Hyderabad: పోలింగ్ రోజున.. తగ్గిన పొల్యూషన్
ABN , Publish Date - May 16 , 2024 | 11:51 AM
ఓట్లేసేందుకు రెండు రోజుల ముందుగానే ప్రజలు వెళ్లడంతో నగరంలో వాహనాల రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. దీంతో సాధారణ రోజులతో పోల్చితే పోలింగ్ రోజున, ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత వాయు కాలుష్యం తగ్గినట్లుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.
- మే 11 డేటాతో పోల్చితే 13న2/3వ వంతు తగ్గిన వాయు కాలుష్యం
మహానగరంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న)న వాయు కాలుష్యం భారీగా తగ్గింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓట్లున్న నగరవాసులు వారి సొంతూళ్లకు వెళ్లడం, తెలంగాణ జిల్లాల నుంచి నగరానికి వలసవచ్చిన వారు పల్లెబాట పట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
హైదరాబాద్ సిటీ: ఓట్లేసేందుకు రెండు రోజుల ముందుగానే ప్రజలు వెళ్లడంతో నగరంలో వాహనాల రద్దీ కూడా గణనీయంగా తగ్గింది. దీంతో సాధారణ రోజులతో పోల్చితే పోలింగ్ రోజున, ఒక రోజు ముందు, ఒక రోజు తర్వాత వాయు కాలుష్యం తగ్గినట్లుగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. టీఎస్ పీఎస్బీ(TS PSB) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ నెల 11న గాలిలో పార్టిక్యులేట్ మేటర్ (పీఎం)-2.5 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్‌కు 45 మైక్రోగ్రాములు ఉండగా, పోలింగ్‌కు ముందు రోజు 22, పోలింగ్ రోజున 21, 14న 48 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. అలాగే, పార్టిక్యులేట్ మేటర్ (పీఎం)- 10 సూక్ష్మకణాలు మే 11న క్యూబిక్ మీటర్‌కు 130 మైక్రోగ్రాములు ఉండగా, మే 12న 44, మే 13న 41, మే 14న 80 మైక్రోగ్రాములు ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. మరొకవైపు ఇంధనం కాల్చడం వల్ల వాహనాల నుంచి వెలువడే విషపూరిత వాయువు నైట్ర స్ ఆక్సైడ్ మే 11న క్యూబిక్ మీటర్‌కు 30.3 మైక్రోగ్రాములు ఉండగా, మే 12న 25.9, మే 13న 27.4, మే 14 25.7 మైక్రోగ్రాములు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఇదికూడా చదవండి: TS News: మహిళ మెడికల్ ఆఫీసర్‌లపై లైంగిక వేధింపులు.. కామారెడ్డి డీఎంహెచ్‌ఓపై కేసు..
14 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు
వాయు కాలుష్యాన్ని అంచనా వేసే నిమిత్తం టీఎస్ పీసీబీ అధికారులు నగరంలోని 14 ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. సనత్‌నగర్, సెంట్రల్ యూనివర్సిటీ, జూపార్కు, నాచారం, కొంపల్లి(Zoopark, Nacharam, Kompally), మలక్‌పేట్, ఇక్రిశాట్, బాచుపల్లి, కంది ఐఐటీ, కోకాపేట్, ఈసీఐఎల్, బీరంగూడ తదితర ప్రాంతాల్లోని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల నుంచి కాలుష్య ప్రమాణాలను ఎప్పటికపుడు అంచనా వేస్తున్నారు. ఎన్నికల తేదీకి ఒక రోజు ముందు నుంచి ఈ నెల 14 వరకు వాహనాల రద్దీ తక్కువగా ఉండడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడలేదని, దీంతో వాహనాల సగటు వేగం పెరిగి కాలుష్య కారకాల విడుదల తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో నగరంలో రోజుకు పీఎం 2.5 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్‌కు 60, పీఎం 10 సూక్ష్మకణాలు క్యూబిక్ మీటర్‌కు 100 మైక్రోగ్రాములు ఉంటాయని వెల్లడించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: గాలిదుమారానికే కుప్పకూలుతున్నాయ్..
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News