Palwancha: కేటీపీఎస్ టవర్ల కూల్చివేత..
ABN, Publish Date - Aug 06 , 2024 | 03:53 AM
అవి 58 ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గుర్తులు.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్తు వెలుగులు అందింది అక్కడి నుంచే.. తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే.. 100 మీటర్లపైన పొడువుతో ఎంతో గంభీరంగా కనపడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి.
కాలం చెల్లిన విద్యుత్తు కేంద్రాల
తొలగింపులో భాగంగా చర్యలు
58 ఏళ్లనాటి నిర్మాణాలు నేలమట్టం
కాలం చెల్లిన విద్యుత్తు కేంద్రాల తొలగింపులో భాగంగా జెన్‌కో చర్యలు
58 ఏళ్ల నాటి నిర్మాణాలు నేలమట్టం
పాల్వంచ, అగస్టు 5: అవి 58 ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గుర్తులు.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొలి విద్యుత్తు వెలుగులు అందింది అక్కడి నుంచే.. తొలి తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంది అక్కడే.. 100 మీటర్లపైన పొడువుతో ఎంతో గంభీరంగా కనపడే పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కూలింగ్ టవర్లు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. పాల్వంచ కేటీపీఎస్ కార్యకలాపాలు, నిర్వహణ (ఓ అండ్ ఎం) కూలింగ్ టవర్ల కూల్చివేత పనులు ఎట్టకేలకు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కాలం చెల్లిన విద్యుత్తు కేంద్రాలను కూల్చేయాలని కేంద్రం ఆదేశాలివ్వడంతో.. కేటీపీఎస్ పాత ప్లాంట్‌ను తొలగించేందుకు జెన్‌కో యాజమాన్యం చర్యలు చేపట్టింది.
2020లోనే కర్మాగారాన్ని మూసేసింది. కర్మాగారంలోని తుక్కు సామగ్రిని తీసుకోని, కూల్చేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి కాంట్రాక్టు అప్పగించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ కంపెనీ.. సుమారు 30 మంది సిబ్బందితో పేలుడు పదార్థాలను ఉపయోగించి సాంకేతికత సాయంతో 8 భారీ కూలింగ్ టవర్లను క్షణాల్లో నేలమట్టం చేసింది. 1966లో ఏపీఎస్‌ఈబీ పాల్వంచలో విద్యుదుత్పత్తి కోసం కేటీపీఎస్ కర్మాగారాన్ని (ఏ, బీ, సీ యూనిట్లను) ప్రారంభించింది. మొత్తం 3 యూనిట్ల ద్వారా 720 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించింది.
అప్పట్నుంచి నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ పాల్వంచ కేటీపీఎస్ ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. ఖమ్మం, కొత్తగూడెం పేరు తెలియని రోజుల్లోనే పాల్వంచ పేరును కేటీపీఎస్ దేశానికి పరిచయం చేసింది. గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కేటీపీఎస్ కూలింగ్ టవర్లను కూల్చడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Updated Date - Aug 06 , 2024 | 03:53 AM