల చెరువులో చేపలవేటకు వెళ్లి గుండాల నర్సయ్య అనే వ్యక్తి వరదనీటిలో మునిగి మృత్యువాతపడ్డాడు.


వరంగల్‌ జిల్లా దుగ్గిండి మండలం శివారులోని చెరువులోకి ఒక గుర్తుతెలియని వృద్దురాలి మృతదేహం కొట్టుకువచ్చింది. మహబూబాబాద్‌ జిల్లాలోని కేసముద్రం, ఇంటికన్నె రైల్వేస్టేషన్‌ మధ్య మోరీ పూర్తిగా కొట్టుకుపోయింది. ఈప్రాంతంలో 30 మీటర్ల పొడవు రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయి రైలుపట్టాలు గాలిలో వేలాడుతూ కనిపించాయి. వరద ఉధృతికి మహబూబాబాద్‌-తాళ్లపూసలపల్లి రైల్వే మార్గం మధ్య 432 కి.మీ. వద్ద 20 మీటర్ల పొడవు ట్రాక్‌ కొట్టుకుపోయింది. ఏటూరునాగారం మండలంలో జంపన్నవాగు ఒడ్డున ఉన్న బూటారం గ్రామానికి ముంపు ప్రమాదం ఉండటంతో అధికారులు 230మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. వరంగల్‌ జిల్లాలో దుగ్గొండి మండలం కేంద్రం చెరువులోకి గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహం కొట్టుకువచ్చింది.


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జనజీవనం అతలాకుతలమయ్యింది. ఖానాపూర్‌ మండలంలో రెంకోని వాగు ఉధృతికి దిలావర్‌పూర్‌ వద్ద తాత్కాలిక రోడ్డు తెగిపోవడంతో ఖానాపూర్‌, కడెం మండలాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. కాగా, ఉమ్మడి మెదక్‌ జిల్లాలో అత్యధికంగా పాతూర్‌లో రికార్డుస్థాయిలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏడుపాయాల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 54 ఇళ్లు పాక్షికంగా కూలినట్లు అధికారులు తెలిపారు.


ప్రమాదం అంచున ఖమ్మం మున్నేరు బ్రిడ్జి

ఖమ్మం మున్నేరుపై బైపా్‌సపై ఉన్న బ్రిడ్జి ప్రమాద అంచుకు చేరింది. 36 అడుగులకు మున్నేరు వరద చేరడతో బ్రిడ్జి ఊగుతోంది. ఎప్పుడు పడిపోతుందో అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీంతో ఆ బ్రిడ్జిపై పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. బ్రిడ్జి మధ్యలో కనిపిస్తున్న పగులు మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఖమ్మంనుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఈ బ్రిడ్జినే కీలకం. ప్రస్తుతం మున్నేరుపై ఉన్న పాతబ్రిడ్జి వరదలో మునిగిపోయింది.

Updated Date - Sep 02 , 2024 | 07:52 AM