ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Warangal: టెక్స్‌టైల్‌ పార్కు.. అడ్డంకులు దాటేనా?

ABN, Publish Date - Jun 29 , 2024 | 05:09 AM

లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పార్కులో 200కుపైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం..

  • ఐదు లక్షల మందికి ఉపాధే లక్ష్యంగా శ్రీకారం.. 22 కంపెనీలతో అప్పటి సర్కారు ఒప్పందాలు

  • ఏడేళ్లలో వచ్చింది 3 సంస్థలే

  • ‘పీఎం మిత్ర’లో దక్కని గుర్తింపు

  • నేడు వరంగల్‌కు సీఎం రేవంత్‌

  • పార్కు పరిశీలన.. మామునూరులో

  • విమనాశ్రయం ఏర్పాటుపై సమీక్ష

హైదరాబాద్‌/వరంగల్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పార్కులో 200కుపైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం.. 22 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మూడు సంస్థలు మాత్రమే ఇక్కడ ప్లాంట్లు ఏర్పాటు చేశాయి. పలు కారణాలతో మిగతా సంస్థలేవీ అడుగు పెట్టలేదు. మరోవైపు.. పీఎం మిత్ర పథకంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును చేర్చేందుకు కేంద్రం ససేమిరా అంటుండడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి శనివారం పార్కును సందర్శించనున్నారు. టెక్స్‌టైల్‌ పార్కును పట్టిపీడిస్తున్న మూడు ప్రధాన సమస్యలను పరిష్కరిస్తేనే ఇక్కడికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్న వాదన వినిపిస్తోంది.


పలు సమస్యలు.. కంపెనీల నిరాసక్తత

వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట, సంగెం మండలం చింతలపల్లి గ్రామాల్లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు 2017లో అక్టోబరు 22న అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రాథమికంగా 1,350 ఎకరాల్లో రూ.1,150 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టింది. అప్పట్లోనే 22 కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోగా.. ఏడేళ్లలో మూడు కంపెనీలు మాత్రమే వచ్చాయి. కేరళకు చెందిన కైటెక్స్‌ సంస్థ రూ.1,200 కోట్లతో 187ఎకరాల్లో చిన్నపిల్లల దుస్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది. రూ.588కోట్లతో సుమారు 50 ఎకరాల్లో గణేషా ఎకోపెట్‌, ఎకోటెక్‌ సంస్థ రెండు యూనిట్లను ప్రారంభించింది. యంగ్‌వన్‌ సంస్థ 8 ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకొచ్చినా పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక, మిగతా 19 సంస్థలు ఇటువైపు కూడా చూడలేదు.


కాగా, ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌ అండ్‌ అపెరల్‌ (పీఎం మిత్ర) పథకం కింద దేశవ్యాప్తంగా ఏడు టైక్స్‌ పార్కులను 2023 మార్చి 18న ప్రకటించిన కేంద్రం.. అందులో ఒకటి తెలంగాణకు కేటాయించింది. అయితే, ఈ పథకం కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం కొర్రీలు పెట్టింది. ఆ మార్గదర్శకాలను అమలు చేస్తే మొదటి దశలో రూ.300కోట్లు, రెండో దశలో రూ.200కోట్లు, మూడో దశలో రూ.500కోట్లను కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. ఇక్కడి కంపెనీలకు భారీగా సబ్సిడీలు లభిస్తాయి. అయితే, ఇప్పటికే భూ సేకరణ చేపట్టడంతోపాటు కొన్ని కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ పార్కు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది.


ఆ మూడింటిపైనే రేవంత్‌ దృష్టి

వరంగల్‌లోని మెగా టెక్స్‌టైల్‌ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పరిశీలించనున్నారు. ఇటీవలే ఢిల్లీలో కేంద్ర మంత్రులతో విస్తృతంగా చర్చలు జరిపిన రేవంత్‌రెడ్డి మెగా టెక్స్‌టైల్‌ పార్కును పట్టాలెక్కించేందుకు అవసరమైన మూడు ప్రధానాంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా పీఎం మిత్రలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కును చేర్చే అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. రవాణా వ్యవస్థను మెరుగు పర్చేందుకు ప్రత్యేకంగా రైల్వే లైన్‌ ఏర్పాటుతోపాటు ఎగుమతులు, దిగుమతులకు వీలుగా సౌకర్యాలు కల్పించాలని కోరినట్లు తెలిసింది. వరంగల్‌లోని మామునూరు ఎయిర్‌పోర్టును త్వరగా వినియోగంలోకి తీసుకువస్తే పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతాయని వెల్లడించినట్లు సమాచారం.


గాలిమోటారు వచ్చేదెప్పుడు?

వరంగల్‌ శివారులోని మామునూరులో 1930లో నిజాం హయాంలోనే ఎయిర్‌పోర్టు ఏర్పాటైంది. అయితే, 1980లో విమానాశ్రయాన్ని మూసివేశారు. 2007లో కాంగ్రెస్‌ ప్రభుత్వం విమానాశ్రయ అభివృద్ధికి ఒప్పందాలు కుదుర్చుకున్నా.. అడుగు పడలేదు. 2017లో మోదీ సర్కారు తీసుకొచ్చిన ఉడాన్‌ పథకంలో మామునూరును ఎంపిక చేశారు. మరోవైపు శంషాబాద్‌ విమానాశ్రయ నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వంతో జీఎంఆర్‌ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు.. 150 కి.మీ. దూరంలో 30 ఏళ్ల దాకా మరో ఎయిర్‌పోర్టును నిర్మించకూడదు. ఈ ఒప్పందం 2038 వరకు అమల్లో ఉండనుంది. అయితే.. ఈ షరతు నుంచి ఉపశమనం పొందేలా రేవంత్‌ సర్కారు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో విమానాలను నడిపేందుకు అవసరమైన ఇన్‌స్ట్రుమెంటల్‌ ఫ్లైట్‌ రూల్స్‌(ఐఎ్‌ఫఆర్‌), విజువల్‌ ఫ్లైట్‌ రూల్స్‌(వీఎ్‌ఫఆర్‌) అనుమతుల కోసం రాష్ట్ర ఏవియేషన్‌ విభాగం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు తాజా పర్యటనలో మామునూరు విమానాశ్రయంపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

Updated Date - Jun 29 , 2024 | 05:09 AM

Advertising
Advertising