Hyderabad: రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకు?
ABN, Publish Date - Jun 10 , 2024 | 04:08 AM
రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో సంస్థాగతంగా భారీ మార్పులు!
బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించే యోచన
ఎనిమిది ఎంపీ సీట్లు గెలవడంతో జోష్
డీకే అరుణకు కీలక పదవి!
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బీజేపీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. రాష్ట్ర శాఖకు కొత్త సారథి నియామకం జరగబోతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఈటల రాజేందర్‌కు వాస్తవానికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అది కార్యరూపం దాల్చకపోవడంతో ఆయనకు రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మరోసారి క్యాబినెట్‌లో అవకాశం లభించిన దృష్ట్యా, ఆయనను రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే ఉన్న ఈటల.. పార్టీ జాతీయ అగ్రనేతలతో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో కాంగ్రె్‌సకు ప్రత్యామ్నాయంగా తాము ఎదిగినట్లు తాజా ఎంపీ ఎన్నికలతో రుజువైందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ పట్టు కొనసాగించడం ద్వారా రాష్ట్రంలో అధికార పీఠం దక్కించుకోవచ్చని యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇద్దరు సీనియర్ నేతలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించినట్లు, వారికి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును విస్తృతంగా పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్న ప్రతిపాదన బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలనలో ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే బీసీ సీఎం నినాదాన్ని పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘మేం అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని హామీ ఇచ్చాం. అయితే, ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కలేదు.
అనంతరం జరిగిన ఎంపీ ఎన్నికల్లో బాగా పుంజుకొన్నాం. లక్ష్యానికి అనుగుణంగా ఓట్లు, సీట్లు సాధించాం. ఓవైపు బీఆర్‌ఎస్ కనమరుగవుతోంది. మరోవైపు అధికార కాంగ్రె్‌సపై వ్యతిరేకత పెరుగుతోంది. ఫలితంగా మమ్మల్ని ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తించారని మా నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. ఇక అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టడం ద్వారా తెలంగాణలో బీజేపీ మరింత క్రియాశీలమవుతుందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఇదే సమయంలో బీసీ నేతను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వల్ల కేడర్‌లో జోష్ పెరుగుతుందని మా నాయకత్వం భావిస్తోంది’’ అని ఆ నేత వివరించారు.
డీకే అరుణకు కీలక పదవి !
మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా విజయం సాధించిన డీకే అరుణకు త్వరలో కీలక పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కూడా కొనసాగుతున్నారు. కేంద్ర కేబినెట్‌లో డీకే అరుణకు పదవి లభించవచ్చని విస్తృత ప్రచారం జరిగింది. అయితే, వివిధ సమీకరణాల రీత్యా ఆమెకు పదవి లభించలేదని, అగ్రనాయకత్వం మరో కీలక పదవి కట్టబెట్టబోతోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Updated Date - Jun 10 , 2024 | 04:08 AM